తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక పథకాలతో పాటు ఇటీవల తీసుకువచ్చిన మైనారిటీ బంధు వరకు రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు కనీసం 80 లక్షల కుటుంబాలకు వివిధ సంక్షేమ, స్వయం ఉపాధి, సామాజిక భద్రత పథకాల ఫలాలు నేరుగా చేరువయ్యాయి. ఇవన్నీ కేవలం వ్యక్తిగత పరిపుష్టికి నిర్దేశించినవే. సామూహికంగా అందుబాటులోకి తేవడం ద్వారా తెలంగాణ సమాజం అనుభవంలో ఉన్న పథకాలు అనేకం.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి నేరుగా అందుతున్నాయి. పౌరులు, వారి కుటుంబాల ఉద్ధరణకు ఉద్దేశించిన స్కీములేకాక..ప్రజలందరి సౌలత్లకు నిర్దేశించినవి అనేకం. ఒక్కో పథకానికి ఒక్కో పేరు ఎంతటి పవిత్ర సంకల్పాన్ని ధ్వనిస్తుందో అమ లూ, కార్యాచరణలోనూ అంతే పవిత్రత ఉట్టిపడుతుంది. సాఫల్యం పరంగా సార్థకత చేకూరుతుంది. కులమేదైనా, మతమేదైనా, అనుసరించే విశ్వాసమేదైనా సగటు మనిషి, సగటు కుటుంబం స్థానంలో తన మస్తిష్కాన్ని కేంద్రీకరించే తెలంగాణ పరిపాలకులు కాబట్టే తలపోసి, తలపెట్టిన కేసీఆర్ పథకాలు కీర్తి పతాకాలుగా రెపరెపలాడుతున్నాయి. చివరాఖరి వ్యక్తికీ, చిట్టచివరి ఆవాసాలకూ సంక్షేమ, అభివృద్ధి ఫలితాలు వరమవుతున్నాయి. అందుకే వారంతా ఎవరికి వారు తమ నాయకత్వ శిఖరంగా కేసీఆర్‌ను ఓన్ చేసుకొన్నారు.
కేసీఆర్ పాలనలో ప్రతి అడుగూ, ప్రతి కదలికలో పురోగమనం ప్రజల ముందున్నది. ఇది కేసీఆర్ జమానాగా రాష్ట్రం వినుతికెక్కింది. కేసీఆర్ మనసు, మేధస్సు, సదాలోచనా అవిశ్రాంతంగా విధుల్లో ఉంటాయి. కాబటే ్టసీఎం కేసీఆర్ జీవం పోసిన ప్రతి స్కీమూ పాపులర్‌గా చెరగని ముద్ర వేసుకున్నాయి. ముఖ్యమంత్రి సామర్థ్యం, పటిమ ఆయా పథకాలలో ప్రతిఫలిస్తాయి.
సమసమాజ స్థాపనే తమ ప్రభుత్వ ప్రాధమ్యాల ఎజెండాగా తెలంగాణ ప్రభుత్వం సాగుతున్నది. ఉదాత్తమైన సమూల అభివృద్ధి, సమగ్ర సంక్షేమ పథకాలను అట్టడుగు, అణగారిన వర్గాల ప్రజల అనుభవంలో ఉంచారు కేసీఆర్. అందులో భాగంగానే మైనారిటీ బంధును తీసుకువచ్చారు. రాష్ట్రం అంతటా ఏకంగా 8,056 మైనారిటీ చేతివృత్తుల కుటుంబాలకు రూ. ఒక లక్ష వంతున రూ.80.56 కోట్లు పంపిణీ చేశారు.
ఇంటికి పెద్ద దిక్కుగా, పెద్ద కొడుకుగా తిరుగులేని ఆసరా మొదలు రైతుబంధు, రైతుబీమా, రైతు రుణ మాఫీ, దళితబంధు, బీసీ బంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, కంటి వెలుగు, డబుల్ బెడ్రూం ఇండ్లు సహా ఇటీవలి గృహలక్ష్మి వంటివి పరిచయం అక్కర్లేని ప్రజారంజకమైన పథకాలుగా భాసిల్లుతున్నాయి. సర్వేంద్రీయానాం నయనం ప్రధానం లోకోక్తికి దగ్గరగా కేసీఆర్ పరిపాలనలో సూక్ష్మ దృష్టికి కంటి వెలుగు కండ్లకు కట్టింది. కంటి వెలుగు పథ కాన్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని ఢిల్లీ, పంజాబ్ రాష్ర్టాల్లోనూ అమలు చేస్తామని ఆయా రాష్ర్టాల ముఖ్య మంత్రులు స్వయంగా చెప్పారంటే ఆ పథకానికి వచ్చిన రెస్పాన్స్ అలాంటిది.పొలాలకు కాళేశ్వరం పరవళ్ళు, ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఆకుపచ్చ హరిత హారపు తెలంగాణ తోరణానికి తళుకు బెళుకులయ్యాయి. నియామకాలు, నోటిఫికేషన్లలో వేగం పెంచారు. ఎవరూ వంక పెట్టలేని, వేలెత్తి చూపలేని విధంగా, ఇతర రాష్ర్టాలు, కేంద్ర ప్రభుత్వమూ నేర్చుకొని పేరు మార్చి పాటించేంతగా అనేక పథకాలు సక్సెస్ అయ్యాయి.
కేసీఆర్ సర్కారు గడప గడపకు శుద్ధమైన తాగునీటి జలాల మిషన్ భగీరథ కేంద్రానికి హర్ ఘర్ జల్ అయింది. తెలంగాణ రైతులకు ఆధారమైన రైతుబంధు కేంద్ర ప్రభుత్వానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అయింది. బలహీన వర్గాల బలోపేతానికి కేసీఆర్ తెలంగాణలో తీసుకొచ్చిన నిన్నమొన్నటి వినూత్న బీసీ బంధు క్షణాల్లో కేంద్రంలోని బీజేపీ మోదీ సర్కారుకు విశ్వకర్మ అయింది. మచ్చుకు ఈ మూడు పథకాల కాపీ చాలు కేసీఆర్ కీర్తి పతాకాల శక్తి ఏ పాటిదో తెలుసుకునేందుకు. స్వచ్ఛమైన మూలాలు ఉండబట్టే వివిధ పథకాలు అంతలా జన బాహుళ్యంతో అల్లుకుపోయాయి. సంక్షేమ పథకాల పరంగా కేసీఆర్ సర్కారును రాజకీయంగా ఢీ కొట్టలేమనే విపక్షాలు సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. అయినా కానీ ‘సద్ది తిన్న రేవు తలవాలె బిడ్డా’ అని తెలంగాణ సమాజంలో ఉన్న పెద్దల విశిష్టమైన హి తోక్తి తెలంగాణ ప్రజల మది లో పదిలంగా ఉందనే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తెరగాలి.
(వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్)
-ఇల్లెందుల దుర్గాప్రసాద్
94408 50384