Mudragada | ఏపీలో వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ నివాసాలపై టీడీపీ శ్రేణుల దాడిపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నానని తెలిపారు. ఈ దహనకాండ కంటే కూడా ఏపీలో ఎమర్జెన్సీ పెట్టమని ప్రధానిని అడగండి అని సీఎం చంద్రబాబు నాయుడిని కోరారు. ఇలాగైనా మీ పదవీకాలం పూర్తయ్యే వరకు ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టడానికి వీలవుతుందని అన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌కు లేఖ రాశారు.
మాజీ మంత్రులు విడుదల రజినీ, అంబటి రాంబాబు, జోగి రమేశ్‌ను ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంత వరకు న్యాయమని ముద్రగడ ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పాలన లేదని అన్నారు. తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ జరగలేదని సీబీఐ రిపోర్టు ఇవ్వడంతో.. మీరు చేసి ఆరోపణలు అబద్ధాలు అని తేలిపోయాయని.. వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ డైవర్షన్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడూ అబద్ధం ఆడవద్దని.. ఒక అబద్ధానికి 100 అబద్దాలు చెప్పినా వాటిని సరిచేయలేం జాగ్రత్త అని తన తండ్రి చెప్పేవారని ఈ సందర్భంగా ముద్రగడ గుర్తుచేశారు. ఈరోజు మీరు ఆడిన అబద్ధానికి మీరు, మీ పార్టీ ఎంతో నష్టపోయిందని చెప్పారు. సీబీఐ సిట్ రిపోర్టు ఇచ్చిన తర్వాత అయినా సరే నెయ్యి కల్తీలో పొరపాటు జరిగిందని అంటే బాగుండేదని.. మీపై గౌరవం మరింత పెరిగేదని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు పాలనలో ఎంతసేపు కాపు కులాన్నే టార్గెట్ చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం ప్రస్తావించారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురిచేశారని తెలిపారు. మీరు అధికారంలోకి రావడం కోసం కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపించారని గుర్తుచేశారు. ఈ కులం వారికి మీపై ఎంత కోపం ఉన్నప్పటికీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రేమతో మీకు మద్దతిచ్చామని స్పష్టం చేశారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో కాపుల మద్దతు వల్లనే అప్పటివరకు డీలా పడిపోయిన టీడీపీ కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చారని తెలిపారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చాక కాపు కులానికి చెందిన వారినే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. దయచేసి ఈ కాపు కులాన్ని ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టు బట్టలతో పంపించే కార్యక్రమం చేయండని అన్నారు.

Mudragada1