చాల కల్లలాడుకొన్న సౌఖ్యమేమిరా కాలము పోను మాట నిలుచును కల్యాణరామ నాతో చాల కల్లలాడుకొన్న సౌఖ్యమేమిరా
తల్లి తండ్రి నేనుండ తక్కిన భయమేలరాయని పలుమారు నీవెంతో బాసలు చేసి చాల కల్లలాడుకొన్న సౌఖ్యమేమిరా
ఆరభి రాగం, ఆదితాళంలో త్యాగరాజ కృతి ఆకాశవాణిలో కర్ణపేయంగా పాడుతున్నరు మంగళంపల్లి బాల మురళీకృష్ణ, నేను ఈ వ్యాసం రాస్తున్న సమయానికి! చెవులు పగిలేటట్టు నిరంతరమూ రాముని పేరు జపించే ప్రధాని మోదీకి, ఇతర బీజేపీ నాయకులకు ఎవరైనా ఈ కృతి వినిపిస్తే బాగుండు. ‘రామ్ నామ్ జప్నా… పరాయా మాల్ అప్నా’ హిందీ పాట మాత్రం తెలుసువారికి! గత తొమ్మిదేండ్లలో మోదీ పలికినవి ఎన్నెన్ని కల్లలు. చూపినవి ఎన్నెన్ని కలలు! పండు ముదుసలి అయిన తన తల్లిని సైతం ఏటీఎం క్యూలలో నిలబెట్టి, భారతదేశంలోని మరెంతో మంది వయో వృద్ధులకు కూడా నరకం చూపించిన మోదీ.. నల్లధనం మొత్తం పెకిలించి వేస్తమని చెప్పిన కల్లలు రాముడైనా మరవగలడా?
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తమని, నిరుద్యోగ యువతకు చూపిన భ్రమలు, ‘అగ్నివీర్’ పేర చేసిన పరిహాసాలు త్యా గరాజస్వామికి తెలిసి ఉంటే మరెంత నిలదీసేవారో రాముడిని మోదీలాంటి దొంగభక్తుల కారణంగా! రైతన్నల ఉసురుతీసిన వ్యవసాయ చ ట్టాల గురించి గానీ, కరోనా కాలంలో వలసజీవులను నిస్సహాయంగా వందలాది కిలోమీటర్లమేర బతుకు అరిగేలా నడిపించిన అమానుషా న్ని గానీ రాముడు క్షమించగలడా? రేపిస్టులు, హంతకులకు పూలదండలు వేసి, స్వీట్లు పంచుకుతినే సంస్కృతి నుంచి ఈ దేశాన్ని రక్షించుకోకపోతే, రాముడు మనల్ని వదిలిపెడతాడా?
కేసీఆర్ చెపుతున్నట్టు పుష్కలంగా నీళ్ళు ఉండీ దేశమంతా సాగునీటికి, తాగునీటికి కటకట; క్షణం కూడా పోనంతగా విద్యుల్లతా వెలుగులు పంచగలిగే వనరులు ఉండీ భారత భారతి చీకట్లలో మగ్గడం; అపారమైన మానవ సంపద కలిగి ఉండీ పరిశ్రమలకు నోచక గుండుసూది సైతం చైనా నుంచే వచ్చే దౌర్భాగ్యం; దేశ శ్రమజీవులు సృష్టిస్తున్న సంపద మొత్తం తన గుజరాతీ మిత్రులకు దోచిపెట్టడం, దేశ సరిహద్దులు దాటించడం; ప్రపంచ దేశాల్లో తలవంపులు తెచ్చేలా చీప్ రాజకీయం.. ఇంకా ఎన్నాళ్ళు?
చీకట్లు కమ్మిన దేశంలో చైతన్యజ్యోతి వెలిగించాలని, ఆ వెలుగు వీచిక తెలంగాణ నుంచి ప్రసరించాలని కేసీఆర్ సంకల్పం తీసుకున్నరు. మత పిచ్చిగాళ్ల నుంచి దేశాన్ని రక్షించుకోవాలని, లేదంటే తాలిబాన్ రాజ్యం ఎంతో దూరంలో లేదని ఆయన హెచ్చరిస్తున్నరు. దేశ రక్షణ కోసం రేపు 18న ఖమ్మంలో జరిగే భారీ సంకల్ప సభకు ముగ్గురు సీఎంలు, ఎందరో మాజీ సీఎంలు, కాకలుదీరిన రాజకీయ యోధులు, మేధావులు, బుద్ధిజీవులు పెద్దఎత్తున రాబోతున్నరు. అభివృద్ధి చెందిన తెలంగాణ కుల పంచాయితీలతో కునారిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా ఖమ్మంలో గుణాత్మక మార్పు నినాదం ప్రతిధ్వనించబోతున్నది.
దేశంలోనే మేలైన అంబేద్కరిస్ట్, నాటకకర్త, నాకు శ్రీకృష్ణుడిని పరిచయం చేసిన మిత్రుడు సౌదా అంటున్నడు. ‘డెమోక్రటిక్ అప్రోచ్, విశాల దృష్టి నరనరాన ఉన్నవారిని ఎవరూ ఎప్పుడూ ఆపలేరు. వారి ప్రతీ మాటనూ డిసెక్షన్ చేసి చూడదు సమాజం. వారి దార్శనికతను, వారి లక్ష్యాలను, అందులోని చిత్తశుద్ధిని మాత్రమే పట్టించుకుంటుంది. ఒక గాంధీ, ఒక అంబేద్కర్, ఒక నారాయణ గురు, ఒక త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటివారికి ఉన్న భవిష్యత్ దృష్టి, అధ్యయనం, ఆచరణ లాంటివి మాత్రమే పట్టించుకుంటుంది సమాజం’. అని!
‘ఈ దేశంలో రెవల్యూషన్ కంటే ముందే కౌంటర్ రెవల్యూషన్ మొదలైంది’ అన్నరు అంబేద్కర్. (Dr. Babasaheb Ambed kar : Writings and Speeches, Vol. 3, Govt. of Maharashtra, 1987). బాధ్యత గల స్థానంలో ఉండటం, సమాధానాలు చెప్పవలసిన హోదాలో ఉండటం, సమస్యలు పరిష్కరించే అధికారంలో ఉండటమే విప్లవం. అన్నిటికీ అడ్డంపడటమే కౌంటర్ రివల్యూషన్. డెమోక్రసీ ఒక రివల్యూషన్. ఇపుడు అలాంటి విప్లవకారులు కావాలి. రాజకీయాలు ఒక ఆటలా చూడటం కాదు, టాస్క్‌లా తీసుకునేవారు కావాలి.
అలాంటి నాయకుడే కేసీఆర్. అంబేద్కర్ మాటకు విప్లవ అన్వయం కేసీఆర్. సౌదా చెప్పినట్టు ఒక సమున్నత లక్ష్య సాధనలో ఉన్నవారిని ఎవరూ ఆపలేరు. తేలిపోయే ఉత్తుత్తి విమర్శలనే ‘ప్రశ్నలు’ అంటూ సంధిస్తే అవి కర్ణుడి నాగాస్త్రంలా వట్టిపోయి వారి దగ్గరికే వెనక్కిపోతయి!
‘నేను ఇట్ల ఎందుకు అంటున్న అని మీరు ఇంటికి పోయి చర్చ పెట్టాలె’ అంటున్నరు కేసీఆర్. చర్చ పెట్టడం-అంటే దేశ పరిస్థితి గురించి ఆయన చెప్పిన విషయాలను లోతుగా తరచి చూడటం. ‘నేను చెప్పిన అని మీరు నమ్మవలసిన పని లేదు… మీ స్వంత వివేచన చేయాలె’ అని కూడా అంటున్నరు. ఎందుకంటే ఆయనకు ధైర్యం… తను చెప్పేవి నిజాలు అనీ; సొంతం కోసం కావనీ! కరెంటు, నీళ్లు, జీఎస్డీపీ, తలసరి ఆదాయం అన్నీ లెక్కలతో సహా వివరిస్తున్నరు ఆయన. మా బషీరాబాద్ మండలం నుంచి ఒకతను ఫోన్ చేసిండు మొన్న… అయిదో ఆరో తరగతి మించి చదవని అతను ‘తలసరి విద్యుత్ వినియోగం’ అనే పదం వాడితే నాకు ఆనందమైన షాక్ కొట్టింది. నిజం మిత్రులారా… చర్చ జరుగుతున్నది. కేసీఆర్ చెప్పిన మాటలు సభా ప్రాంగణం నుంచే ఆవిరై గాలిలో కలసిపోవడం లేదు. ఆలోచించే ప్రజలకే బీజేపీ భయపడుతది!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విన్నపం:
మిత్రులారా… మీ సోదర రాష్ట్రమైన తెలంగాణ అన్ని సూచీలలో, అభివృద్ధిలో దూసుకుపోతూ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో గత తొమ్మిదేండ్ల రెండు ప్రభుత్వాల పాలన కలిపి చూసినా కేసీఆర్ పాలనలో పదోవంతు అభివృద్ధి లేదు. రాష్ట్రంలోని పార్టీలు నేడు కులాల కంపులో కునారిల్లుతున్నవి. సభ్యసమాజం తలదించుకునే బూతులు అసెంబ్లీలో ధారాళంగా వినిపిస్తున్నయి. వీధి రౌడీల్లా బరితెగించి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నరు. ఆలోచించండి. ప్రజలు కేంద్రంగా రాజకీయాలు జరగాలా వద్దా? నేడు దేశమంతా తెలంగాణ వలె కరెంటు, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, ఆసరా కావాలి అని డిమాండ్లు వస్తున్నయి. ‘కర్ణాటక, మహారాష్ట్ర గ్రామాల ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలపండి’ అని ఊరికే అనడం లేదు కదా? రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్ సహా దేశమంతా తెలంగాణ మాడల్ సాధించాలా వద్దా?
నాడు నిండు సభలో ‘ఆంధ్రప్రదేశ్‌కు ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మించి ఇస్తం’ అన్న మోదీ నేడు మొహం చాటేసిండు. విభజన చట్టం హామీ పడిన ప్రత్యేక హోదా ఇవ్వను ఏమి చేసుకుంటరో చేసుకోండి’ అంటున్నడు. విశాఖ ఉక్కుకు దిక్కులేదు. పోలవరం పొడ కూడా గిట్టడం లేదు బీజేపీకి. జలసిరి అయిన చేపలు, రొయ్యలు, సువిశాలమైన తీర ప్రాంతం, నౌకా వాణిజ్యం ఎన్ని ఉన్నా ఆంధ్రా ఎందుకు గోస పడాలి?
అడగాల్సిన ప్రశ్నలేవి, నిలదీయవలసినదెవరిని అనే విషయంలో క్లారిటీ ఉండాలి. అస్తిత్వ పరిరక్షణ కోసం ఉద్యమం చేసిన సోదరుల ఆవేదన, ఆ కాలంలో వచ్చిన సవాళ్లు, భావోద్వేగాల గురించి మాట్లాడుకుంటూ అక్కడే ఆగిపోరాదు. మీ మీ ఇండ్లల్లో పిల్లలు తమకు మంచి చదువులు, నాణ్యమైన వైద్యం, ఉద్యోగ/ ఉపాధి అవకాశాలు, ఆనందమయ జీవనం కావాలని కోరుకుంటరు. అంతే తప్ప గతాన్ని తవ్వుతూ కూర్చోవాలనుకోరు. కావాలంటే మీ పిల్లలతో మాట్లాడి చూడండి.
నేడు దేశవ్యాప్తంగా రైతులు, దళితులను అక్కున చేర్చుకోవాల్సి ఉన్నది. వ్యవసాయం దండుగన్నవారిని చూసినం మనం. ఇపుడు పండుగ చేస్తున్న కేసీఆర్‌కు ఈ మధ్యే ‘ఛోటూరామ్’ అవార్డు వచ్చింది. ఇవన్నీ దేశమంతా విస్తరించాలంటే కేంద్రలో పక్షపాతం లేని, పక్షవాతం లేని ప్రభుత్వం రావాలి. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు ఆ అవకాశం, అనుభవం, ఆర్తి పుష్కలంగా ఉన్నవి. అందుకే కమ్యూనిస్టు పార్టీలు సహా పలు ప్రాంతీయపార్టీలు కలిసి పనిచేయడానికి ముందుకువస్తున్నయి. మనమంతా చలి చీమలమే కావచ్చు కానీ కలిసి అడుగేస్తే బీజేపీ విషసర్పాన్ని మట్టుబెట్టవచ్చు! తొమ్మిదేండ్ల కింద 5 లక్షల కోట్ల జీఎస్డీపీ నుంచి ఇపుడు 11.5 లక్షల కోట్లకు చేరుకున్నది తెలంగాణ. కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్ల కనీసం 3 లక్షల కోట్ల ఉత్పాదకత తగ్గింది ఒక్క తెలంగాణలోనే. ఇపుడు చెప్పండి బీఆర్ఎస్ దేశపాలనలోమనందరి జీవితాలు బాగుండవా?
‘రోడ్లు, డ్రైనేజీల గురించి మాట్లాడకండి, లవ్ జిహాద్ గురించి ఆలోచించండి’ అంటడు కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ‘కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తే యువత బీజేపీకి దూరంగా పోతరు’ అంటడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి పేరు కూడా తెలియదు ప్రధానికి. ఆ మధ్య మోదీ తెలంగాణకు వస్తూంటే.. ‘హామీలు నెరవేర్చి అప్పుడు రా’ అంటూ 64 మంది మేధావులు, బుద్ధిజీవులు ఆయనకు బహిరంగ లేఖ రాసిన్రు. ఆ నిలదీత జరగాలి ఇప్పుడు దేశమంతటా.
దేశ సరిహద్దులను, దేశ మార్కెట్‌ను కూడా చైనాకు అప్పగించి చోద్యం చూస్తున్న ఈ కుహ నా దేశభక్తులను తరిమికొట్టక తప్పదు. ఆ మధ్య ఈటల రాజేందర్ ఒక నిజం చెప్పిండు… బీజేపీకి అధికారంలోకి రావడం తప్ప వేరే సిద్ధాంతం లేదని. అదే పచ్చి నిజం. మరోవైపు కేసీఆర్ అంటున్నరు 543 ఎంపీ స్థానాలు వచ్చినా ప్రజలకు ఏమి చేస్తమన్న క్లారిటీ లేకపోతే లాభమేమని; పార్టీలు, నాయకులు కాదు ప్రజలు అధికారంలోకి రావాలని! వారికీ మనకూ మౌలికమైన, గుణాత్మకమైన తేడా అదీ! సిద్ధాంతబద్ధులం మనం. అందుకు గర్విద్దాం!
తెలంగాణలోని అభివృద్ధి- సంక్షేమ విధానా ల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలకనుగుణంగా అందిస్తున్నవి కొన్నయితే ఆయనే తన ప్రజలకు ఏమి కావాలో అని మధనం చేసి రూపకల్పన చేసినవి ఎన్నో! కంటివెలుగు, కేసీఆర్ కిట్, దళితబంధు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ దవాఖానలు, సమీకృత కలెక్టరేట్లు, ఇట్లా ఏవైనా సరే ఆషామాషీగా జరగడం లేదు. మహోన్నత లక్ష్యంతో, మేగ్నానిమిటీతో చేస్తున్నరు కేసీఆర్. నాపైన విమర్శలు వచ్చినా సరే, ఒక మాట అనే సాహసం చేస్తున్న- భావ దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్న ప్రతిపక్ష పార్టీలు ఊసుపోక చేసే విమర్శలే తప్ప తమకు ఫలానాది దక్కడం లేదని ప్రజలు నిరసనలు, ధర్నాలు చేసే పరిస్థితి నేడు తెలంగాణలో లేదన్నది వాస్తవం.
ఈ సురాజ్యమే రామరాజ్యమైతే ముమ్మాటికీ తెలంగాణ రాముని ఏలుబడిలో ఉన్నదే, రేపు దేశమంతా రాముని ఏలుబడిలోకి వచ్చేదే. మహా అయితే బీజేపీ వారు అయోధ్య గుడిని ప్రారంభిస్తరేమో వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ రూపంలో దేవుని రాజ్యం అందరి భోజ్యం చేయబోతున్నరు. ‘చాల కల్లలాడుకొన్న…’ అంటూ ఇంక త్యాగరాజు వాపోవనక్కరలేదు!
కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత, జెండర్ వివక్ష లేని రోజులు రాబోతున్నయి. ఇది తథ్యం, ఖమ్మం దానికి ఆరంభం, కదలండి! జై భారత్!!
గత తొమ్మిదేండ్లుగా రెండు తెలుగు రాష్ర్టాల, బీజేపీ పాలిత అన్ని
రాష్ర్టాల ప్రోగ్రెస్ కార్డ్ పబ్లిక్ డొమైన్లో ఉన్నది. నిర్మోహంగా,
నిష్కామంగా ఆలోచిస్తే తెలుస్తది… బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అవసరమో.
అచ్చు తెలంగాణ రీతిలో…
శ్రీశైల్‌రెడ్డి పంజుగుల
90309 97371