డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, ఆకునూరి మురళి వంటి మేధావులు మరెందరినో ఈ తెలంగాణ సమాజం గౌరవిస్తుంది. కానీ, ఆ మేధావులు ఈ బీసీ రేషియో అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అధిక వ్యయం రాష్ట్రంలోని ప్రాణహిత-మంజీర-మానేరు వంటి అంతర్ నదుల అనుసంధానానికి ఖర్చుపెట్టాల్సి వచ్చింది.
ఒక నిర్దిష్ట ప్రాజెక్టుకు పంట కాలానికి పూర్తిగా ఒకే సోర్స్ నుంచి నీళ్లిచ్చినప్పుడు దానిపై పెట్టుబడి వ్యయం ఎంతయ్యింది? దానికింది నిర్దిష్ట ఆయకట్టులో ఎంత పంట పండింది? ఆ నీటితో మరేదైనా ఆదాయం సమకూరిందా కనీసం 1:1 నిష్పత్తిలో అంటే ‘ఒక్క రూపాయి ఖర్చు చేస్తే ఒక్క రూపాయి ఆదాయం రావాలి’ అని లెక్కించి బెనిఫిట్ కాస్ట్ రేషియో అంచనా వేస్తారు. దీనిలో అనేక లోపాలున్నాయి. కేంద్ర జలసంఘం ప్రమాణాలు బీ.సీ. రేషియో విషయంలో అశాస్త్రీయంగా, లోపభూయిష్ఠంగా ఉన్నాయి.
ఏ దేశం పట్టించుకోని బీసీ రేషియో: ఈ బీసీ రేషియో అనేది ఒక్క మన దేశంలో తప్ప ప్రపంచంలో మరే దేశంలోనూ కచ్చితంగా పాటించాల్సిన నిబంధన (మాండేటరీ) కానే కాదు. 1972లో ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ (రెండవ) ఈ నిబంధన ఉండాలని పేర్కొన్నది. బ్రిటిష్ పాలనలో 1901-03లో నియమించిన మొదటి ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ రిపోర్టులో ఈ నిబంధన కచ్చితంగా పాటించేదిగా లేదు. 1972లో మల్టీస్టేజెస్ లిఫ్ట్‌ల అవసరం దేశంలో ఎక్కడా రాలేదు. వాటిపై ఊహాజనిత ఆలోచనలు కూడా లేవు. కానీ, ఇప్పటి పరిస్థితుల్లో దేశవాప్తంగా ఈ లిఫ్ట్‌లు (బహుళ దశల్లో) అవసరమవుతున్నాయి. తప్పుడు లెక్కలను డీపీఆర్‌లలో రాస్తూ నిబంధనల ప్రకారమే అనుమతులున్నాయని అందరినీ, చట్టాలను, అధికారులను, వ్యవస్థలను మోసం చేస్తే అన్ని రాష్ర్టాల్లో, కేంద్ర ప్రభుత్వంలో కూడా బీసీ రేషియోను చూపెట్టడం కోసమే మోసపూరితంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం కోసం రూ.22 లక్షల కోట్లు (ఇవి నిజంగానే రాబోయే పదేండ్లలో పూర్తి చేయాలంటే రూ.50 లక్షల కోట్లు దాటుతుందని అంచనా) వ్యయం చేస్తామని నరేంద్ర మోదీ అంటున్నారు. గుజరాత్లో నర్మద-సబర్మతి, మహారాష్ట్రలో వేన్గంగా-నల్గంగా వంటి ఉప నదుల అనుసంధాన పనులు డజన్ల కొద్దీ అనేక రాష్ర్టాల్లో కొనసాగుతున్నాయి. జాతీయ నదుల అనుసంధానంలో, రాష్ర్టాలలోని ఇలాంటి ప్రాజెక్టులలో కానీ వ్యయం దాచిపెట్టి ఆదాయాలను అపరిమితంగా చూపిస్తూ అనుమతులు పొందుతున్నవి ఆయా ప్రభుత్వాలు.
ఇన్ని మోసాలు, అబద్ధాలు అవసరమా? కేంద్ర జలసంఘం తాము పాటించే ప్రమాణాలను సరిచేసుకున్నా లేదా ప్రపంచంలో ఎక్కడాలేని ఈ నిబంధనను ఎత్తివేసినా, ప్రత్యేక పరిస్థితుల్లో సడలించినా సరిపోతుంది. రాజకీయంగా ప్రత్యర్థి ప్రభుత్వాలపై బురద చల్లడానికే. ఈ తరహా ఎక్కడా లేని నిబంధనలను కేంద్ర ప్రభుత్వం పాటిస్తున్నది. నీటి వల్ల ప్రయోజనాలను అంచనా వేయడంలో కేంద్ర జలసంఘం ధాన్యం ఉత్పత్తి, చేపల పెంపకం, టూరిజం వంటి కొన్ని ప్రత్యక్ష ఆదాయ వనరులకే పరిమితమై లెక్కలు చేస్తున్నది. నీటి వల్ల ప్రత్యక్ష, పరోక్ష ఆదాయాలు ఎన్నిరకాలుగా ఉంటాయో ఒక పెద్ద గ్రంథమే రాయవచ్చు. దీనిపై చట్టసభల్లో, బయటా విస్తృతంగా చర్చ జరగాలి. అప్పుడే ధాన్యం అమ్మకాలపై రైతులకు వచ్చే ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకునే తమ ఆలోచన ‘తప్పు’ అని కేంద్ర జలసంఘానికి అర్థమవుతుంది. ఉదా: మొక్కజొన్నల నుంచి సుమారు 13 రకాల ఇతర ఉత్పత్తులను తీయవచ్చు. ఈ పంట ఎక్కువగా అమెరికా, చైనా, బ్రెజిల్ , యూరప్ దేశాలలో పండుతున్నది. తర్వాత స్థానం భారత్‌ది. తెలంగాణలో కూడా ఎక్కువగానే మొక్కజొన్నలు పండిస్తారు. కాళేశ్వరం నీటిని వినియోగించే ఆయకట్టు ప్రాంతాల్లో కొన్ని ఫుడ్‌ప్రాసెసింగ్ క్లస్టర్లను ఏర్పాటుచేసి, ఆయిల్‌పామ్ ఉత్పత్తి పెంచడం కోసం రైతులకు సబ్సిడీని పంట పండేదాకా అందిస్తున్నట్టే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను సహకార సంఘాల ద్వారా నెలకొల్పడానికి సబ్సిడీనిస్తూ, రైతులకు ఉప ఉత్పత్తుల (బైప్రొడక్టులు) తయారీలో, అడ్వర్టయిజింగ్ తదితర రంగాల్లో నైపుణ్య శిక్షణనిచ్చి, శిక్షణా కాలం, అనుభవ కాలం ైస్టెఫండ్ వంటి ఆర్థిక సహకారాన్ని అందిస్తే వినియోగించే నీటి వ్యయంపై వందరెట్లు ఆదాయం సమకూరుతుంది.
మన రాష్ట్రంలో కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నాం. భారతదేశం ప్రతి ఏటా 30-40 బిలియన్ అమెరికా డాలర్ల వ్యవసాయ ఉత్పత్తులను, నట్స్, పామాయిల్ వంటి పంట నూనెలు, పప్పులు, పండ్లు, పత్తి, మసాలాలు, పారిశ్రామిక రసాయనాలు, ఫ్యాటీయాసిడ్స్, చక్కెర, స్వీటెనర్లు వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. వీటిని తెలంగాణలో పండించి, పై ఉత్పత్తులను తీసి వివిధ రాష్ర్టాలకు సరఫరా చేయాలి.
ఫుడ్ ప్రాసెసింగ్ వంటి గ్రామీణ అనుబంధ పరిశ్రమలను, వృత్తులను కాళేశ్వరంలోని 28 ప్యాకేజీలలోని వివిధ నియోజకవర్గాలు, మండలాల్లో అక్కడ పండిస్తున్న పంటలను దృష్టిలో పెట్టుకొని వివిధ పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటుచేస్తే ప్రతి రైతు కోట్వీరుడవుతాడు. ఈ పరిశ్రమలు, ఉత్పత్తుల వల ఒక్కో క్లస్టర్లో వందలాది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. వాహనాలు, హోటళ్లు, దుకాణాలు, ఇండ్ల కిరాయి, భవన నిర్మాణరంగం, పారిశుధ్యం, ప్యాకింగ్ ఇలా అనేకమందికి ఉపాధి లభించడం వల్ల వారికి లభించే కూలీ డబ్బు, జీతం ఏ నెలకానెల సరుకులు, ఇతర వస్తువులు కొనడానికి మార్కెట్లో ఖర్చు చేస్తారు. ఒక్కోరూపాయి పది చేతులు (దుకాణాలు) మారి ప్రభుత్వ ఖజానాకు జీఎస్టీ రూపంలో ఆ రూపాయికి ఎన్నో రెట్ల ఆదాయం చేకూరుతుంది. మంచినీటి చేపలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నది. వీటితో పాటే గొర్రెలు, మేకల మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. ఈ విజన్ కేసీఆర్‌కు ఉన్నది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఈ దిశగా ప్రయత్నం జరిగింది. ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్, సివిల్ సర్వీసెస్ అధికారులను, రూరల్ ఇండస్ట్రీస్ డెవెలప్మెంట్ ఫండ్ (నిజాం పాలనలో ఉన్నట్టు) ఏర్పాటు చేయాలి. ఇతర రాష్ర్టాలు, దేశాలలో ఎగుమతులు, మార్కెటింగ్ కోసం అవసరమైన చర్యలు చేపట్టాలి. వందలాది స్కిల్ డెవలప్మెంట్, శిక్షణా సంస్థలను కేంద్రం అందిస్తున్న నిధులతో ఏర్పాటుచేయవచ్చు. పరిశ్రమల శాఖ సమన్వయం అవసరం. అవగాహన లేని అంశాల్లో మేధావుల మౌనం సమాజానికి, వారికీ ఎంతో మంచిది.