గత ఏడాది నవంబర్ నాటి ముచ్చట. ఆనాటి అసెంబ్లీ ఎన్నికల కోసం తుక్కుగూడలో అనుకుంటా… కాంగ్రెస్ పార్టీ ఓ భారీ సభ ఏర్పాటుచేసింది. సదరు సభకు సోనియా, ప్రియాంక, రాహుల్ వగైరా వగైరా కాంగ్రెస్ పెద్ద నాయకులంతా విమానాలేసుకొని మరీ హైదరాబాద్‌కు వచ్చారు. సభలో పాల్గొన్నవాళ్లంతా పాడిన పాట ఒక్కటే. కేసీఆర్‌ది కుటుంబ పాలన. రాష్ర్టాన్ని ఆ కుటుంబమే శాసిస్తున్నది. స్వయంగా కుటుంబ వారసత్వం కారణంగానే పార్టీ పగ్గాలు చేపట్టిన రాహుల్.. ఆయన సోదరి ప్రియాంక తమ వారసత్వ పదవుల గురించి మరిచిపోయి మరీ కేసీఆర్ మీద, ఆయన కుటుంబం మీద నోరుపారేసుకున్నారు.
ఇక స్థానిక నాయకులు మరీ రెచ్చిపోయి ‘రాష్ట్రంలో యువకులకు ఉద్యోగాలు రాలేదు గానీ.. కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రం పదవులొచ్చాయి’ అంటూ చాలాకాలంగా వాగే సొల్లునే పొల్లు పోకుండా మైకులకు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, బీజేపీ, ఇతర చిల్లర మల్లర పార్టీలూ చాలాకాలంగా ఆ పాటనే ప్రజల మెదళ్లకు ఎక్కిస్తూ వచ్చారు. వీరికి పచ్చగ్యాంగులు పెంచి పోషించే మేధోమూకలు, వాళ్లు చెప్పినట్టు ఆటలాడే ప్రజా సంఘాలు; కొన్ని వేల సభలు, సమావేశాల్లో ఈ మాటనే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయాయి. తెలంగాణను ఓర్వలేని పచ్చగ్యాంగ్.. తమ పత్రికల్లో, టీవీల్లో ఇలాంటి సొల్లుగాళ్లను చాలామందిని కూర్చోబెట్టి పదే పదే ఆ మాటలే పలికించి.. పలికించి పులకించిపోయింది. మొత్తానికి ఈ మూకలన్నీ కలిసి ఆ భావనను ప్రజల మెదళ్లలోకి విజయవంతంగా జొప్పించగలిగాయి.
బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైన ఫార్మాసిటీలో కంపెనీలు నెలకొల్పేందుకు అవకాశం ఉండగా మళ్లీ భూసేకరణ ఎందుకనే ప్రశ్నకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు సమాధానం రాలేదు. ఈ వ్యవహారంలో సీఎం కుటుంబసభ్యుల అతి జోక్యం రైతులను బెదిరింపులకు గురిచేస్తున్నారనే దాక వెళ్లింది. ‘వెనక్కి తగ్గేదే లేదు. భూములు తీసుకుని తీరుతాం’ అని సీఎం సోదరుడు అనడం ఈ వ్యవహారంలో సీఎం కుటుంబం జోక్యానికి నిదర్శనం.
సీన్ కట్ చేస్తే.. ఏడాది తర్వాత అదే నవంబర్ నెల.. ఓ కుటుంబ పెత్తనానికి, అహంకారానికి, అరాచకానికి ఒక మాజీ సర్పంచ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ మేర కు ఓ సూసైడ్ నోట్ బయటపడింది. అది సీఎం కుటుంబాన్నే వేలెత్తి చూపుతున్నది. తమాషా ఏమిటంటే ఇప్పుడు పచ్చ మీడియాకు కుటుంబ పాలన, కుటుంబ పెత్తనం కనిపించడం లేదు. మరీ విడ్డూరంగా ఓ పచ్చాతిపచ్చ పత్రికకు ఆ వార్త ముఖ్యమైనదని కూడా తోచలేదు. పత్రికలో అసలు వాడనే లేదు. ఇక ఆనాడు కేసీఆర్‌ను కుటుంబపాలన అంటూ దుమ్మెత్తిపోసిన మరో జాతీయ పార్టీకి కూడా ఈ ఘటనలో కుటుంబ పాలన, పెత్తనం కనిపించడం లేదు.
టీవీ స్టూడియోల్లో తిష్టవేసి “చూపితివట నీ నోటను, బాపురే పదునాల్గు భువన భాండము లు” అన్నట్లు.. నోరు విప్పితే రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ప్రజాహక్కులు, మానవీయ హక్కులు అంటూ ఫుల్‌స్టాపులు కామాలతో సహా పలికే సొల్లు మేధావులెవరూ నోరు విప్పడం లేదు. అవును మరి.. ఇంటినుంచి బయటకు రాకుండా గోడ కట్టేంత ప్రజాస్వామ్యం వారిని పులకింపజేసి ఉండవచ్చు. అందునా ‘ఇప్పుడే అసలైన తెలంగాణ వచ్చినట్టుంది’ అనుకునేంత మైకం తాలూకు హ్యాంగోవర్‌ను అంత త్వరగా వదులుకోవడానికి వాళ్లు సిద్ధంగా ఉండకపోనూవచ్చు. అందుకే వర్సిటీలు దాటడం లేదు. టీవీ స్టూడియోల గేట్లు తాకడం లేదు.
నిజానికి కేసీఆర్ కుటుంబ సభ్యులెవరూ నియామకాల ద్వారా రాజకీయ జీవితంలోకి వచ్చినవారు కాదు. ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ఆ ఉద్యమ వేదికల ద్వారా ప్రజాజీవితంలోకి వచ్చినవారు. ఎవరికి వారు ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో నిలబడి, గెలిచి చట్టసభల్లోకి వచ్చినవారు. అప్పగించిన బాధ్యతలను ప్రశంసనీయంగా నిర్వర్తించిన వారు. పట్టణాభివృద్ధి మంత్రిగా హైదరాబాద్‌ను ఒకరు తీర్చిదిద్దితే.. నీటిపారుదల మంత్రిగా మరొకరు ప్రతిభ చూపించారు. మంచి పార్లమెంటేరియన్‌గా ఇంకొకరు నిరూపించుకున్నారు. అయినా సరే.. విపక్షాలు, విపరీత పక్షాలు ‘ఆ నలుగురు’ అంటూ రాగాలందుకున్నాయి. కేసీఆర్ ఇంట్లోనే ఉద్యోగాలు అన్నారు. చిలలువలు పలువలుగా ప్రచారాలు చేశారు.
మరి ఇదేంటి ‘బ్రదర్’?
సరే. అది గతం. మరి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నదేమిటి? ఇక్కడా నలుగురు బ్రదర్స్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడం లేదా? ఇది కుటుంబపాలన కాదా? అసలు వీళ్లు ఎవరు? వీరికి ఉన్న అర్హత ఏమిటి? వీరి చరిత్ర ఏమిటి? ఉద్యమాల్లో పాల్గొన్నారా? రాష్ట్ర సాధనకు రాళ్లెత్తారా? ఏ దశలో పాల్గొన్నారు? ఏ ఎన్నికల్లో గెలిచారు? రాష్ర్టానికి వీరి కంట్రిబ్యూషన్ ఏమిటి? ఇప్పుడు ఏ హోదాతో అధికారులను శాసిస్తున్నారు? ఆదేశాలు జారీ చేస్తున్నారు? ప్రభుత్వం చేయాల్సిన భూసేకరణకు వీళ్లెందుకు నడుం కడుతున్నారు? ఏ అధికారంతో చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేయబోతున్నదో, ఎలా చేయబోతున్నదో చెప్పడానికి వీళ్లెవరు? వీళ్లకున్న అధికారమేమిటి? ఒక గ్రామ మాజీ సర్పంచ్‌ను వేధించే ఫ్యాక్షన్ ధోరణులేమిటి? ఇదేమన్నా రాయలసీమనా? సీమ హింసాత్మక రాజకీయాలను ఇక్కడకు దిగుమతి చేస్తారా? రాష్ర్టాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు? ఈ అరాచక సంస్కృతి ఏమిటి?
నోరు విప్పితే ఒట్టు!
ఈ అంశం మీద పచ్చ మీడియా ఏనాడన్నా ఒక్క వార్త రాసిందా? మేక తోలు కప్పుకున్న మేధోమూకలు ఇదేమిటని ప్రశ్నించాయా? పోనీ, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబపాలన సాగుతుందని ఒక్క మాటైనా మాట్లాడిన పాపాన పోయాయా? ఒక కలెక్టర్ తన చాంబర్ వదిలి బయటకు వచ్చి ఏ హోదా లేని వ్యక్తిని సాదరంగా ఆహ్వానించిన ఘటనే చెప్తున్నది రాష్ట్రంలో ఏ పాలన నడుస్తున్నదో. ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాడు. కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తాడు. ఇది ఆరు నెలలుగా నడుస్తున్నది. అధికారులు నోరెత్తరు. ఏ పదవీ లేని ఆ సోదరుడికి బర్త్‌డే వస్తే పోస్టర్లు వెలుస్తాయి. ఒక సోదరుడు సెక్రెటేరియట్‌లోనే దందాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. అధికారులకు ఆదేశాలిస్తున్నాడనే విమర్శలూ వచ్చాయి. ఒక్క రెవెన్యూ శాఖయే కాదు, ఈ జాడ్యం పోలీసు శాఖకూ పాకింది. హైదరాబాద్ చుట్టుపక్కల జరిగే ఖరీదైన భూమి సెటిల్మెంట్లలో వారు వేలు పెడుతున్నారనే ఆరోపణ ఉంది. స్టేషన్‌కు వచ్చే బాధితులకు వారిని కలిసి సెటిల్మెంట్ చేసుకోవాలని పోలీసులే చెప్తున్నారని పుకార్లు గుప్పుమన్నాయి. ఈ మేరకు ప్రెస్‌క్లబ్‌లో బాధితులు కొందరు ఆ మధ్య పత్రికా సమావేశం పెట్టి మీడియాకు వివరించారు కూడా. అయినా మీడియా పట్టించుకోలేదు. మేధోమూకలు నోరు
విప్పవు. ఇప్పుడు కుటుంబపాలన ఇంట్లో అన్నదమ్ములకే కాదు, బావలు, బావమరుదులు, అల్లుళ్ల దాకా పాకడం కొత్త పోకడ. అమృత్ స్కీం టెండర్ల వ్యవహారంలో చాలాచాలా ఆరోపణలు వచ్చాయి, వస్తున్నాయి. పార్టీల హద్దులు దాటి మరీ కుటుంబాలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పొందుతున్నాయంటున్నారు.
ఈ వరుసలో తాజా అధ్యాయం ఫార్మా కంపెనీ కోసం భూముల సేకరణ. ఇందులో అల్లుడి పేరు వినబడింది. ఆయన కంపెనీ కోసమే ఈ సేకరణ జరుగుతున్నదనేది విపక్షాల మాట. ఈ విషయంలో అనేక అనుమానాలకు ప్రభుత్వమే తావిచ్చింది. బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీ ఏర్పాటైంది. అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అవకాశం ఉండగా తాజాగా మళ్లీ ఈ భూసేకరణ ఎందుకనే ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన సమాధానం ఇంతవరకు రాలేదు. ఈ సేకరణ వ్యవహారంలో సీఎం కుటుంబ సభ్యుల అతి జోక్యం రైతులను బెదిరింపులకు గురిచేస్తున్నారనే దాక వెళ్లింది. ‘వెనక్కి తగ్గేదే లేదు. భూములు తీసుకుని తీరుతాం’ అని సీఎం సోదరుడు అనడం ఈ వ్యవహారంలో సీఎం కుటుంబం జోక్యానికి అద్దం పడుతున్నది.
ప్రభుత్వం, అధికారులు జరపాల్సిన భూసేకరణలో సీఎం సోదరులు వేళ్లు పెట్టడాన్ని మీడియా, మేధో మూకలు ఎత్తి చూపకపోవడం చాలా విచిత్రం, విడ్డూరం. బీఆర్ఎస్ హయాంలో అర్ధరాత్రి మోటర్ సైకిళ్లెక్కి మారువేషాల్లో మల్లన్నసాగర్ వెళ్లిన వామపక్ష నాయకులు ఈ భూసేకరణ ఘర్షణలు, దాడులు అధికారుల తరిమివేత దాక వెళ్లాకగాని సందర్శించకపోవడం, తాజా వివాదం లగచర్లలో జరుగుతుంటే సీపీఎం నేత మల్లన్నసాగర్ పునరావాస గ్రామాల్లో పర్యటించి పునరావాసం బాగా లేదని స్టేట్మెంట్ జారీ చేయడం ఎందుకో.. ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు.
ఇటునుంచి నరుక్కు రావాల్సిన వ్యవహారాన్ని అటునుంచి నరుక్కురావాలని చూడటం ఏదో మ్యాచ్‌ఫిక్సింగ్ వ్యవహారమేమో అనిపిస్తే తప్పు అనుకున్నవారిది మాత్రం కాదు. లేటెస్ట్ వార్త ఏమిటంటే.. కొడంగల్ భూసేకరణ ఫార్మా కంపెనీ కోసం కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ కోసమని వామపక్షాలకు సీఎం చెప్పారట. పరిహారం పెంపు పరిశీలిస్తామన్నారట. ఈ హామీకి వామపక్షాలు సంతృప్తి చెందాయట. అనుకున్నదే! ఇస్తినమ్మ వాయినం. పుచ్చుకుంటినమ్మ వాయినం. ఉభయతారకం.. కానీయండి!!
కనిపించుట లేదు..!
ఆనాడు కేసీఆర్ లేస్తే ఓ విమర్శ, కూచుంటే ఓ విమర్శ అన్నట్టు ఆయన పాలనా కాలమంతా వెంటబడ్డ అనేక వేదికలు, ఫోరాలు, సంఘాలు ఎక్కడకు పోయాయి? రాష్ట్రంలో 800కు పైగా రైతు ఆత్మహత్యలు జరిగాయి. రైతు స్వరాజ్య వేదిక ఎక్కడపోయింది? సీఎం కుటుంబ సభ్యుడికి కలెక్టర్ స్వాగతం పలుకుతున్నాడు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎక్కడికిపోయింది? లగచర్లలో రైతుల ఇండ్లపై అర్ధరాత్రి దాడులు జరుగుతున్నాయి. పౌరహక్కుల సంఘాలు ఎటుపోయాయి? రైతుల భూములు లాగేసుకుంటున్నారు. ఎర్రపార్టీలు ఎక్కడకుపోయాయి? హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కబ్జాల పాలవుతున్నాయి. బెటర్ హైదరాబాద్ ఎక్కడ పోయింది? కొడంగల్ భూముల్లో ఫార్మా కంపెనీలు కాలుష్యం వెదజల్లడానికి రంగం సిద్ధమవుతున్నది. కాలుష్య పోరాట సమితి ఎక్కడ పోయింది? అప్పుడు అపరశివతాండవాలు చేసిన ఈ మూకలు ఇప్పుడు ఎందుకు తోకలు ముడిచి కూర్చున్నాయి? ఏ ప్రయోజనం కోసం? ఎవరి ప్రాపకం కోసం? తమ పోషకుల ఆదేశాలు అందుకుంటే తప్ప కదలవా? ప్రగతి భవన్ కట్టిన నాటి నుంచి దాని మీద పడి ఏడ్చే మీడియాగాళ్లు, వాళ్లు ప్రమోట్ చేసిన మేధావుల వేషంలో ఉన్న సోదిగాళ్లు అదే ప్రగతిభవన్ ప్రజాభవన్‌గా పేరు మారిన తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు వాడుకోవడం మీద నోరెత్తడం లేదు. ఎత్తితే వారిని ఎత్తి ఎత్తి మేధావులనే వీరతాడు వేసిన పచ్చమీడియా తొక్కేస్తుందనే భయం బహుశా వెంటాడుతుంటుందేమో మనకు తెలియదు.
తాజా ఖబర్
నిన్నటి నుంచి సోషల్ మీడియాను ఓ సినిమా తాలూకు క్లిప్పింగ్‌లు ముంచెత్తుతున్నాయి. ఆ సినిమా పేరు కేసీఆర్. సినిమా థియేటర్లో రోమాలు నిక్కబొడుచుకునే ఓ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుండగా.. తెరమీద కేసీఆర్ బొమ్మ కనిపించగానే ప్రేక్షకులు ఒక్కసారిగా లేచి.. తెలంగాణ, కేసీఆర్ అంటూ ఈలలతో కేరింతలు కొడుతున్నారు. అంతా యువకులే. కేసీఆర్ అనే పదమే వారిలో వైబ్రేషన్ సృష్టిస్తున్నది. ఉద్యమకాలం నాటి సభల్లో కనిపించిన ఉత్సాహం మళ్లీ చూస్తున్నట్టనిపించింది. దుష్ప్రచారాలకు వేగం ఎక్కువ, ఆయువు తక్కువ. గ్రహణాలైనా.. గంటలు-ఘడియల్లోనే ముగుస్తాయి!
ఎస్జీవీ శ్రీనివాసరావు