మార్చి 10 నాటి బీజేపీకి సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్టులో ఇలా ఉంది. భారత ఇమేజ్ను ప్రధాని మోదీ ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారని, అనన్యసామాన్యమైన గ్లోబల్ గుర్తింపుతో భారతదేశాన్ని ఆయన నడిపిస్తున్నారని, మోదీకి 20కి పైగా ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలు లభించడం ఆయన నాయకత్వానికే కాదు, ప్రపంచ వేదికపై 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని ఆ పోస్టులో బీజేపీ రాసుకొచ్చింది.
సంక్షిప్తంగా చెప్పాలంటే.. మోదీ ప్రపంచవ్యాప్తంగా మిత్రులను, పురస్కారాలను, ప్రశంసలను సంపాదించి, వివిధ దేశాల ప్రభుత్వాధినేతలతో సమావేశమవడం, ఫొటోలు దిగడం ద్వారా 140 కోట్ల మంది భారతీయులు గర్వపడే పనిచేశారని, తద్వారా ప్రపంచ యవనికపై ప్రతి భారతీయుడి గౌరవం ఇనుమడించిందని, మోదీ విదేశీ పర్యటనలు, అక్కడ ఆయన చేసే కార్యక్రమాల పట్ల భారతీయులు గర్వపడాలన్నది ఆ పోస్ట్ సారాంశం.
సరిగ్గా రెండు నెలల తర్వాత మే 10న 55 ఏండ్ల కిందటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విదేశీ శక్తులతో భారత ప్రధాని ఎలా వ్యవహరించాలో హిందూ జాతీయవాదులకు తెలియజేయడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. ‘మూణ్నాలుగు వేల మైళ్ల దూరంలో ఉన్న ఏ దేశమైనా సరే వర్ణాధిపత్యం ఆధారంగా భారతీయులకు ఆదేశాలిచ్చే కాలం చెల్లింది’ అని 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌కు నాటి ప్రధాని ఇందిరాగాంధీ చెప్పిన సందేశం ఆ వీడియోలో ఉంది. అమెరికా, చైనా హెచ్చరికలను సైతం ధిక్కరించి పాకిస్థాన్ విభజనకు కారణమైన యుద్ధాన్ని ఇందిరాగాంధీ ఎలా కొనసాగించారన్న విషయాన్ని మోదీ విమర్శకులు ఈ వీడియోలో ప్రముఖంగా చూపించారు.
మే 10న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీకి అత్యంత ఇబ్బందికరమైన పరిణామాల్లో ఒకదాన్ని సృష్టించారు. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణను భారత్ కంటే ముందు ప్రకటించడమే కాదు, కాల్పుల విరమణ ఘనత తనదేనని కూడా ట్రంప్ చెప్పారు. అది కూడా వాణిజ్యం నిలిపివేస్తాననే బెదిరింపుల ద్వారా ఇరు దేశాలను ఒప్పించానని ఆయన పేర్కొన్నారు.
మోదీ హయాంలో భారత స్థాయి పెరుగుదలను హిందూ జాతీయవాద సంస్థలు రాజకీయ లబ్ధి కోసం బాగా ఉపయోగించుకున్నాయి. 2023లో అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్లో చర్చ సందర్భంగా భారతదేశంపై అంతర్జాతీయంగా నమ్మకం పెరిగిందని మోదీ స్వయంగా చెప్పారు. తత్ఫలితంగా భారతీయుల్లోనూ విశ్వాసం పెరిగిందని ఆయన అన్నారు. 2024లో ప్రధాని మోదీ జోక్యం కారణంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొంతకాలం ఆగిందని, తద్వారా భారతీయ విద్యార్థులను తరలించేందుకు వీలు కలిగిందని బీజేపీ నేతలు ప్రకటించారు. అయితే, భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపివేసిన ఘనత తనదేనని ట్రంప్ ప్రకటించడంపై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ పేలాయి. వీటిని లక్షల మంది షేర్ చేశారు కూడా. భారతదేశ విధానాలు, నిర్ణాయక స్వాతంత్య్రంపై ప్రశ్నించే అవకాశాన్ని ఈ ఘటన విపక్షాలకు కల్పించింది.
మోదీ హయాంలో భారత్ విశ్వబంధుగా ఎదిగిందని బీజేపీ ప్రచారం చేసుకున్నప్పటికీ, ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత మోదీ మిత్రులు లేనివాడిగా, ఒంటరిగా కనిపించారు. పలు దేశాలు, కూటములు ఉగ్రదాడిని ఖండించి, భారతదేశానికి సంఘీభావం ప్రకటించాయి. కానీ, పాకిస్థాన్ పేరెత్తకుండా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నట్టు ఆరోపించాయి.
2014 నుంచి ప్రధాని మోదీ 151 విదేశీ పర్యటనలు చేశారని, 72 దేశాలను సందర్శించారని, అమెరికాను పది సార్లు సందర్శించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. అయినప్పటికీ, మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం కారణంగా మన దేశం ఒంటరిగా మిగిలిపోయిందని ఖర్గే విమర్శించారు.
ట్రంప్ తన మిత్రుడని మోదీ గతంలో స్వయంగా ప్రకటించారు. మతపరమైన వివక్ష, మైనారిటీల అణచివేత లాంటి సున్నితమైన భారతదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో ట్రంప్ తక్కువగా జోక్యం చేసుకుంటారని కేంద్ర పాలకులు భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా జాతీయ భద్రత, అంతర్జాతీయ వ్యవహారాల్లో వైఖరి వంటి ఎంతో ముఖ్యమైన విషయాల్లో మోదీని ట్రంప్ ఇరుకునపెట్టారు.
ట్రంప్ ఉగ్రవాదానికి సహజ వ్యతిరేకి అని భారత హిందూ జాతీయవాదులు భావించారు. ట్రంప్ ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని చూసి వారు అలా భావించి ఉండొచ్చు. అయితే, ట్రంప్ మాత్రం భారత్‌కు కొరుకుడుపడని విధంగా పాకిస్థాన్‌కు ఎక్కువ విలువిచ్చారు. భారత ప్రధాన శత్రువు పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్‌తో కలిసి ఆయన భోజనం కూడా చేశారు.
అయితే, ఈ ఒంటరితనం కాలక్రమేణా మరింత స్పష్టమైంది. ఐరాస భద్రతా మండలి సభ్యులను ఒప్పించడానికి అఖిలపక్ష బృందాలను కేంద్రం పంపినప్పటికీ పాక్‌ను తాలిబన్ ఆంక్షల కమిటీ చైర్మన్, కౌంటర్ టెర్రరిజం కమిటీ వైస్ చైర్మన్‌గా ఎన్నిక కాకుండా ఆపడంలో భారత్ విఫలమైంది. పాకిస్థాన్‌ను ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తున్న దేశంగా ప్రపంచ ముందు ఒంటరిని చేయలేకపోయింది. బదులుగా భారతదేశమే ఒంటరిగా నిలిచినట్టు కనిపిస్తున్నది. భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఐఎంఎఫ్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్‌ల నుంచి పాక్ భారీగా రుణాలను పొందింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నందుకు పాక్‌ను ప్రపంచవ్యాప్తంగా ఒంటరిని చేయాలని భారత్ భావించింది.
కానీ, వాస్తవానికి భారతే ఒంటరైంది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు విషయంలో పశ్చిమ దేశాల ఆంక్షలను ధిక్కరించడం వల్ల మొదలైన టారిఫ్ యుద్ధం మోదీ-ట్రంప్ బంధాన్ని మరింత సంక్లిష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆగస్టులో చైనాతో మోదీ స్నేహం చేయాల్సి వచ్చింది. అయితే, గత కొన్నేండ్లుగా భారత హిందూ జాతీయవాదులకు దేశీయ కథనాలు అల్లడంలో చైనాయే ప్రధాన ముడిసరుకుగా ఉన్న విషయం విదితమే. అమెరికా, చైనా వంటి ప్రపంచ శక్తులు మాత్రమే కాదు, ఇతర దేశాలు కూడా భారత్‌ను కాదని పాక్‌కు గట్టి మద్దతుగా నిలిచాయి. మోదీ ప్రభుత్వం ఎప్పటినుంచో చెప్తున్నట్టు గ్లోబల్ సౌత్ గొంతుకగా మారడంలో కూడా భారత్ విఫలమైంది.
ఇజ్రాయెల్-గాజా యుద్ధం ప్రపంచ సమస్యగా మారుతున్న సమయంలో దృఢమైన పాలస్తీనా అనుకూల వైఖరి చైనా గ్లోబల్ సౌత్ గొంతుకగా మారడానికి దోహదపడింది. మరోవైపు భారతదేశం తన సాంప్రదాయ పాలస్తీనా అనుకూల వైఖరి నుంచి దూరం జరిగి ఇజ్రాయెల్‌తో సన్నిహిత సంబంధాలను నెరిపింది.
ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలెల్ను భారత్‌కు ఆహ్వానించడాన్ని సెప్టెంబర్ 9న కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తీవ్రంగా ఖండించారు. బెజాలెల్ను రైట్ వింగ్ తీవ్రవాదిగా, ఇజ్రాయెల్ ఆక్రమణ, విస్తరణవాద ఎజెండాకు ప్రధాన కారకుడిగా విజయన్ వర్ణించారు. గాజాలో మారణహోమం జరుగుతున్న సమయంలో నెతన్యాహు సర్కారుతో ఒప్పందాలు కుదుర్చుకోవడం పాలస్తీనా పట్ల భారత చారిత్రక సంఘీభావానికి తీరని ద్రోహం చేయడమేనని విమర్శించారు. పాలస్తీనా సమస్యకు న్యాయమైన, శాశ్వత శాంతి మార్గం అన్వేషించకుండా ఇజ్రాయెల్‌తో సైనిక, భద్రత, ఆర్థిక సంబంధాలను కొనసాగించడం నీచమని దుయ్యబట్టారు. పశ్చిమ ఆసియాలోని ముస్లిం మెజారిటీ దేశాల పట్ల ఇజ్రాయెల్ వైఖరి భారత్-ఇజ్రాయెల్ దోస్తీకి ఒక కారణమని హిందూ జాతీయవాదులు అనుకోవచ్చు. కానీ, 21వ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన మారణహోమం జరుగుతున్న సమయంలో ఆయుధాలు, సాంకేతిక ఒప్పందాలు చేసుకోవడమనేది అన్ని సిద్ధాంతాలను కాలరాయడమే.
మోదీ ప్రభుత్వం విదేశాంగ విధాన ప్రాధాన్యాల్లో జాతీయ భద్రత, పొరుగు దేశాలకు అగ్ర పీఠం ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గతంలో చెప్పారు. 2019 స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసంలో మోదీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చేవారిని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని, ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసేవారిని ప్రపంచం ముందు దోషులుగా నిలబెట్టేందుకు భారత్ అన్ని శక్తులను ఏకం చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు భద్రత, ఉగ్రవాదంపై పోరు తమ సర్కారు తొలి ప్రాధాన్యమని కూడా అన్నారు. అయితే, వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో భారత శక్తిని మోదీ సర్కారు అతిగా అంచనా వేసిందా? అన్నది ఇక్కడ ప్రశ్న.
2025 నాటికి దక్షిణాసియాలో భారత ప్రభావం చాలా తగ్గిపోయింది.
షేక్ హసీనాకు భారత్ మద్దతివ్వడం, ఆమె భారత్‌లో ఏడాదిపాటు ఆశ్రయం పొందడం కారణంగా బంగ్లాదేశ్‌తో సంబంధాలు దాదాపుగా దిగజారాయి. మయన్మార్‌తో సరిహద్దును పంచుకునే మణిపూర్, నాగాలాండ్, మిజోరం రాష్ర్టాల్లో ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ (ఎఫ్ఎంఆర్)ను పరిమితం చేయడం, సరిహద్దు వెంబడి కంచె వేయడం, పౌరసత్వంపై విచారణలు వంటి విధానాల మూలంగా మయన్మార్‌తో సంబంధాలు సంక్లిష్టంగా మారాయి. మాల్దీవులు, శ్రీలంకల సంబంధాల విషయంలో భారత్‌కు చైనా తీవ్రంగా పోటీ ఇస్తున్నది. 2015లో రాజ్యాంగ సంక్షోభం తర్వాత నేపాల్‌తోనూ సంబంధాలు క్షీణించాయి. సరిహద్దు వివాదంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చైనా ప్రభావం పెరుగుతున్న కారణంగా డ్రాగన్‌తో మళ్లీ మళ్లీ వివాదాలు తలెత్తుతున్నాయి.
దక్షిణాసియాలో సమన్వయం కోసం సార్క్‌కు ప్రత్యామ్నాయంగా భారతదేశం సమర్థవంతమైన మరో కూటమిని నిర్మించలేకపోయింది. అయితే చైనా-పాక్-బంగ్లాదేశ్ కూటమిగా ఏర్పడుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. దక్షిణాసియా, మధ్య ఆసియా, ఆఫ్రికాలో చైనా విస్తరణకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) సహాయపడుతున్నది. బ్రిక్స్‌లో చైనా ఆధిపత్య శక్తిగా ఉద్భవించింది. చైనాను ఎదుర్కొనేందుకు భారత్ చేసిన క్వాడ్ లాంటి ప్రయత్నాలు ఇంకా ఫలితాలివ్వలేదు.
భారత్, ఇజ్రాయెల్, యూఏఈలతో కూడిన ఐ2యూ2 గ్రూప్‌పై సమయం, శక్తి, వనరులను ఇండియా పెట్టుబడిగా పెడుతున్నది. అయితే, ఆర్థిక, సాంకేతిక అంశాల్లో మాత్రమే సహకారం అందిస్తూ, భద్రతా సంబంధిత అంశాలను మినహాయించడం ద్వారా ఇది ప్రారంభమైంది. కరీబియన్ దేశాలతో సంబంధాలను మరింత పెంచుకునేందుకు భారత్ ప్రయత్నిస్తున్నది. అయితే 2025 సెప్టెంబర్‌లో చేపట్టిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ) వంటి భారత సొంత ప్రయత్నాలు చైనా బీఆర్ఐతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి.
భారతీయులు తనకు మరో అవకాశమిచ్చారని, ఈ అవకాశం భారత్‌ను విశ్వగురును చేస్తుందని 2019 లోక్‌సభ విజయం తర్వాత గుజరాత్లో జరిగిన ఒక ర్యాలీలో మోదీ అన్నారు. క్రమంగా భారత్ తనను తాను విశ్వబంధుగా ప్రచారం చేసుకున్నది. 2023 స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసంలో భారత్ గ్లోబల్ సౌత్ గొంతుకగా మారుతున్నదని మోదీ చెప్పారు. ఒక నెల తర్వాత 2023 సెప్టెంబర్ 18న మోదీ పార్లమెంట్లో భారతదేశం విశ్వబంధుగా స్థానం సంపాదించుకోవడం గర్వకారణమని, యావత్ ప్రపంచం భారతదేశాన్ని మిత్రుడిగా చూస్తున్నదని తనకు
తానుగా కితాబిచ్చుకున్నారు.
నిస్సందేహంగా భారత్ జీ20 సదస్సుకు అధ్యక్షత వహించడం గుర్తించదగిన విజయమే. ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ)ని శాశ్వత సభ్యుడిగా చేర్చడంతోపాటు గ్లోబల్ సౌత్ గొంతుకగా మారేందుకు భారత్ నిబద్ధతను ప్రదర్శించింది. అయితే, ఇజ్రాయెల్-గాజా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలు, గ్లోబల్ వార్మింగ్‌ను తీవ్రతరం చేసిన నష్టానికి పశ్చిమ దేశాలు ప్రపంచానికి పరిహారం ఇవ్వడానికి నిరాకరించడం వంటి కీలక అంశాల పట్ల ఎలాంటి వైఖరిని తీసుకోలేకపోవడం భారతదేశ ‘విశ్వబంధు’ బ్రాండింగ్‌కు ఏమాత్రం సరితూగలేదు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం అంతర్జాతీయ మద్దతును కూడగట్టడంలో భారత్ విఫలమవడమూ ఆశ్చర్యం కలిగించలేదు.
-స్నిగ్ధేందు భట్టా