పది వేల ఏండ్ల కిందటనే మన దేశంలో వ్యవసాయం ప్రారంభమైందని చరిత్ర చెప్తున్నది. నాటి నుంచి నేటి వరకు వ్యవసాయ విత్తనాలు ఉత్పత్తి చేసిందే కానీ ఎన్నడూ విత్తనాలు కొనుగోలు చేయలేదు. హరిత విప్లవం తర్వాత హైబ్రిడ్ విత్తనాల పేర్లతో దేశంలో విత్తనాల అమ్మకం, దిగుమతి పెరిగింది. గత 20, 25 ఏండ్ల కిందట ప్రతి రైతు ఇల్లు ఒక విత్తన భాండాగారమే! అప్పుడు రైతులు పండించిన పంటలో కొంత మంచి భాగాన్ని విత్తనాలుగా నిల్వ చేసుకొని అవే విత్తనాలను మళ్లీ పెట్టుకొని పెట్టుబడి లేని వ్యవసాయం చేసేవారు. కానీ 20, 25 ఏండ్ల నుంచి ప్రభుత్వం, కార్పొరేట్ విత్తన కంపెనీలు క్రమంగా రైతుల దగ్గరి నుంచి విత్తనాలను దూరం చేశాయి. ఇప్పుడు ఏ చిన్న పంట పెట్టుకోవాలన్నా రైతులు కార్పొరేట్ కంపెనీలపై ఆధారపడవలసి వస్తున్నది.
విత్తనాల ధర భారం అవుతుండటంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు ఒక అంచనా. దేశవ్యాప్తంగా 540 విత్తన కంపెనీలున్నాయి. అవి ఏటా దాదాపు రూ.65 నుంచి రూ.70 వేల కోట్ల విత్తన వ్యాపారం చేస్తున్నాయని ఒక అంచనా! వ్యవసాయానికి భూమి ఎంత ముఖ్యమైనదో విత్తనం కూడా అంతే ముఖ్యమైనది. ఇది గమనించిన విత్తన కంపెనీలు ఏటా రూ. 5 వేల కోట్ల నకిలీ విత్తనాలు అమ్ముతున్నాయని తెలుస్తున్నది!
దేశంలో ఎక్కడో ఒక దగ్గర నకిలీ విత్తనాలతో నష్టపోతున్న రైతులను ఏటా చూస్తూనే ఉన్నాం. తాజాగా మెదక్ జిల్లాలోని చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో ఒక విత్తన కంపెనీ 45 మంది రైతులకు నకిలీ వరి విత్తనాలు విక్రయించింది. వారు సుమారు 100 ఎకరాలలో వరి పంట వేశారు. ఎకరానికి 30 క్వింటాళ్ల చొప్పున దిగుబడి రావాల్సి ఉండగా, 6, 7 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. దీంతో ఆ రైతులు ఆత్మహత్యే శరణ్యమని లబోదిబోమంటున్నారు. ఈ నకిలీ విత్తనాలతో పంట దిగుబడి సరిగా రాలేదని, ఆ నకిలీ కంపెనీపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదని వారు వాపోవడం గమనార్హం. నకిలీ విత్తనాల కంపెనీలను అరికట్టే సరైన వ్యవస్థ లేకనే రైతులు నష్టపోతున్నారనేది నిర్వివాదాంశం.
కేంద్ర వ్యవసాయశాఖ ‘విత్తన బిల్లు-2025’ను ప్రవేశపెట్టనున్నది. ఇందుకోసం డిసెంబర్ 11 వరకు సూచనలు చేయవలసిందిగా రైతు లు, రైతు సంఘాలను కోరుతూ కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల్లును పబ్లిక్ డొమైన్లో పెట్టింది. ఈ బిల్లు ‘సాగుదారుల కోసమా?, కార్పొరేట్ల కోసమా?’ అని రైతులు, రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికడుతుందని చెప్తూనే కార్పొరేట్ పక్షపాతం వహిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విత్తన రంగాన్ని నియంత్రించే నిబంధనలను సమూలంగా మార్చడానికి భారత ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా విత్తనాల బిల్లు 2025 ద్వారా 1966 విత్తనాల చట్టం, 1983 విత్తన నియంత్రణ ఉత్తర్వులను భర్తీచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది. కొత్త చట్టం నాణ్యమైన విత్తనాల సరఫరాను మెరుగుపరుస్తుందని, నకిలీలను అరికడుతుందని, రైతులకు ఎక్కువ రక్షణ కల్పిస్తుందని అధికారులు చెప్తున్నారు. కానీ, 2004, 2019లో మునుపటి ప్రయత్నాల మాదిరిగానే, ఈ బిల్లు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది. రైతు సంఘాలు, విత్తన నిపుణులు, పౌర సమాజ సంస్థలు సాధారణ సాగుదారుల కంటే, ముఖ్యంగా సంప్రదాయ, రసాయన రహిత వ్యవసాయంపై ఆధారపడే వారి కంటే విత్తన కంపెనీలు, వ్యవసాయ వ్యాపారాలకే ఈ చట్టం మేలు చేస్తుందంటున్నారు.
నకిలీ విత్తనాలను ఉత్పత్తి చేసి సరఫరా చేసిన వ్యక్తులకు లేదా కంపెనీలకు కఠినమైన శిక్షలను తక్షణమే అమలుచేయాలి. పంట నష్టపోయిన రైతులకు పరిహారం పొందడానికి సులభమైన మార్గం ఉండాలి. స్థానిక మండల వ్యవసాయాధికారి నివేదిక ఆధారంగా నష్టపోయిన రైతుకు నష్టపరిహారం ఒక నెల లోపు అందించే విధంగా చట్టం ఉండాలి. విత్తనాల ధరలపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. విత్తనాల ఉత్పత్తిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ, పర్యవేక్షణ కూడా ఉండాలి. విత్తనాలపై కృత్రిమ కొరత సృష్టిస్తే భవిష్యత్తులో ఆ కంపెనీకి అనుమతులు ఇవ్వకూడదు. దేశీయ లేదా సంప్రదాయ విత్తనాలను కాపాడుకొని భద్రపరిచే విధానం చట్టంలో ఉండాలి. రైతులు పాత పద్ధతుల్లో విత్తనాలను కాపాడుకునే పద్ధతిని ప్రోత్సహించాలి. 60 శాతంపైగా జనాభా వ్యవసాయరంగంపై ఆధారపడ్డ దేశం మనది. అలాంటి మన దేశంలో ప్రధానమైన విత్తన చట్టాన్ని సవరణ చేస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో చర్చలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రైతులు, సంఘాలు, మేధావుల నుండి అభిప్రాయాలు తీసుకొని చట్ట సవరణ చేయాలని ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.