పద్దెనిమిదో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలం 303 నుంచి 240 సీట్లకు తగ్గిపోవడంతో ఇకపై పాలకపక్షం ‘హిందుత్వ దూకుడు’ మందగిస్తుందని రాజకీయ పండితులు విశ్లేషించారు. ఇక ప్రతిపక్షాలతో ‘సహకార, సర్దుకుపోయే వైఖరిని’ అవలంబిస్తుందని దేశంలో ఎందరో ఆశించారు. అయితే, ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు గత రెండున్నర మాసాలుగా తీసుకున్న నిర్ణయాలు, ఉత్తరాది రాష్ర్టాల బీజేపీ ప్రభుత్వాల తాజా విధానాలు పరిశీలిస్తే.. వారు వేసిన అంచనాలు తప్పని స్పష్టమవుతున్నది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని ప్రకటనలను గాని, సర్కారు తీసుకున్న నిర్ణయాలను గాని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
సొంత బలం లేకున్నా బీజేపీ ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం ఏకపక్షంగా, ‘హిందుత్వపక్షం’గా వ్యవహరిస్తోందనడానికి రెండు ఉదాహరణలు చాలు. దాదాపు 60 ఏండ్లుగా ప్రశాంతంగా సాగుతున్న రెండు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మనకు స్పష్టమవుతోంది. ఉత్తరాఖండ్‌లోని గంగా నది నుంచి వేలాది మంది హిందువులు కావడి యాత్ర (కన్వర్ యాత్ర) పేరుతో ఏటా శ్రావణ మాసంలో కొంత మొత్తంలో నీటిని తీసుకుని సొంతూళ్లకు వెదురు కావిళ్లతో బయల్దేరతారు.
ఈ యాత్ర మార్గంలో ఉత్తరాఖండ్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో రోడ్లకు ఇరువైపులా ఉండే హోటళ్ల యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఆయా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీచేశాయి. మార్గంలో వచ్చే పశ్చిమ యూపీ జిల్లాల్లో ముస్లింల జనాభా ఎక్కువ. అక్కడ హోటళ్ల యజమానుల్లో అత్యధికులు ముస్లింలే. రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులు రాగానే ఈ హోటళ్ల యజమానులు తమ పేర్లను రాసి బోర్డులు పెట్టారు. ముస్లిం యజమానుల పేర్లు చూసి హిందువులైన కావడి యాత్రికులు ఆ హోటళ్లలో తినకుండా పోవాలనేదే పాలకపక్షం లక్ష్యం. తద్వారా ముస్లిం వ్యాపారులు నష్టపోయి, హిందువులపై ద్వేషం పెంచుకుంటే బీజేపీకి లాభమనేది పాలకుల అంచనా.
ఈ కావడి యాత్ర సమయంలో చాలా వరకు ఈ ఉత్తరాది హోటళ్లలో శాఖాహార భోజనమే విక్రయిస్తారు. ఎన్నో దశాబ్దాలుగా యజమానుల పేర్లున్న బోర్డులు లేకున్నా కావడి యాత్రికులు వాటిలో భోజనం చేస్తున్నప్పుడు.. 2024లో మాత్రం కొత్త నిబంధన అవసరం ఏమొచ్చింది?
అయితే ఈ ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో అనేక ఉత్తరాది రాష్ర్టాల్లోని ఓటర్లలో ‘హిందువులు, ముస్లింలు’ అనే స్పృహ అనుకున్నంత రాలేదు. పూర్వపు మత విద్వేషాలు మరచి, స్థానిక సమస్యల ఆధారంగానే ప్రజలు బీజేపీని ఓడించారు.
ఈ ఏడాది, వచ్చే సంవత్సరం అనేక పశ్చిమ, ఉత్తరాది రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ కారణంగా దేశంలో మతవిద్వేషాలు, ముస్లిం వ్యతిరేకత పెంచే ఎత్తుగడల్లో భాగంగా కావడి యాత్ర సందర్భంగా బీజేపీ ఎన్నడూ లేని అడ్డగోలు ఉత్తర్వులను అమలు చేయాలని చూస్తున్నది. అయితే, ఈ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది.
బీజేపీ ప్రభుత్వాల ఉత్తర్వులను ఎన్డీయే భాగస్వాములైన జేడీయూ, ఎల్జేపీ, ఆర్ఎల్డీ తప్పుబట్టాయి. కేంద్ర సర్కారు మనుగడ లౌకి క మిత్రపక్షాలపై ఆధారపడి ఉన్నప్పటికీ బీజేపీ తన హిందుత్వ పోకడలను తగ్గించకుండా మరింతగా పెంచడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఘోర పరాభవం ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు, మంత్రులతో కూడిన అసమ్మతివర్గానికి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ కీచులాటలు సద్దుమణిగేలా చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆర్ఎస్ఎస్ను అభ్యర్థించింది. అయితే, బీజేపీ పోకడలపై అనేక విషయాల్లో అభ్యంతరాలున్న ఆర్ఎస్ఎస్కు యూపీ సంక్షోభంలో శాంతిదూతగా పనిచేయడం ఇష్టం లేదు.
అందుకే శనివారం జరగాల్సిన సమన్వయ సమావేశాన్ని కూడా ఆర్ఎస్ఎస్ రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో సంఘ్ అగ్రనాయకులను శాంతింపచేసే వ్యూహంలో భాగంగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో కేంద్ర సిబ్బంది పాల్గొనడానికి మార్గం సుగమం చేస్తూ జూలై 9న బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల ప్రవర్తనను నియంత్రించే నిబంధనలను సవరిస్తూ ఆఫీస్ మెమొరాండం రూపంలో ఉత్తర్వులు విడుదల చేసింది. ఆర్ఎస్ఎస్ను సాంస్కృతిక సంస్థగానే బీజేపీ అభివర్ణిస్తుంది. అందుకే తాజా ఉత్తర్వులు సబబేనని బీజేపీ మంత్రులు వాదిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని నిషేధించడానికి సంబంధించి 1966, 1970, 1980లలో జారీ అయిన ఆఫీస్ మెమొరాండంల నుంచి ఆర్ఎస్ఎస్ పేరు తొలగిస్తున్నట్టు ఇటీవల కేంద్రం తెలిపింది.
అయితే ‘ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 400కి మించి సీట్లు ఇవ్వండి’ (అబ్ కీ బార్ చార్ చౌ పార్) అనే నినాదంతో 2024 పార్లమెంటు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బీజేపీకి భారత ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారు. నాలుగొందల సీట్లలో కాషాయపక్షాన్ని గెలిపిస్తే ప్రతిపక్షాలు చెబుతున్నట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల రద్దు సహా రాజ్యాంగాన్ని ఇష్టమొచ్చినట్టు మోదీ సర్కారు సవరిస్తుందనే భయంతో 240 సీట్లకే దాన్ని పరిమితం చేశారు. లోక్‌సభలో 63 సీట్లు తగ్గిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు తన హిందుత్వ దూకుడుకు స్వస్తి పలుకుతుందనే రాజకీయ పండితుల అంచనాలు తప్పని తాజా విధానాల ద్వారా కాషాయపక్షం నిరూపిస్తోంది.
-నాంచారయ్య మెరుగుమాల