పల్లెటూరు అంటేనే ప్రకృతి సోయగాలు, అందమైన జీవితం, ఆనందాయక జీవనం, పరస్పర సహకారం, స్నేహబంధాలకు నిలయం. గడిచిన తరాల పల్లె ప్రజలు భేదాభిప్రాయాల కంటే బంధాలు, బంధుత్వాలకు ఎక్కువ విలువిచ్చేవారు. కానీ, రాను రాను కొన్ని పల్లెల్లో రాజకీయ పార్టీల జోక్యం ఎక్కువైంది. కొందరు నేతలు తమ స్వార్థం కోసం పల్లె ప్రజలను కులాలుగా, వర్గాలుగా విడగొడుతున్నారు. వారిలో వారికే చిచ్చుపెట్టి పగలు, ప్రతీకారాలతో కొట్టుకుచచ్చేలా చేస్తున్నారు. తద్వారా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడేలా చేస్తున్నారు. పల్లె గడ్డపై రాజకీయ చిచ్చు నెమ్మదిగా వ్యాపించి, ఐక్యతను చీల్చే విషంలా మారి కల్మషమెరుగని మనుషుల మధ్య విద్వేషాన్ని పెంచుతున్నది.
ప్రతి ఎన్నికతో పాటే పల్లెల్లో విభేదాలు, పగలు, ప్రతీకారాలు పెరుగుతున్నాయి. వర్గాలుగా విడిపోయిన ప్రజలు చిన్నచిన్న విషయాలపైనా గొడవ పడుతున్నారు. చివరికి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడని పరిస్థితికి వచ్చారు. ఒకే ఊరిలో రెండు వర్గాలు, రెండు ధ్వజాలు. ఒకే ఉత్సవానికి వేర్వేరు వేదికలు ఉండటం.. మిత్రులుగా ఉన్నవారు శత్రువులుగా, శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా మారడం చూస్తున్నాం. కొన్నిసార్లు బంధువులను కూడా బద్ద శత్రువులుగా మారుస్తున్నాయి పల్లె రాజకీయాలు. చాలా చోట్ల గ్రామ పంచాయతీ సమావేశాలు అభివృద్ధి చర్చల కోసం కాకుండా పరస్పర ఆరోపణలకు అడ్డాగా మారుతున్నాయి. పంచాయతీ కార్యాలయం ఎదుట జరిగే సమావేశాల్లో అభివృద్ధి ప్రణాళికల గురించి కంటే పార్టీల గొడవలు, కార్యకర్తల కొట్లాటలు, ఎవరు ఏ పార్టీకి చెందినవారనే విషయాలే ప్రధానాంశాలు అవుతున్నాయి. పల్లెలో పార్టీకో పెద్ద రాజకీయ నాయకుడు, అతని కింద చిన్న నాయకులు.. వారి పంతమే నెగ్గాలనే ఆలోచనలు.. వెరసి గ్రామాభివృద్ధి కుంటుపడి రాజకీయ కక్షలు పెరుగుతున్నాయి.
ఈ వర్గ విభేదాల కారణంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులు, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ, ముఖ్యంగా అర్హులైన వారికి చేరడం లేదు. నిత్యావసర సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కొందరికే పరిమితమవుతున్నాయి. పథకాలు అర్హులైన, అవసరమైన వారి దరి చేరకుండా ఈ వర్గ రాజకీయాలు అడ్డుకుంటున్నాయి. చాలామంది వృద్ధులు, మహిళలు, పేదలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ఒకప్పుడు గ్రామాభివృద్ధి కోసం కలలు కన్న యువత రాజకీయ అసహనంతో అట్టుడుకుతున్నారు. వారి హృదయాల్లో నూతన ఆశలు మొలకెత్తాల్సిన సమయంలో నిరాశ, నిస్పృహలు అలుముకుంటున్నాయి. ఊరంతా కలిసికట్టుగా ఎదగాలనే కలలు.. ‘మా వర్గమే గెలవాలనే కుటిల కాంక్షలో కనుమరుగైపోతున్నాయి.
ఒక పార్టీ గెలిచి మరో పార్టీ ఓడినప్పుడు గ్రామం గెలవదు. గ్రామం గెలవడం అంటే ప్రతి ఇంట్లో వెలుగు నిండటం.. ప్రతి కుటుంబంలో సంపద పెరగడం.. గ్రామంలో పిల్లలకు మెరుగైన విద్య, వైద్య సేవలు అందడం.. వృద్ధులకు గౌరవం లభించడం.. ప్రభుత్వ పథకాలు బలహీనవర్గాలకు అందడం. ఒక్కమాటలో చెప్పాలంటే గెలుపంటే సామూహిక అభివృద్ధి.
రాజకీయాలు చేయడం, పార్టీలకు మద్దతుగా నిలవడం తప్పు కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారానే తన భవిష్యత్తును నిర్ణయించే నాయకున్ని ఎన్నుకునే హక్కు ఓటరుకు ఉంది. కానీ, అది గ్రామస్థాయిలో వ్యక్తిగత పగ, ప్రతీకారాలకు సాధనంగా మారడం మాత్రం సరైనది కాదు. అందుకే పల్లె ప్రజలు విచక్షణతో మెలగాలి. పెద్ద పెద్ద నాయకులంతా బాగానే ఉంటారు. కానీ, గ్రామాల్లో సామాన్య కార్యకర్తలు మాత్రం కక్షలతో జీవిస్తుంటారు. ఇలా పగప్రతీకారాలు పెంచుకుంటూపోతే మనుషులు మాత్రమే కాదు, పల్లె కూడా నాశనమవుతుంది. వర్గ, కుల బలహీనతల్ని వదిలి, గ్రామాన్ని బతికించుకోవాలి. అభివృద్ధి పథంలో నడిపించుకోవాలి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాక, గ్రామ సమష్టి శ్రేయస్సు కోసం రాజకీయాలు చేయాలి. తాత్కాలికమైన వాటి కోసం బంధాలను, స్నేహాలను దూరం చేసుకోవడం సరికాదు. రాజకీయం ఎప్పుడూ అభివృద్ధి కోసం ఉండాలి. అంతేతప్ప వినాశనానికి కాదు.
రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఈ రాజకీయ కక్షలను పక్కనపెట్టి.. పల్లెలో సౌభ్రాతృత్వాన్ని, సహకారాన్ని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పల్లెను మళ్లీ పచ్చగా, సస్యశ్యామలంగా మార్చాలి. అభివృద్ధి మార్గంలో అందరూ కలిసికట్టుగా సాగడమే ప్రజాస్వామ్యానికి నిజమైన విజయం.
-జి.అజయ్ కుమార్