‘మేమొస్తే కంచెలు తొలగిస్తం, హద్దులు చెరిపేస్తం, స్వర్గాన్ని భూలోకానికి దించుతం, ప్రజలను ఆనందలోకాల్లో విహరింపజేస్తం, ప్రజల జీవితాలను బంగారుమయం చేస్తం, రాష్ట్రంలో ప్రజా పాలన తెస్తాం…’ ఇవీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఊదుడు బుగ్గల మాటలు. ఆ మాటలతో కట్టిన కోటలు.
వారనుకున్నట్టే ప్రజలను నమ్మించి, వంచించిర్రు. కుర్చీ దక్కిన తర్వాత ముఖాలకు వేసుకున్న ముసుగులు తొలగించేసిర్రు. అందుకే, నాడు చెప్పిందేమిటి? నేడు ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంలో నిజం ఎంత? అనేది నిగ్గు తేల్చేందుకు మీడియా ప్రతినిధులు కొందరు సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లికి పోయిండ్రు. అంతే వారిపై రౌడీమూకలు దాడులకు తెగబడ్డయి. అసలేం జరుగుతున్నది ఈ తెలంగాణ రాష్ట్రంల?
జర్నలిస్టులను చంపేస్తామని బెదిరించినవారిలో నయీం ముఠాలో కీలక సభ్యుడిగా పనిచేసిన శేషన్న కూడా ఉన్నట్టుతర్వాత తెలిసింది. ఆయనే కాదు, నయీం గ్యాంగ్‌లో పనిచేసిన పలువురు మాజీ సభ్యులను యాక్టివేట్ చేసి చురుగ్గా పనిచేస్తున్న జర్నలిస్టులను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న డిజిటల్ చానళ్ల ప్రతినిధులను బెదిరించడం, టార్గెట్ చేయడం, చంపేయమని టాస్క్ ఇవ్వడం దేనికి సంకేతం? స్వరాష్ట్రం వచ్చిన పదేండ్లలో ఇలాంటి హింసాత్మక ప్రేరేపణలు చూశామా? ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదేమో!
Congress | శుక్రవారం, పొద్దున 8.30 గంటల సమయం, కొండారెడ్డిపల్లి గ్రామం. రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ అయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో నిజమెంత? అని తెలుసుకునేందుకు సరిత, విజయారెడ్డి అనే ఇద్దరు మహిళా జర్నలిస్టులు కొండా రెడ్డిపల్లికి వెళ్లారు. ప్రజలను కలుస్తూ ‘రుణమాఫీ అయిందా, కాలేదా?’ అని అభిప్రాయా లను రికార్డు చేస్తున్నారు. అది గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు వారిని అడ్డుకున్నారు. మహిళలనే ఇంగితజ్ఞానం లేకుండా దురుసుగా ప్రవర్తించారు. జర్నలిస్టు సరితను తోసేస్తే బురదలో పడ్డది. ఆమె మొబైల్, మెమొరీకార్డులను గుంజుకున్నారు. జర్నలిస్ట్ విజయారెడ్డితోనూ దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో మధ్యలోకి వెళ్లిన సరితను అసభ్యంగా తాకుతూ వేధించారు.
ఆ ఇద్దరు జర్నలిస్టులు ఏడుస్తూ వంగూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు ఫిర్యాదును స్వీకరించలేదు. అంటే, రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు ఆ ప్రాంతంలో ఎలాంటి భయానక వాతావరణాన్ని సృష్టించారో అర్థమవుతున్నది. 10 గంటల కల్లా ఈ విషయం సోషల్ మీడియాలో వైరలైంది. న్యూస్‌లైన్, వైఆర్ టీవీ, తెలుగు స్ర్కైబ్ చానళ్లు వారికి మద్దతుగా అక్కడికి వెళ్లారు. తోటి జర్నలిస్టులను చూసిన ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ క్రమంలో ఎన్నడూ కొండారెడ్డిపల్లికి రాని కొండల్‌రెడ్డి హైదరాబాద్ నుంచి వస్తున్న ఇతర జర్నలిస్టులను అడ్డుకునేందుకు చాలా ప్రయత్నం చేశాడు. ఈ జర్నలిస్టులకు కొండల్‌రెడ్డి కాన్వాయ్ ఎదురైంది. కారులో వెళ్తున్న జర్నలిస్ట్ శంకర్‌ను చూసిన కొండల్‌రెడ్డి సినీ తరహాలో వేలు చూపిస్తూ బెదిరించాడు. ఆ కారును టార్గెట్ చేసి రెండుమూడు సార్లు అటకాయించే ప్రయత్నం చేశారు. వారు తప్పించుకొని హైదరాబాద్ వైపు వచ్చారు. ఇంతలోనే నాలుగైదు కార్లు శంకర్ కారును తరుముతూ, అడ్డంగా అతివేగంగా అటకాయించే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో జర్నలిస్ట్ శంకర్ వెనకాల వస్తున్న సహచర జర్నలిస్టులను అప్రమత్తం చేశారు. ఓ నలుపు రంగు కారు శంకర్ కారుకు అడ్డంగా వచ్చి ‘మీరు హైదరాబాద్ ఎట్ల పోతరో చూస్తం బిడ్డా, కొండారెడ్డిపల్లికి వచ్చేంత దమ్ముందారా మీకు?’ అంటూ రాయలేని అసభ్యకర భాషలో మాట్లాడుతూ దాడి చేయబోయారు. వారినుంచి తప్పించుకున్న శంకర్ కారు నేరుగా వెల్దండ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నది. ఇతర జర్నలిస్టులూ అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సుమారు 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. పోలీస్ స్టేషన్లోనే సరిత, విజయారెడ్డి, శంకర్లను బెదిరించారు. అప్పుడే వచ్చిన సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్సై కురుమూర్తి.. కాంగ్రెస్ నాయకులను, కిరాయి గుండాలను అక్కడినుంచి పంపించేశారు. జర్నలిస్టులపై దాడి విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తదితర బీఆర్ఎస్ నాయకులు కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.
దాడి ఉదంతాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎస్పీకి ఫోన్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ ఆదేశాలతో రెండు పోలీసు వాహనాలు ఎస్కార్ట్‌గా వచ్చాయి. దీంతో జర్నలిస్టులు సురక్షితంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు.కొండారెడ్డిపల్లి పొరుగు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జర్నలిస్టులకు ఫోన్‌చేసి.. ‘ఈ రోజు కొండారెడ్డిపల్లిలో మీరు దొరికి ఉంటే సగం మంది తిరిగి ప్రాణాలతో ఉండేవారు కాదు’ అని చెప్పడం గమనార్హం. ఇవీ.. కొండారెడ్డిపల్లిలో సినీ ఫక్కీలో జరిగిన ఘటనలు.
ముఖ్యమంత్రి సొంతూరు అయినంత మాత్రాన గ్రామంలోకి వెళ్తే జర్నలిస్టులపై దాడులు చేస్తారా? చంపుతామని బెదిరిస్తారా? గతంలో జర్నలిస్టుల మీద ఈ స్థాయిలో దాడులు ఏనాడైనా జరిగాయా? ప్రజాపాలన అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ హయాంలో గత ఎనిమిది నెలల్లో పదుల సంఖ్యలో జర్నలిస్టుల మీద దాడులు జరిగాయి. ఇప్పుడు ఏకంగా చంపేస్తామని బెదిరింపులు మొదలయ్యాయి. ఈ ప్రభుత్వం ప్రశ్నించే జర్నలిస్టుల గొంతుకలపై ఉక్కుపాదం ఎందుకు మోపుతున్నది? ఏ తప్పూ చేయకపోతే జర్నలిస్టులను బెదిరించుడు ఎందుకు? ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే హక్కు జర్నలిస్టులకు లేదా? ప్రశ్నించినంత మాత్రాన ప్రైవేటు గ్యాంగ్‌లతో సీఎం తమ్ముళ్లు బెదిరింపులకు పాల్పడతారా? జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? కచ్చితంగా ఉన్నది. ‘మాకు ఓటేయండి’ అని తెలంగాణ ప్రజలను నమ్మించిన రాహుల్‌గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఆ బాధ్యత ఉన్నది. ప్రశ్నించే గొంతుకలను కాపాడుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఉన్నది.
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
-ఎస్పీకే