2023, జూలై 24.. వీఆర్ఏల జీవితాల్లో మర్చిపోలేని తేదీ. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వీఆర్ఏల రెగ్యులరైజేషన్ జీవో ఎంఎస్ నెంబర్ 81 విడుదల కావడం ఆనందదాయకం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 20,555 మంది వీఆర్ఏల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నా కృతజ్ఞతలు. తరతరాల నుంచి ప్రజలకు సేవచేస్తున్న వీఆర్ఏలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడం రాష్ట్రంలో చిరు ఉద్యోగులకూ న్యాయం జరుగుతున్నదనే దానికి తాజా ఉదాహరణ.
ఏ రాష్ట్రంలో లేనివిధంగా అడగకముందే వీఆర్ఏలను పే స్కేల్ ఎంప్లాయిస్‌గా గుర్తిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం అభినందనీయం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూస్తున్న వీఆర్ఏలను ప్రభుత్వం గుర్తించడంతో వీఆర్ఏల కుటుంబసభ్యులు ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాలలో సహాయకులుగా పనిచేస్తున్న వీఆర్ఏలకు సరైన గౌరవం, గుర్తింపు లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతం వీఆర్ఏలకు ఒక గౌరవం దక్కింది. ఏ ఉద్యోగ సంఘాలతో కూడా ప్రభుత్వం ఇన్నిసార్లు చర్చలు జరుపలేదు, వీఆర్ఏలు చిన్న ఉద్యోగులైనా తెలంగాణ ప్రభుత్వం గుర్తింపునిచ్చి పలుసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి చర్చలు జరిపారు. ఎన్నో చిక్కుముడులున్నా అందరికీ న్యాయం జరిగేలా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దేశానికే ఆదర్శం. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వీరిలో 61 ఏండ్ల లోపువారు 16,758 మంది ఉన్నారు. 10వ తరగతి అర్హత కలిగినవారు 10,817 మంది నీటిపారుదల, మిషన్ భగీరథ విభాగాల్లో పనిచేస్తారని, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన 2,761 మంది రికార్డు అసిస్టెంట్ హోదాతో, డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన 3,680 మంది జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి రెండు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయటం, అలాగే వారికి ఉద్యోగ భద్రత కల్పించటం. ఇది కేసీఆర్ సునిశిత దృష్టికి అద్దం పడుతున్నది. ఇతర రాష్ర్టాలకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యమైన, సంచలన నిర్ణయాలను తీసుకుంటూ దేశానికి దిక్సూచిగా మారుతున్నది. గత పదకొండేండ్ల నుంచి రెవెన్యూ శాఖలో కీలక పాత్ర పోషించాం. వీఆర్ఏ వ్యవస్థ రద్దుచేసి మాకు రావాల్సిన, వీఆర్వోకు సమానమైన జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఇవ్వడం చాలా సంతోషం. సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు చెందిన వీఆర్ఏల సమస్యలు పరిష్కరించడం సంతోషదాయకం. వీఆర్ఏల విషయంలో చొరవ తీసుకున్న కేటీఆర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.
(వ్యాసకర్త: డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏ, రాష్ట్ర జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ)
కర్ణకంటి రాజేష్
96767 98908