Zaheerabad | జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రావడం లేదు. తమ అనుచరులకే ఎలాగైనా బీఫామ్‌లు దక్కించుకోవాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తుండటంతో అభ్యర్థుల ఎంపిక జాప్యమవుతోంది. నామినేషన్ల పర్వం ముగిసి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎంపీ సురేష్ కుమార్, మాజీ మంత్రి డా. చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, పార్టీ నేత ఉజ్వల రెడ్డిల మధ్య సయోధ్య కుదరడం లేదు. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే స్థానికంగా ఈ పంచాయతీ తేలకపోవడంతో లోకల్ లీడర్లు గాంధీ భవన్‌ను ఆశ్రయించారు.
జహీరాబాద్ పట్టణంలోని 37 వార్డులకు గానూ.. కాంగ్రెస్ పార్టీ తరఫున 78 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో తమకు కావాల్సిన వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు లోకల్ లీడర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల స్థానిక పట్టణ పార్టీ అధ్యక్షుడి సంతకంతో కూడిన అభ్యర్థుల జాబితా బయటకొచ్చింది. అది చూసిన మరో వర్గం ప్రజాప్రతినిధులు నాయకులు అభ్యర్థుల జాబితా తప్పని.. అధిష్టానం ఎవరికి ఎంపిక చేయలేదని ఎవరు ఆందోళన పడుద్దని వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. దీంతో అభ్యర్థుల ఎంపికలో ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు బయటపడింది.
అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య పంతాలు, పట్టింపులు కొలిక్కి రాకపోవడంతో పట్టణ అభ్యర్థులు ఈ విషయాన్ని జిల్లా పార్టీ అధ్యక్షురాలు దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో పార్లమెంట్ నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ సమస్య చివరకు గాంధీభవన్‌కు చేరింది. బీఫామ్ అప్పగించేందుకు సమయం దగ్గరపడుతుండటంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీంతో బీఫామ్ ఎవరికి వస్తుందో తెలియక అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకుల తీరుతో విసిగెత్తిన పలువురు బీఆర్ఎస్లోకి వలసబట్టారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపిక పంచాయతీ ఎటు దారుతీస్తుందో అంటూ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.