రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులు కొలువుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరి ఏడాది గడిచిపోతున్నా వారి ఆశలు మాత్రం ఇంకా నెరవేరడం లేదు. అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పటివరకు కనీసం 20 వేల ఉద్యోగాలను కూడా భర్తీచేయలేకపోయింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం ఇప్పటికే 55 వేల ఉద్యోగాలు భర్తీచేశామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు.
కాంగ్రెస్ నాయకులు ఇంత పచ్చి గా అబద్ధాలు చెప్తారని నిరుద్యోగులు ఊహించలేకపోయారు. పదవిలో కూర్చుంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారనుకున్నారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల అసలు రంగు బయటపడింది. సీఎం రేవంత్ పదే పదే చెప్తున్న 55 వేల ఉద్యోగాల చరిత్ర ఏమిటో పరీక్ష రాసిన నిరుద్యోగులకు, పరీక్ష పెట్టిన ప్రభుత్వానికీ తెలుసు. ఉద్యోగాల భర్తీ ఏమైందని ప్రశ్నిస్తే చాలు రాష్ట్రం అప్పులమయంలో కూరుకుపోయిందని, ఎస్సీ వర్గీకరణ అంటూ కావాలనే కాలయాపన చేస్తున్నది. అందుకే ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఎస్సీ వర్గీకరణ అడ్డంకి కాదని, అమలుచేస్తామన్న ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. జాబ్ క్యాలెండర్ అమలు, ఉద్యోగాల భర్తీ విషయంలో ఏపీలో రాని అడ్డంకి తెలంగాణలో ఎందుకు వస్తున్నదో అర్థం కావడం లేదు.
నిరుద్యోగులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత చిన్నచూపా? అప్పులతో పోలుస్తూ నిరుద్యోగుల జీవితాలను నాశనం చేయడం కరెక్టేనా? రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పదవీ విరమణ వయస్సు పెంపు చేస్తున్నట్టు వార్తలు వ స్తున్నాయి. ఆ దిశగా అడుగులు వేస్తే మాత్రం నిరుద్యోగుల ఆశలు అడియాసలైనట్టే లెక్క! ప్రభుత్వం ఇచ్చిన ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని నెరవేర్చకుండా రిటైర్మెంట్ వయ స్సు పెంచుదామనుకోవడం సిగ్గుచేటు. ఏండ్ల తరబడి నిరుద్యోగ యువకులు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. అర్ధాకలితో 5 రూపాయల భోజనం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. లైబ్రరీల్లో కుర్చీలకు అతుక్కుపోతున్నారు. పరీక్షల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి సిద్ధమవుతున్న నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం గర్హనీయం. అందుకోసమే, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై పోరాటం చేయాలని నిరుద్యోగులు నిర్ణయించుకుంటున్నారు. పేదరికం కారణంగా తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కావద్దనే కారణంతో నిరుద్యోగులు ట్యూషన్లు చెప్తున్నారు. క్యాటరింగ్ పనులు చేసుకుంటున్నారు. కరపత్రాలు పంచుతూ ర్యాపిడో బైక్లు నడుపుకొంటూ దయనీయ పరిస్థితుల్లో బతుకీడుస్తున్నా రు. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా, హాయి గా, సంతోషంగా కుటుంబసభ్యులతో బతుకాల్సిన వారిని బలవంతంగా ఉద్యోగంలో కొనసాగించాల్సిన అవసరం ఏమున్నది?
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిద్రలోంచి మేల్కోవాలి. ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యే ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలి. ప్రభుత్వం ఇచ్చే వందల ఉద్యోగాలకు లక్షల మంది నిరుద్యోగులు పోటీ పడుతుండటం, ఆ వందల ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని ప్రభుత్వం గొప్పగా భావించడం నిజంగా హేయనీయం. మిగతా నిరుద్యోగులు ఎటుపోవాలి? ప్రభు త్వ ఉద్యోగాలు పరిమితంగానే ఉంటాయి కాబట్టి ప్రభుత్వమే ప్రైవేట్ ఉద్యోగాల భర్తీపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.
తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ప్రత్యేక రాయితీలను అందించాలి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నియామకాల కోసం కాబట్టి, ప్రైవేట్ ఉద్యోగాలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చట్టం తీసుకురావాలి. పరిశ్రమలకు కావాల్సింది నైపుణ్యం ఉన్న మానవ వనరులే కాబట్టి, పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను ప్రభుత్వమే అందివ్వాలి. అందుకోసం ప్రతి మండలంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. పరిశ్రమలు కోరుకుంటున్న, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలి. వ్యాపారాలు చేసుకునేందుకు నిరుద్యోగులకు ఉదారంగా రుణాలను అందించినప్పుడే తెలంగాణ నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మారుతుంది.
-శ్రవణ్ కుమార్
నిరుద్యోగి