దేశంలో ముస్లిం సమాజానికి చెందిన ధార్మిక, సాంస్కృతిక, విద్యాసంస్థల నిర్వహణలో ‘వక్ఫ్ బోర్డు’ కీలక పాత్ర పోషిస్తుంది. స్వాతంత్య్రం నుంచి ఇటీవలి ‘2025-వక్ఫ్ చట్టం’ వరకు ఈ సంస్థ ఎన్నో మార్పులు, పలు అభివృద్ధి దశలను చవిచూసింది.
మతపరమైన, సామాజిక, ఆర్థిక ప్రాము ఖ్యం కలిగిన వక్ఫ్ ఆస్తులను నియంత్రించడానికి, రక్షించడానికి భారత ప్రభుత్వం కృషిచేస్తున్నది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు 195 4- వక్ఫ్ చట్టం పునాది వేసింది. కాలక్రమేణా, పాలనను మెరుగుపరచడానికి, దుర్వినియోగాన్ని నిరోధించడానికి చట్టాలు నవీకరించబడినాయి. వక్ఫ్ సవరణ బిల్లు – 2025 పారదర్శకతను పెంచడం, నిర్వహణను బలోపేతం చేయడం, వక్ఫ్ ఆస్తులను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నది. దీన్ని ఉమీద్ చట్టం అని పిలుస్తారు.
1995 చట్టం స్థానంలోకి ప్రస్తుత ఉమీద్ వక్ఫ్ చట్టం వస్తుంది. కేంద్ర న్యాయమంత్రి కిరెన్ రిజిజు చెప్పినట్టుగా మెరుగైన పర్యవేక్షణ, జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తూ పేరు మార్చబడింది. ఇస్లాం మతంలో వక్ఫ్ అంటే ‘ధార్మిక ప్రయోజనాల కోసం దానం చేసిన ఆస్తి’ అని అర్థం. ఇదొక నిర్దిష్ట ప్రయోజనం కోసం (సామాజిక సేవ, విద్య, వైద్యం మొదలైనవి) దేవునికి అంకితం చేయబడిన ఆస్తి. ఈ ఆస్తిని అమ్మడం లేదా బదిలీ చేయడం సాధ్యం కాదు. దాని ఆదాయం నిర్దిష్ట ధార్మిక లేదా సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది. మతపరమైన ప్రయోజనాల కోసం శాశ్వతంగా భూములను ఇవ్వాలనుకునే లేదా దానం చేయాలనుకునే వారిని వకీఫ్ అంటారు. ఈ సమష్టి విరాళాలను వక్ఫ్ బోర్డు అని పిలిచే ఒకే సంస్థ కింద ఉంచుతారు. ముతవలి నేతృత్వంలోని దానం చేసిన భూములను ఈ వక్ఫ్ బోర్డు నిర్వహిస్తుంది.
వక్ఫ్ బోర్డులపై విమర్శలు ఎందుకున్నాయంటే… వక్ఫ్ చట్టం, ట్రస్ట్ చట్టాల మధ్య వ్యత్యాసం ఉన్నది. ట్రస్ట్ చట్టం తప్పనిసరికాదు, ప్రైవేటు ఉపయోగం కోసమే ఉద్దేశించబడినది. అయితే, వక్ఫ్ చట్టం శాశ్వతమైనది, దాతృత్వమైనది. 1913, 1923, 1954, 1955లలో చట్టాలు జరిగాయి. పార్లమెంటరీ ప్యానెల్ ప్రకారం వక్ఫ్ దేశంలో రక్షణ, రైల్వేల తర్వాత మూడవ అతిపెద్ద భూ యజమాని. దీనికి 9.4 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి , 8.4 లక్షల ఎకరాల స్థిరాస్తులున్నాయి. దీనికి కేంద్ర స్థాయిలో ఒక ప్రధాన బోర్డు ఉండగా, రాష్ట్ర స్థాయిలో 32 బోర్డులున్నాయి. 2006 రాజేందర్ సచార్ నేతృత్వంలోని కమిటీ వక్ఫ్‌పై ఒక ప్రత్యేక అధ్యాయాన్ని రాసి వక్ఫ్ చట్టంలోని దుష్ప్రభావాలను, ప్రధానంగా ఈ వక్ఫ్ ఆస్తులను తమ ప్రైవేటు ఉపయోగం కోసం ఉపయోగిస్తున్న ముతవలిల అవినీతి, భూ దోపిడీ, భూముల ఆక్రమణలను స్పష్టంగా పేర్కొన్నది. వక్ఫ్ ఆస్తులను సరిగ్గా ఉపయోగించుకుంటే రూ.12,000 కోట్ల జీవీఏ (స్థూల విలువ) సృష్టించబడి ఉండేదని, మైనారిటీ వర్గాలలో, ముఖ్యంగా ముస్లింలలో పేదరికాన్ని తొలగించవచ్చని, కానీ, అది రూ.163 కోట్లను మాత్రమే సృష్టించిందని పేర్కొన్నది. దేశంలోని ఏ కోర్టుకు వక్ఫ్ జవాబుదారీగా ఉండదు. వక్ఫ్ బోర్డులో కొన్ని ప్రధాన సంస్కరణలు కూడా ఉండాలని సచార్ పేర్కొన్నారు.
2025 చట్టంలో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. గతంలో వక్ఫ్‌ను డిక్లరేషన్ లేదా ఎండోమెంట్ (వక్ఫ్- అలాల్- అవులాద్) ద్వారా ఏర్పాటు చేయవచ్చు. గతంలో వక్ఫ్ ఆస్తిని విచారించి నిర్ణయించే అధికారం వక్ఫ్ బోర్డు కలిగి ఉన్నది. వక్ఫ్ సర్వేలు నిర్వహించడానికి సర్వే కమిషనర్లు, అదనపు కమిషనర్లు నియమించబడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డులకు సలహా ఇవ్వడానికి కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌ను ఏర్పాటుచేసింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యులందరూ ముస్లింలుగా ఉండాలి, కనీసం ఇద్దరు మహిళా సభ్యులు కూడా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా వక్ఫ్ ఖతాలను ఆడిట్ చేయవచ్చు. సున్నీ, షియా వర్గాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డులున్నా ట్రిబ్యునల్ నిర్ణయం అంతిమమైనది. కోర్టులలో దాని నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీళ్లు నిషేధించబడ్డాయి. ఇప్పుడు కొత్త ఉమీద్ చట్టం పన్ను పర్యవేక్షణ, న్యాయ పర్యవేక్షణ, ప్రభుత్వ పర్యవేక్షణను మార్చింది. దాతలు కనీసం ఐదేండ్లు ముస్లింలను ఆదరిస్తూ ఉండాలి, ఆస్తిని కలిగి ఉండాలి. వక్ఫ్‌గా గుర్తించబడిన ఏదైనా ప్రభుత్వ ఆస్తి వక్ఫ్‌గా నిలిచిపోతుంది. యాజమాన్య వివాదాలను కలెక్టర్ పరిష్కరిస్తారు, అతను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తాడు. రాష్ట్ర రెవెన్యూ చట్టం ప్రకారం సర్వేలు నిర్వహించడానికి, పెండింగ్‌లో ఉన్న సర్వేలు ఆదేశించడానికి కలెక్టర్లకు అధికారం ఉంటుంది. కొత్తగా సృష్టించబడిన వక్ఫ్ బోర్డులో ఇద్దరు ముస్లిమేతరులను చేర్చవచ్చు, బోర్డును మార్చవచ్చు. బోహ్రా ఆగాఖానీ కమ్యూనిటీల నుంచి ఒక్కొక్క సభ్యునికి సమాన స్థలాన్నిస్తుంది (రాష్ట్రంలో వక్ఫ్ ఉంటే) ట్రిబ్యునల్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది.
ఇప్పుడు వక్ఫ్ మౌఖిక రూపంలో కాకుండా డాక్యుమెంట్ రూపంలో చేయాలి కానీ స్వాతంత్య్రం నుంచి వక్ఫ్ మౌఖిక రూపంలో ఉంటూ వచ్చింది. ల్యాండ్ సర్వేయర్‌గా జిల్లా కలెక్టర్‌ను కంపోజ్ చేయడమనేది ప్రభుత్వం ముస్లింల వ్యక్తిగత చట్టాలలోకి ప్రవేశించడం లాంటిది. ఇది ప్రధానంగా షరియా ద్వారా నిర్వహించబడుతుంది. 6 నెలల్లో పోర్టల్ నిర్వహణ, భూముల గురించి డేటా, వారసత్వం.. మొదలైనవి నిర్వహించడం చాలా కష్టమైన పని. కొంతమంది విద్యావేత్తలు కేంద్రం వక్ఫ్ ప్రధాన భూములపై దృష్టిపెట్టిందని విమర్శిస్తున్నారు. అయితే ఉమీద్ చట్టంలోని కొన్ని చర్యలను ముస్లిం సమాజం కూడా స్వాగతిస్తున్నది. మహిళా ముస్లింలతో బోర్డు పునఃరూపకల్పనను నల్సార్ మాజీ వైస్ చాన్స్‌లర్ ముస్తఫా స్వాగతించారు. రికార్డులు వక్ఫ్ భూముల డిజిటలైజేషన్‌ను అంగీకరించారు. కానీ 6 నెలలు చాలా తక్కువని అతను భావించినట్టుగా ముస్లిం సమాజం, ప్రభుత్వం ఎక్కడ ఎప్పుడు సమస్య తలెత్తినా చేతులు కలిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కూడా ప్రభుత్వానికి ఆయన సూచిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా భారతదేశం గొప్ప వైవిధ్యానికి నిలయం. దీనిలో ప్రజలు చాలా విభిన్నమైన, రంగురంగుల దేశాన్ని రూపొందిస్తారు. ఈ కాలంలో ప్రతి అంశం మారుతున్నది. వక్ఫ్ బోర్డు కూడా దాని ఆస్తులను ఆధునీకరించి, హేతుబద్ధీకరించాలి. దాని సభ్యుల శ్రేయస్సు కోసం ఉపయోగించాలి. దీనిని ప్రత్యర్థి వాదానికి అవకాశంగా తీసుకోవాలి.