నిత్యం సనాతన ధర్మం గురించి మాట్లాడుతానని చెప్పే ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రెండు రాష్ర్టాల్లో సంబురాలు చేసుకోలేదని పార్లమెంట్ సాక్షిగా అబద్ధం చెప్పారు. కఠిన పరిస్థితిలోనూ సత్యానికి కట్టుబడినవాడే మనిషి అన్న మాటను మరిచిపోయారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఆత్మ బలిదానాలను రక్తం ఏరులై పారిందని వక్రీకరించారు. ఇలాంటి వారిని రాజకీయంగా బహిష్కరించకపోతే రాజకీయాలు మరింత కలుషితమవుతాయని ప్రజలు గ్రహించాలి.
సనాతన ధర్మం గురించి రోజూ మాట్లాడే వాళ్లకు, బయటి దేశాలకు వెళ్లి భారతదేశం ధార్మిక దేశమని డబ్బా కొట్టేవాళ్లకు పతంజలి మహర్షి ప్రవచించిన అష్టాంగ మార్గం గురించి తెలిసే ఉండాలి. మనుషుల మానసిక ైస్థెర్యం, ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి యోగశాస్త్రంలో పతంజలి వివరంగా చెప్పారు. దాన్ని అష్టాంగ యోగం అంటారు. అందులో మొదటి నియమం ‘యమ’లోని అయిదు సూత్రాలలో మొట్టమొదటిది అహింస అయితే, రెండవది సత్యం. అంటే ఎప్పుడూ, ఏ సమయంలోనూ, ఏ కారణం వల్ల, ఏ అవసరానికీ అబద్ధం ఆడకుండా ఉండటం. ఎంత కఠిన పరిస్థితిలోనూ సత్యానికి కట్టుబడినవాడే మనిషి. సరదాకు కూడా అబద్ధం చెప్పకూడదు. అప్పుడే మనిషి గౌరవింపబడతాడని అన్నారు పతంజలి.
అయినవాళ్ల మధ్య, ఊరికే తేలిక విషయానికే అబద్ధం చెప్పకూడదంటే మరి మన విశ్వ గురు భారత ప్రధానమంత్రి మిగతా పార్లమెంట్ సభ్యుల మధ్య, చట్టసభ భవనమైన పార్లమెంట్లో దేశమంతా చూస్తుండగా ఎంత పెద్ద అబద్ధం చెప్పారు! అంటే ప్రజలకు విషయాలు తెలియవన్న అజ్ఞానమా? తనేం చెప్పినా వెర్రి వాళ్ల లాగా నమ్ముతారన్న అహంకారమా? ఏమని అర్థం చేసుకోవాలి? ఒక ఐదో క్లాసు పిల్లవాడు టీచరుకు ఎప్పుడైనా ఒక అబద్ధం చెప్తే, ఆ టీచర్ ఆ అబ్బాయిని శిక్షిస్తారు కదా! మరి దేశం సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోతే, రెండు రాష్ర్టాలూ సంబురాలు చేసుకోలేదని ఎలా బొంకారు నరేంద్ర మోదీ? తెలంగాణలో సంబురాలు అంబరాన్నంటాయి. ఈ ప్రాంత కష్టాలు ఉమ్మడి రాష్ట్రంలో చూసిన వాళ్లు ఆనందించలేదా? ఇప్పటికైనా 58 ఏండ్లకు విముక్తి కలిగిందని పండుగ చేసుకోలేదా? పోనీ ఈ పదేండ్ల తర్వాత విభజన వల్ల రాష్ట్రం బాగుపడకపోతే విచారించేవారేమో! కానీ మేధావి ముఖ్యమంత్రి పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందటం చూసి 2014 నుంచీ ఈ ప్రాంతవాసుల ఆనందం పెరుగుతున్నదే కానీ తగ్గటం లేదే!
మరి అత్యున్నత పదవిలో ఉన్న ఆయన అంత అబద్ధం ఎలా చెప్పారు? మొన్న జరిగిన 9 ఏండ్ల తెలంగాణ అవతరణ దినోత్సవ సంబురాలు చూడలేదా మోదీ? ఆ మాటకే బిత్తరపోయిన తెలంగాణ వాసులకు ఇంకో షాక్ ఇచ్చారు గౌరవనీయ ప్రధానమంత్రి. విభజన సమయంలో రక్తం ఏరులై పారిందట ఈ ప్రాంతంలో!
1969 ఉద్యమంలో 369 మంది యువతను ప్యారడైజ్ దగ్గర హెచ్చరిక కూడా లేకుండా కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్న క్రూరుడు కాసు బ్రహ్మానందరెడ్డి వల్ల రక్తం ఏరులై పారింది తెలంగాణ ఉద్యమంలో. అందుకే కేసీఆర్ 14 ఏండ్ల ఉద్యమాన్ని ఒక్క చుక్క రక్తం చిందకుండా నడిపారు. నిరాశ చెందిన 1200 మంది యువత చేసుకొన్న ఆత్మహత్యలు కూడా ఈ బీజేపీ వారిని కదిలించలేదు. ‘ఒక ఓటు.. రెండు రాష్ర్టాలు’ అన్న అబద్ధంతో మొదలైన వారి తెలంగాణ విద్వేషం ఇంకా కొనసాగుతున్నది.
రాష్ట్రం విడిపోయి, బాగుపడుతుంటే ఓర్వలేక ప్రధానమంత్రి మొదలుకొని రాష్ట్రంలో కార్యకర్తల దాకా అబద్ధాలు సాగిస్తూనే ఉన్నారు. మత చిచ్చు పెట్టడం, లేనిపోని వార్తలు ప్రచారం చేయటం చేస్తూనే ఉన్నాం. మరి ఈ పార్టీ మన రాష్ట్రంలో ఎలాగూ గెలవదు. వేరే రాష్ర్టాల్లో గెలిచినా, ముఖ్యంగా కేంద్రంలో అధికారం దక్కించుకున్నా తెలంగాణ మీద ఇంకెంత విషం కక్కుతారో మరి! ఆ పార్టీ వారు ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు ఈ అబద్ధాలను నిలదీసి అడగాలి. దేశం ముందు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పే ప్రధానమంత్రిని పదేండ్లు భరించాం. ఇంక చాలు. ఇది దేశానికే అప్రతిష్ఠ! ఇటువంటి వారిని రాజకీయ బహిష్కరణ చేయకపోతే ఇప్పటికే భ్రష్టు పట్టిన రాజకీయాలు ఇంకా కలుషితమవుతాయి. ప్రజలు గమనించాలి. తగిన బుద్ధి చెప్పాలి.
-కనకదుర్గ దంటు
89772 43484