హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ)/ఘట్కేసర్: జీవితంలో రిస్క్ తీసుకోకుండా గొప్ప విజయాలు సాధించడం సాధ్యంకాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ఘట్కేసర్లోని కొండాపూర్ విజ్ఞాన్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రాడ్యుయేట్ పట్టాలు అందుకున్న విద్యార్థినులను అభినందించారు. వారికి 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అపజయాల నుంచి పాఠాలు నేర్చుకొని విజయతీరాలవైపు ముందుకెళ్లాలని సూచించారు. ప్రపంచం వేగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వైపు మారుతున్నందున సంప్రదాయ విద్యకే పరిమితం కాకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. దేశంలో కొంత కాలంగా రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. హక్కుల సాధన కోసం ప్రజలు వినూత్న పద్ధతుల్లో పోరాటాలు సాగిస్తున్నారని, జంతర్‌మంతర్ వద్ద జరిగిన వివిధ ఉద్యమాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. హైదరాబాద్‌లో టీ-హబ్ వంటి కార్యక్రమాల ద్వారా స్టార్టప్‌లు, ఉద్యోగ అవకాశాలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.భావితరాల అవసరాలను గుర్తించి ఆవిష్కరణలు చేసే ఇంజినీర్లు, ఇంజినీరింగ్ విద్యార్థులను అవమానించేలా సీఎం వ్యాఖ్యానించడం దురదృష్టకరమ ని పేర్కొన్నారు. క్రిమినల్ వేస్ట్ అనడం అవమానించడమేనని స్పష్టంచేశారు. కళాశాల చైర్మన్ లావు, సీఈవో శ్రా వణ్, ప్రిన్సిపాల్ అప్పారావు నాయుడు, పాల్గొన్నారు.