కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలో శ్రీశైలం బ్యాక్‌వాటర్స్‌పై నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తెలుగు రాష్ర్టాల జల చరిత్రలో ఒక కీలకమైన, వివాదాస్పదమైన అధ్యాయం. దీని ప్రారంభం ఎన్టీఆర్ హయాంలో కేవలం 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో, మద్రాసు నగరానికి తాగునీరుతో పాటుగా కరువు పీడిత రాయలసీమకు సాగునీరు అందించాలనే ఆశయంతో మొదలైంది. అప్పట్లో ఇది సామాజిక అవసరంగా కనిపించినప్పటికీ, ఆంధ్ర ప్రాంత ఇరిగేషన్ ఇంజనీర్లు, రాజకీయ నాయకుల దీర్ఘకాలిక వ్యూహం దీని వెనుక ఉందనే వాదనలు ఉన్నాయి. రాయలసీమ దుర్భిక్ష సెంటిమెంట్‌ను ఉపయోగించి తెలంగాణ నాయకులను ఒప్పించి ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు.
ప్రారంభంలో వరద జలాలు మాత్రమే వాడతామని చెప్పినా, ఇప్పుడు శ్రీశైలం అట్టడుగు (854 అడుగుల వరకు) నుంచి కూడా నీళ్లు తీసుకువెళ్తున్నారు. శ్రీశైలం ప్రధానంగా విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కోసం నిర్మించిన ప్రాజెక్టు. విద్యుత్తు ఉత్పత్తి అయిన తర్వాత మిగిలిన నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేయాలి. కానీ వాస్తవంలో జరుగుతున్నది వేరు.
కాలక్రమేణా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం అనూహ్యంగా పెరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో 44,000 క్యూసెక్కులకు పెంచగా, తర్వాత ఏకంగా 80,000 క్యూసెక్కుల స్థాయికి చేరుకుంది. చిన్న కాలువగా మొదలైన పోతిరెడ్డిపాడు నేడు కృత్రిమ నదిలా మారింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణల వల్ల శ్రీశైలంలో కృష్ణా జలాలు పెన్నా బేసిన్‌కు మళ్లించబడుతున్నాయని తెలంగాణ ఆరోపిస్తున్నది. దీని ప్రభావం పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైతులపై తీవ్రంగా పడుతున్నది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా రోజుకు 3 టీఎంసీల వరకు తరలించాలని ప్రతిపాదన. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి ఆ నీటిని రాయలసీమకు, ఇతర ప్రాజెక్టులకు మళ్లించి, నాగార్జునసాగర్ లోటును గోదావరి నుంచి (పట్టిసీమ వంటి ప్రాజెక్టుల ద్వారా) భర్తీ చేయాలని ప్లాన్.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రస్తుతం పూర్తి స్థాయిలో నడుస్తున్న, అత్యంత విజయవంతమైన నీటి ప్రాజెక్టుగా కొనసాగుతున్నది. 2015-16లో రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకుని, 2016 నుంచి కార్యకలాపాలు మొదలైన ఈ పథకం 2025 సెప్టెంబర్ నాటికి పదేండ్లు పూర్తి చేసుకుంది. గోదావరి-కృష్ణా నదుల మధ్య మొదటి విజయవంతమైన ఎత్తిపోతల లింక్ ప్రాజెక్టుగా చరిత్రలో నిలిచిన పట్టిసీమ,ఇప్పటికీ క్రియాశీలంగా కొనసాగుతూ కృష్ణా డెల్టా రైతులకు వరప్రదాయనిగామారింది.
2026 జూన్ వరకు ఈ ప్రాజెక్టు గోదావరి వరద జలాలను గరిష్టం 8,500 క్యూసెక్కుల వరకు ఎత్తి, పోలవరం రైట్ మెయిన్ కాలువ ద్వారా కృష్ణా నదిలోకి మళ్లిస్తున్నది. ఇప్పటికీ 400 నుంచి 439 టీఎంసీలకు పైగా నీటిని కృష్ణా డెల్టాకు అందించి రైతులకు సాగునీరు, రెండవ పంట వెసులుబాటు, తాగునీరు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. 24 పంపుల (113 మెగావాట్లు)తో నడుస్తున్న ఈ పథకం 12 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసి లిమ్కా, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకపోవడంతో పట్టిసీమ డెల్టా (పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు) రైతులకు ప్రధాన ఆధారంగా కొనసాగుతోంది.
బనకచర్ల (పోలవరం-బనకచర్ల లింక్) ప్రాజెక్టు వివాదాలు ముందుకు వచ్చిన నేపథ్యంలో పట్టిసీమ మరింత ప్రాధాన్యత సంపాదించింది. బనకచర్ల ఇంకా ప్రతిపాదన దశలోనే ఉండగా, పట్టిసీమ ఇప్పటికే గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌లోకి తీసుకువచ్చి డెల్టా అవసరాలు తీరుస్తోంది. బనకచర్ల అమలైతే పట్టిసీమ ద్వారా వచ్చే గోదావరి నీటిని మరింత దక్షిణంగా రాయలసీమ (పెన్నా బేసిన్) వరకు మళ్లించి, కృష్ణా బేసిన్ లోటును భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నది. దీనివల్ల తెలంగాణ డౌన్‌స్ట్రీమ్ జిల్లాలపై అదనపు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
ఈ బనకచర్ల ప్రాజెక్టును మొదటినుంచీ తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రధాన కారణాలు ఏమిటంటే, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, గోదావరి వాటర్ ట్రైబ్యునల్ ఆదేశాలను ఇది ఉల్లంఘిస్తున్నదని, తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల గోదావరి జలాల వాటాను ప్రభావితం చేస్తున్నదని ఆరోపిస్తున్నది. అంతేకాకుండా, అవసరమైన అనుమతులు లేకుండా, డీపీఆర్‌ను దాచిపెట్టి, పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనాలు లేకుండానే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారని తెలంగాణ వైపు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
మరింత ముఖ్యంగా, ఇది పోతిరెడ్డిపాడు మాదిరిగానే మొదట చిన్న స్థాయిలో మొదలై, తర్వాత సామర్థ్యం పెంచి తెలంగాణ నీటి హక్కులను క్రమంగా దోచుకునే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, కేంద్ర ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) కొంతకాలం క్లియరెన్స్ ఇవ్వకపోవడం తెలంగాణకు తాత్కాలిక విజయంగా కనిపిస్తున్నప్పటికీ, రాజకీయ ఒత్తిళ్లు మాత్రం తీవ్రంగా కొనసాగుతూనే ఉన్నాయి.
ఇంకొక పక్క కర్ణాటక అలమట్టి డ్యామ్ఎత్తు పెంచాలని (519.6 మీటర్ల నుంచి 524.256మీటర్లకు), నారాయణపూర్ డ్యామ్ సమీపంలో కొత్త బ్యారేజ్‌లు, తుంగభద్ర, భీమా నదులపై అదనపు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇవి కృష్ణా బేసిన్లో ఎగువ నుంచి నీటిని ఎక్కువగా నిల్వ చేసుకుని, డౌన్‌స్ట్రీమ్ (తెలంగాణ, ఆంధ్ర)కు వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గిస్తాయి. తెలంగాణ ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి లభ్యత తగ్గడంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ ఎగువ నిల్వలు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను (పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వంటివి) మరింతగా కష్టంలో పడేస్తాయి. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎగువ ప్రాజెక్టుల వల్ల తగ్గిన కృష్ణా నీటిని పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, వేలిగొండవంటి తన ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ, పెన్నా బేసిన్‌కు మళ్లించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది.
ఇందులో కీలకం బనకచర్ల లింక్ ప్రాజెక్టు (పోలవరం-బనకచర్ల). గోదావరి వరద నీటిని (సుమారు 200 టీఎంసీ) కృష్ణా బేసిన్ ద్వారా పెన్నాకు మళ్లించాలని ప్రతిపాదన. ఇది కృష్ణా డౌన్స్ట్రీమ్లోని తెలంగాణ జిల్లాల (పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి)కు నీటిని మరింత తగ్గించి, ఆంధ్ర రాయలసీమకు లాభం చేకూరుస్తుంది. కర్ణాటక నుంచి తగ్గిన ఇన్‌ఫ్లోను భర్తీ చేయడానికి గోదావరి నుంచి ఎక్కువ నీటిని కృష్ణా బేసిన్‌లోకి తీసుకురావడం ద్వారా ఆంధ్ర తన ప్రస్తుత కృష్ణా వాటా (66:34రేషియో)ను కాపాడుకుని, అదనపు లాభాలు పొందాలని చూస్తున్నది. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)లో కొనసాగుతున్న చర్చల్లో ఆంధ్ర 66:34 రేషియోను కొనసాగించాలని ఒత్తిడి చేస్తోంది. తెలంగాణ 50:50 లేదా ఎక్కువ వాటా (763 టీఎంసీ వరకు) కోరుతున్నా, ఆంధ్ర తిరస్కరిస్తున్నది.
కర్ణాటక ఎగువ ప్రాజెక్టులు కృష్ణా నీటి ప్రవాహాన్ని తగ్గించగా, ఆంధ్ర దాన్ని తనకు అనుకూలంగా మలచుకుని గోదావరి-కృష్ణా లింక్ ద్వారా రాయలసీమకు మేలుచేసే దిశగా పావులు కదుపుతున్నది. ఫలితంగా పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైతులు నీటి కొరతతో మరింత ఇబ్బంది పడతారు. కృష్ణా నది ఎగువ భాగంలో కర్ణాటక చేపట్టే కొత్త ప్రాజెక్టులు తెలంగాణ జల హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకుని, తెలంగాణ డౌన్‌స్ట్రీమ్ హక్కులను మరింత దెబ్బతీసే వ్యూహం అనుసరిస్తున్నట్లు తెలంగాణ రైతులు ఆరోపిస్తున్నారు.
2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో శ్రీశైలం ప్రాజెక్టులను చేర్చారు. కానీ తెలంగాణ జీవనాధారమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను బిల్లులో పొందుపర్చలేదు. ఒకప్పుడు తాగునీటి ప్రాజెక్టుగా ప్రారంభమైన పోతిరెడ్డిపాడు నేడు ప్రాంతీయ అసమానతలకు నిదర్శనంగా మారింది. రాయలసీమ రైతులకు కృష్ణా నీళ్లు ఇవ్వాలనే ఆలోచనకు తెలంగాణ రైతులు అభ్యంతరం చెప్పరు. కానీ కృష్ణా పరివాహక ప్రాంతంలోని తెలంగాణ జిల్లాల రైతులకు సరైన వాటా ఇవ్వకుండా ఎందుకు మళ్లిస్తున్నారు? అనేది ప్రశ్న.
తెలంగాణ రైతులు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఆంధ్ర రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నట్టుగా చూడనవసరం లేదు. ఇవి తెలంగాణ రైతులు వారి స్వీయ అస్తిత్వం గురించి లేవనెత్తుతున్న ప్రశ్నలు. ప్రాజెక్టులు రైతులకు ఉపయోగపడాలి కానీ పార్టీల రాజకీయాలలో పావులు కావద్దు. ఒక ప్రాంతం లాభపడితే మరొకటి నష్టపోకూడదు.
(వ్యాసకర్త: హెచ్‌సీయూలో అధ్యాపకుడు)
-ప్రొఫెసర్ చంద్రి రాఘవరెడ్డి