బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యం అనేది సామాజిక న్యాయ సాధన దిశలో ఒక కీలక అడుగు. కానీ, ఈ లక్ష్య సాధనలో రాజ్యాంగ,చట్టపరమైన విధానాలను కచ్చితంగా అనుసరించాలి. ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గంలో లోపాలను ఎత్తిచూపడం కాదు, వాటిని సరిచేసుకొని శాస్త్రీయ, చట్టబద్ధ పద్ధతుల్లో ముందుకువెళ్లి కోర్టులో రిజర్వేషన్లు నిలబడేలా చేయాలని సూచించడమే ఈ వ్యాసం ఉద్దేశం.
కోర్టులు ఒక చట్టాన్ని పరిశీలించేటప్పుడు దాని శీర్షిక లేదా మాటల కూర్పు చూడవు. దాని అసలు ఉద్దేశం, వాస్తవ ప్రభావం ఏమిటో పరిశీలిస్తాయి. ఈ చట్టం నిజంగా సామాజిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకేనా? లేక తాత్కాలిక రాజకీయ లాభం కోసమా? అన్నదే ముఖ్యం. State of Bombay vs. F.N. Balsara (1951) తీర్పులో సుప్రీంకోర్టు ఇలా స్పష్టం చేసింది. A law must be tested by its true nature and character; its pith and substance determine its validity.
ఆర్టికల్ 123 ప్రకారం అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు తక్షణ పరిష్కారం అవసరమైన సందర్భాల్లో గవర్నర్ ఆర్డినెన్స్‌ను ఆమోదిస్తారు. అయితే, ఈ అనివార్యత న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. కృష్ణకుమార్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పులో సుప్రీంకోర్టు ఇలా చెప్పింది. ఆర్డినెన్స్‌ను పరిపాలన సౌలభ్యం కోసం వాడకూడదని, తాత్కాలిక ముసుగులో చట్టపరమైన శక్తిని కల్పించకూడదని పేర్కొంది.
2025 మార్చి 17న రాష్ట్ర శాసనసభ బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించింది. ప్రస్తుతం ఇవి రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈలోగా హైకోర్టు 2025 సెప్టెంబర్ 30లోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించడంతో ప్రభుత్వం ఆర్టికల్ 213 కింద పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను సిద్ధం చేసి గవర్నర్‌కు పంపింది. గవర్నర్ ఆమోదం పొందే వరకు ఇది చట్టరూపం దాల్చదు. ఇప్పటికే రాష్ట్రపతికి పంపిన బిల్లులు పెండింగ్‌లో ఉండగా, అదే అంశంపై ఆర్డినెన్స్ తేవడం రాజ్యాంగపరంగా గందరగోళం సృష్టిస్తుంది. టీవోఆర్ లేకపోవడం, ప్రజా సంప్రదింపులు జరగకపోవడం లాంటివి అనుమానాలను మరింత పెంచాయి. ప్రభుత్వం ఆధారంగా చూపుతున్న సర్వే.. ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఆర్టికల్ 340, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, 1952, కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ యాక్ట్, 2008 కింద ఈ సర్వే జరగలేదు. జస్టిస్ (రిటైర్డ్) బి.సుదర్శన్‌రెడ్డి వర్కింగ్ గ్రూప్ తన నివేదికను 2025 జూలై 19న సర్కారుకు సమర్పించింది. ఇది కూడా ఆర్టికల్ 340 కింద ఏర్పడిన చట్టబద్ధ కమిషన్ కాదు. బూసాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై నియమించిన కమిషన్ ఫిబ్రవరి 10న గ్రామీణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికను మాత్రమే ఇచ్చింది. ఏకసభ్య బూసాని కమిషన్ 2025 మార్చి 6న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై నివేదిక సమర్పించింది. ఈ రెండు నివేదికలు SEEEPC సర్వే డేటాపైనే ఆధారపడ్డాయి.
వికాస్ కిషన్‌రావు గవాళి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర (2021) తీర్పులో సుప్రీంకోర్టు మూడు ప్రమాణాలను నిర్దేశించింది.
1. స్వతంత్ర నిపుణుల కమిషన్ సేకరించిన గణాంకపరమైన డేటా తప్పనిసరి.
2. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు.
3. 50 శాతం మించాలంటే ప్రత్యేక పరిస్థితులను నిరూపించాలి. Indra Sawhney vs. Union of India (1992) తీర్పులో (పేరా 667) మండల్ కమిషన్ శాస్త్రీయ విధానాన్ని సుప్రీంకోర్టు ప్రశంసించింది. Field studies, public consultations and multi indicator analysis ensured fairness and constitutional legitimacy. పాట్నా హైకోర్టు (గౌరవ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, 2023) ప్రకారం చట్టబద్ధ కమిషన్ సేకరించిన క్వాంటిఫైయబుల్ డేటా లేకుండా రిజర్వేషన్ల పెంపు నిలబడదు.
ఆర్టికల్ 340 కింద ఏర్పాటైన మండల్ కమిషన్ ప్రజా విచారణలు, ఫీల్డ్ స్టడీస్, గణాంకపరమైన పరిశోధనలు చేసి సమగ్ర నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27 % రిజర్వేషన్లు అమలయ్యాయి.
అంబాశంకర్ కమిషన్ నివేదిక ఆధారంగా తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి.
పి.ఎస్.కృష్ణన్ నివేదిక ప్రకారం వైఎస్ఆర్ ప్రభుత్వం మైనారిటీలకు బీసీ-ఈ కింద 4 శాతం రిజర్వేషన్లు అమలు చేసింది. అప్పటి ఏపీ హైకోర్టు ఈ రిజర్వేషన్లను కొట్టివేసినా, ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ కమిషన్లు చట్టబద్ధత, పారదర్శకత, శాస్త్రీయత కలిగినవి. అందుకే వాటి ఆధారంగా తీసుకున్న రిజర్వేషన్ నిర్ణయాలు కోర్టుల్లో నిలబడ్డాయి.
పిత్ అండ్ సబ్స్టెన్స్ సూత్రం ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు సామాజిక న్యాయానికి శాశ్వత పరిష్కారమా లేక రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అనేది కీలకం. ప్రస్తుత డేటా- SEEEPC సర్వే, బూసాని కమిషన్, వర్కింగ్ గ్రూప్ నివేదికలు చట్టబద్ధ రక్షణ కలిగిన పునాదులు కావు.
ఈ లోపాలను సరిచేసి, ఆర్టికల్ 340 కింద లేదా ఇతర చట్టాల ప్రకారమైనా చట్టబద్ధమైన స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేసి, ప్రజా విచారణలు నిర్వహించి, గణాంకాలను బహిర్గతం చేసి, అన్ని ప్రామాణిక (empirical, scientific) పద్ధతులను అనుసరించి, రాష్ట్రపతి ఆమోదం పొందిన బిల్లుల రూపంలో శాశ్వత చట్టబద్ధత సాధించాలి. అదే సమయంలో 42 శాతం రిజర్వేషన్లు దీర్ఘకాలికంగా నిలబడేందుకు వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే ప్రక్రియను ప్రారంభించాలి.
అనేక తప్పులు చేసి దేశానికే తమ కులగణన సర్వే ఆదర్శమని చెప్పుకోవడం, ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, రాహుల్‌గాంధీ ప్రశంసలు.. ఇవన్నీ తప్పులను దాచిపెట్టడానికే. ప్రతి అడుగులోనూ ప్రామాణిక పద్ధతులకు తిలోదకాలు ఇస్తూ ఈ విధమైన ఆర్భాటపు ప్రచారాలు చేయడమంటే బీసీ వర్గాలకు ఉద్దేశపూర్వకంగా అన్యాయం తలపెట్టడమే.