దేశ స్వాతంత్య్ర పోరాటం గురించి కన్యాశుల్కంలో గిరీశం జట్కా బండి నడిపే వ్యక్తికి సుదీర్ఘంగా వివరిస్తే… దేశానికి స్వాతంత్య్రం వస్తే మా ఊరి హెడ్ కానిస్టేబుల్ బదిలీ అవుతాడా? అని అమాయకంగా అడుగుతాడు. ఎవరి సమస్య వాళ్లది. అమెరికా అంటే ప్రపంచానికి పెద్దన్న. అమెరికా తన ఒక్క దేశాన్నే కాదు, పరోక్షంగా మొత్తం ప్రపంచాన్ని పాలిస్తుంది. ఆ మాట నచ్చకపోతే ప్రపంచంపై ప్రభావం చూపుతుంది అనవచ్చు. అందుకే అమెరికా ఎన్నికలు అంటే ప్రపంచం ఆసక్తి చూపుతుంది. ఉత్కంఠకు తెర వేస్తూ రెండవసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ట్రంప్ విజయం సాధించడం ద్వారా అమెరికాలో ఒక చరిత్ర సృష్టించారు. వందేండ్ల కిందటి నాటి రికార్డ్‌ను బ్రేక్ చేశారు.
ఎవరి కోణంలో వాళ్లు ట్రంప్ విజయంపై ఊహాగానాలు, వ్యాఖ్యానాలు సాగిస్తున్నారు. ఎవరి ఊహాగానాలు ఎలా ఉన్నా? ఎవరు తమకు అనుకూలం, తమకు వ్యతిరేకం అని అంచనాలు వేసినా ట్రంప్ ఎన్నిక అయింది అమెరికాకు అధ్యక్షునిగా అని మరువరాదు. ట్రంప్ అయినా, ఇంకొకరైనా అమెరికా అధ్యక్షునికి అమెరికా ప్రయోజనాలే ముఖ్యం తప్ప మరో దేశం కోసం త్యాగం చేసేవాళ్లు కాదు… ట్రంప్ అయినా, మరొకరైనా అమెరికా ప్రయోజనాలే ముఖ్యం.
Donald Trump | గ్రోవర్ క్లివ్ లాండ్ 1885-1889 అమెరికా అధ్యక్షునిగా ఉండి, తరువాత ఎన్నికల్లో ఓడిపోయి 1892లో గెలిచారు. ఇప్పటి వరకు ఒకసారి ఓడిపోయి మళ్లీ గెలిచిన వారిలో ఇప్పటివరకు వీరిదే రికార్డ్. 132 ఏండ్ల ఈ రికార్డ్‌ను ట్రంప్ బ్రేక్ చేశారు. గత ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన తర్వాత అతని రాజకీయ జీవితం ముగిసిపోయింది అనిపించింది. ఎన్నో కేసులు, ఎన్నో ఆరోపణలు… అయినా వాటిని తట్టుకొని ఫీనిక్స్ పక్షిలా ట్రంప్ తిరిగి నిలదొక్కుకోవడమే కాకుండా ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఏకంగా మన ప్రధాని మోదీ అమెరికా వెళ్లి ట్రంప్‌కు ఓటు వేయమని ఎన్నికల సభల్లో ప్రచారం చేశారు. ట్రంప్‌తో కలిసి మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం విమర్శలకు దారితీసింది. ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. ఈ సారి ట్రంప్ విజయం సాధించడం సహజంగా బీజేపీ శ్రేణులకు సంతోషం కలిగించింది.
జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు అమెరికా ప్రజలతో పాటు ప్రపంచదేశాలు కూడా ట్రంప్, బైడెన్ల మధ్య పోల్చి చూసుకున్నారు. అమెరికా ప్రజలైనా తెలంగాణ, ఆంధ్ర ప్రజలైనా తమ పాలకులను గత పాలకుల పని తీరుతో పోల్చి చూసుకోవడం సహజం. ట్రంప్, బైడెన్ల మధ్య పోటీ అనగానే ట్రంప్ గెలుపు నల్లేరు మీద నడక అనిపించింది. ఎప్పుడు కింద పడిపోతాడో, ఎప్పుడు ఎటు వెళ్తాడో తెలియని బైడెన్ కన్నా ట్రంప్ చాలా బెటర్ అని అనిపించడం సహజం. చివరి దశలో కమలా హారీస్‌ను రంగంలో దించడంతో ఆమె మంచి పోటీ ఇచ్చారు.
ట్రంప్ విజయం సాధించగానే హెచ్-1 బీ వీసాల మంజూరుపై ప్రభావం ఎలా ఉంటుందని ఓ మధ్యతరగతి తండ్రి ప్రశ్న, మన పిల్లల అమెరికా చదువులకు ట్రంప్ విజయం అనుకూలమా? వ్యతిరేకమా? అని సందేహం. అక్కడ చదువుకుంటే చదువు అయిపోగానే గ్రీన్ కార్డు ఇస్తామని ట్రంప్ గతంలో హామీ ఇచ్చాడు కదా? అమలు చేస్తాడా? అని ఓ తండ్రి డౌట్. ఎవరి కోణంలో వాళ్లు ట్రంప్ విజయంపై ఊహాగానాలు, వ్యాఖ్యానాలు సాగిస్తున్నారు. ఎవరి ఊహాగానాలు ఎలా ఉన్నా? ఎవరు తమకు అనుకూలం, తమకు వ్యతిరేకం అని అంచనాలు వేసినా ట్రంప్ ఎన్నిక అయింది అమెరికాకు అధ్యక్షునిగా అని మరువరాదు. ట్రంప్ అయినా, ఇంకొకరైనా అమెరికా అధ్యక్షునికి అమెరికా ప్రయోజనాలే ముఖ్యం తప్ప మరో దేశం కోసం త్యాగం చేసేవాళ్లు కాదు. మొత్తం ప్రపంచాన్ని అమెరికా తమ మార్కెట్‌గా చూస్తుంది. అమెరికా ప్రయోజనాలు ముఖ్యం తప్ప మన దేశమో, మరో దేశ ప్రయోజనాలో ముఖ్యం కాదు. ట్రంప్ అయినా, మరొకరైనా అమెరికా ప్రయోజనాలే ముఖ్యం.
ఒకవైపు ఓట్ల లెక్కింపులో ట్రంప్ మెజారిటీ సాధించబోతున్నారని వార్తలు వస్తుండగా, ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే భారత స్టాక్ మార్కెట్ ఇండెక్స్ దూసుకెళ్లింది. దాదాపు నెలరోజుల నుంచి ఎరుపెక్కిన మార్కెట్ అమెరికా ఎన్నికల ఫలితాలతో పచ్చగా కళకళలాడింది. రాజకీయపక్షాలు, మీడియా తమ తమ సిద్ధాంతాల ప్రకారం, రాజకీయ పాలసీల ప్రకారం ఫలితాలపై స్పందిస్తుంటాయి. ఒక్క స్టాక్ మార్కెట్ మాత్రం ఎలాంటి పక్షపాతం లేకుండా, రాజకీయ అనుకూలత, వ్యతిరేకతతో సంబంధం లేకుండా కేవలం లాభం/నష్టం అనే కోణంలోనే ముక్కుసూటిగా స్పందిస్తుంది. దేశాల మధ్య యుద్ధాలు, అమెరికా ఎన్నికలు, చైనా ఉద్దీపన పథకం వంటి అంశాలతో స్టాక్ మార్కెట్ నెలరోజుల నుంచి ఊగిసలాడుతున్నది. ఎరుపెక్కి ఆందోళన కలిగించింది.
గతంలో ఎప్పుడూ లేనివిధంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) రూ.లక్ష కోట్లను స్టాక్ మార్కెట్ నుంచి తరలించుకు వెళ్లారు. మార్కెట్లో భారతీయ ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడులతో పోలిస్తే ఈ లక్ష కోట్లు ఒక శాతం కూడా కాదు. అయితే, దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భారతీయ మార్కెట్ మీద విదేశీ ఇన్వెస్టర్లు నమ్మకం కోల్పోయారంటే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చైనా మార్కెట్ వారికి ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో ఇక్కడి మార్కెట్ నుంచి నిధులు చైనాకు తరలిస్తున్నారనిపించింది. ట్రంప్ విజయంతో దీనికి బ్రేక్ పడింది. ఇండియా, అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్‌కు ఉమ్మడి శత్రువు చైనా. శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టుగా చైనాకు వ్యతిరేకంగా ట్రంప్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఇండియాకు ప్రయోజనం కలిగించే అవకాశం ఉన్నది.
ఒక్క చైనా పైనే ఆధారపడటం ప్రమాదకరం అని చైనా ప్లస్ వన్ అనే నినాదంతో ఇండియా పట్ల సానుకూల ధోరణిని కరోనా కాలం నుంచి అమెరికాతో పాటు యూరప్ చూపుతున్నా యి. ట్రంప్ తాను అధికారంలోకి వస్తే చైనాపై ఆంక్ష లు విధిస్తానని ముందుగానే హెచ్చరించారు. దీనివల్ల ఇండియాకు ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నది. ఫలితాలు వస్తుండగానే స్టాక్ మార్కెట్ నిఫ్టీ 270 పాయింట్స్ పెరిగింది. సెన్సెక్స్ 900 పాయింట్స్ పెరిగింది. మార్కెట్ మూడ్ నెల రోజుల నుంచి ఎరుపెక్కితే ఈ రోజు పచ్చదనంతో మూడ్ మారింది. ట్రంప్ అధికారంలోకి రావడంతో మన దేశంలో ఐటీ రంగానికి, బ్యాంకింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ రంగాలకు మేలు జరుగుతుందని మార్కెట్ అంచనా వేస్తున్నది. బుధవారం ఈ రంగాలకు చెందిన స్టాక్స్ మంచి లాభాలను అందించాయి. ట్రంప్ గెలవగానే అమెరికాలో ఇండియా గెలిచింది అన్నంతగా సంబురపడాల్సిన అవసరం లేదు. మేలుతో పాటు ఇబ్బందులు సైతం లేకపోలేదు. ఇండియా ఎక్కువగా ఎగుమతి సుంకాలు విధిస్తున్నదని ట్రంప్ గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా ట్రేడ్ పాలసీల్లో ట్రంప్ మార్పులు తీసుకువచ్చే ప్రమాదం లేకపోలేదు. ఆ మార్పులు ఇండియాకు ఇబ్బంది కలిగించే అవకాశాలున్నాయి.
బ్రిటన్ ప్రధానిగా ఋషీ సునక్ ఎన్నిక కాగానే బ్రిటన్‌లో కన్నా మన దేశంలో హడావుడి ఎక్కువ కనిపించింది. నెమలి సింహాసనం సునక్ మనది మనకు ఇచ్చేస్తాడని, కోహినూర్ వజ్రాన్ని పువ్వుల్లో పెట్టిస్తాడని, టిప్తు సుల్తాన్ కత్తి పట్టుకొస్తాడని ఎవరి ఊహల మేరకు వాళ్లు వార్తలు వండివార్చారు. కమలా హ్యారిస్ భారతీయ మూలాలు, ట్రంప్ బృందంలో తెలుగింటి ఆడపడుచు గురించి వార్తలు వస్తున్నాయి. సునక్ అయినా, ట్రంప్ అయినా, కమలా హ్యారీస్ అయినా… ఇలా ఎవరైనా తమ దేశం కోసం పనిచేస్తారు. వాళ్ల దేశ ప్రయోజనాలు వారికి ముఖ్యం. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం అన్నట్టు. అమెరికా, భారత్ స్నేహం పరస్పర ప్రయోజనాల కోసం సాగుతుంది కానీ, ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేయరు. ట్రంప్ విజయం భారత్‌కు మేలు అని స్టాక్ మార్కెట్, వాణిజ్య వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. ట్రంప్ వల్ల ఇండియాకు, ఇండియా వల్ల అమెరికాకు ఎంత ప్రయోజనం అనేది కాలమే చెప్తుంది.
బుద్దా మురళి