‘వడ్డించేవాడు మనవాడైతే బంతి చివరన కూర్చున్నా మన వంతుకు వస్తుంది’ అని మన దగ్గర ఒక సామెత. అయితే ఆ సామెత ఓటరు మహాశయులకు ఎందుకో అస్సలు నచ్చదు. వడ్డించేవాడు తనదాకా రాకముందే మధ్యలోనే లేచి పోతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల విషయంలో అదే జరిగింది. కానీ, సినిమాల విషయానికి వస్తే ప్రజలు వేరేలా స్పందిస్తున్నారు.
తన అభిమాన సినీ హీరో సినిమా టికెట్ ధర ఎంత ఎక్కువున్నా ఆ సినిమా చూస్తరు. ఎన్నిసార్లయినా చూస్తరు. ఆ హీరోకు సంబంధించిన ఏదేని చిన్న ఈవెంట్ ఎక్కడ జరిగినా, దానికోసం కొట్లాడి మరీ తొక్కిసలాటలో టికెట్ కొనుక్కొని చూస్తరు. సినిమా విడుదల రోజు పూలదండలు, పాలాభిషేకాలు, రక్తదాన శిబిరాలు, హీరో పుట్టినరోజు అన్నదానాలు, హీరో పేరిట రకరకాల వస్తు పంపిణీలు.. అబ్బో చెప్తూ పోతే లిస్టు పెద్దగానే ఉంటది.
ఇక రాజకీయం విషయానికి వస్తే మన ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా ‘విషయం’ ఫలానా ఎమ్మెల్యేకు, కుదిరితే మంత్రికి, వీలైతే ‘ముఖ్యమంత్రి’కే చెప్పాలని ప్రయత్నిస్తాం. పొరపాటున ‘ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇప్పుడు లేదు’ అని పక్కవాళ్లు ఎవరైనా చెప్తే.. ‘ఐపాయే’ ఇగ అన్నట్టు బద్నాం చేసుడు షురూ జేస్తం. మనల్ని ఒక్కళ్లని కలువకుంటే, ముఖ్యమంత్రి అసలు ఎవ్వల్ని గూడ కలుస్తలేరని బద్నాం జేస్తం. ‘ఒక్క కుటుంబమే అధికారం చెలాయిస్తున్నదని, డబ్బు మొత్తం దుర్వినియోగం చేస్తున్నద’ని అని అడిగినోళ్లకు, అడగనోళ్లకు అందరికీ ప్రచారం చేసేస్తం.
పచ్చ మీడియా ఒకటి ఉండనే ఉన్నది మన తెలంగాణ పాలిట. ముందు నుంచి అబద్ధాలు వండి వార్చనీకి, ఇట్లాంటి వాళ్లను గంటలు గంటలు స్టూడియోలో కూచోబెట్టి వాడుకునేందుకు. ఆ సమయంలో ఆ యాంకర్ దగ్గరుండి చూసినట్టే చెప్తుంటరు జనాలకు.
అభిమానం సహజంగానే గుర్తింపు కోరుకుంటుంది. మన గురించి ఎక్కువ ఆలోచించాలని, మనకే ఎక్కువ విలువ ఇయ్యాల్ననే ఈగో ప్రతి మనిషికి కొంత ఉంటుంది. కానీ, మనం దాన్ని అదుపులో ఉంచుకోగలగాలి. అభిమానం అదుపులో ఉంచుకొనుడు ప్రేమికులు, పేరెంట్స్, చుట్టాలు, ఇరుగుపొరుగు, స్నేహితులు, ప్రయాణాల్లో తోటివారు ఇట్ల ప్రతి ఒక్కరి దగ్గరా పాటించాలి సుమా!
నిజానికి డబ్బుకు ఓటు ఎప్పుడో అమ్ముడుపోయింది. (డబ్బు, వస్తువు తీసుకొని ఓటేసిన వాళ్లను దృష్టిలో ఉంచుకొని మాత్రమే) డబ్బు తీసుకుంటే ఆ ఓటరుకు నైతిక హక్కు పోయినట్టే. నాయకులే అలవాటు చేశారని ఓటరు.. ఓటరు డబ్బు, వస్తువు ఇస్తేనే ఓటు వేస్తామన్నారనీ రాజకీయ నాయకులు.. ఇది ఇగ ఇప్పట్లో ఒడువని ముచ్చట. డబ్బు తీసుకొని ఓటేసి, ప్రతి సంక్షేమ ఫలం తనకు, తన అస్మదీయులకే రావాలనే కాంక్షతో కొంచెం కూడా ఓపిక లేక అర్థం పర్థం లేని అల్గుడు. ఆలోచన లేని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం.
పదేండ్ల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఊహించని మంచి పరిణామాలను మనం చూశాం. ఆ ఫలితాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుభవిస్తూనే ఉన్నాం. పాఠశాలల మూలంగా ఎంతోమందికి ఉచిత, నాణ్యమైన విద్య, జిల్లాకో మెడికల్ కాలేజీతో విరివిగా అందే వైద్యం, ముఖ్యంగా సాగు, తాగునీరు, 24 గంటల కరెంటు సౌకర్యాన్ని పొందుతున్నాం. దేశం మొత్తాన్ని మన తెలంగాణ వైపు చూసేటట్టు చేయగలిగిన ‘బీఆర్ఎస్’ పార్టీ తప్పకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడిని గుర్తిస్తుండేది, కొద్దిగా ఆలస్యమైనా. కానీ, ఇంతలోనే తొందరపడ్డాం. డబ్భు ఏండ్ల నుంచి జరిగిన అన్యాయాలు కనుమరుగు కాకముందే తొందరపడ్డాం. ఈ పదేండ్ల అభివృద్ధి విలువ మనకు పూచిక పుల్ల కూడా కాదని ‘మార్పు కావాలి’ అని తొందరపడ్డాం. ఊదర పాటకు భ్రమసిపోయి ఇప్పుడు ‘కాలుగాలిన పిల్లి’లెక్క తిరుగుతున్నాం. ఇటు కక్కలేక, అటు మింగలేక అవస్థలు పడుతున్నాం.
అన్యాయం ఏమంటే.. సినిమా హీరో దరిదాపులకు రానివ్వకున్నా ఆ హీరో మీద ఇంత కూడా కోపం పెట్టుకోని మనం… మంచిచేసిన రాజకీయ నాయకుని మీద కోపాన్ని పెంచుకున్నాం. ఇంట్లో వాళ్లకు తినడానికి కూడా ఉందో లేదో చూసుకోకుండా సినిమా హీరోలకు పూలు, పాలతో అభిషేకాలు చేసే మనం, దోస్తులను కూడా వెంటబెట్టుకొని అభిమాన హీరో సినిమాను ఎన్నిసార్లు చూస్తామో లేక్కేలేదు. కానీ, రాజకీయ హీరో మాత్రం మనం ఎప్పుడంటే అప్పుడు మన ముందుకే రావాలి,సమాధానం చెప్పాలి, సహాయం చేయాలి.
బహుళ ప్రయోజన పనులు ఎప్పటికైనా ప్రభుత్వమే చేస్తుంది. ఎన్నో విషయాలు చక్కగా ప్లాన్ చేసుకునే ఓటర్లు ఎందుకో ప్రభుత్వాల విషయంలో తక్షణ ఫలితాలే కావాలని కోరుకోవడం విడ్డూరం. పదేండ్ల స్వరాష్ట్ర పాలనలో మనం సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాంతరంగా చూడగలిగాం, అనుభవించాం. అయినా సరే అర్థం లేనివిధంగా అలిగాం. మనకు మంచిగనిపించి కూడా తొందరపడ్డాం. అందుకే వండి వడ్డించేవారినే గుర్తిద్దాం. అవకాశమిద్దాం. ఫలితం అనుభవిద్దాం. తొందరపాటు వద్దు.
-భోజన్నగారి
అనసూయ