Maganoor | మాగనూరు: భారత్మాల (Bharatmala) రహదారి నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ వ్యవహారం మాగనూరు మండల కేంద్రం పరిసరాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. తమ భూములకు సరైన పరిహారం చెల్లించకుండానే రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు, కాంట్రాక్టర్ ప్రయత్నించారని బాధిత రైతులు ఆరోపించారు. గురువారం రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలుసుకున్న బాధిత రైతులు సంఘటనా స్థలానికి చేరుకుని పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అధికారులు, కాంట్రాక్టర్ తరఫు సిబ్బంది, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు రైతులు తెలిపారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. తమ భూములకు సరైన పరిహారం అందించకుండా పనులు ఎలా చేపడతారని రైతులు అధికారులను ప్రశ్నించారు. స్థానిక రెవెన్యూ అధికారి రైతులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించినప్పటికీ పరిహారం విషయంలో స్పష్టత వచ్చే వరకు పనులను అనుమతించబోమని రైతులు తేల్చిచెప్పినట్లు తెలిసింది.
రూ. 12 లక్షలకే విలువ నిర్ణయంపై ఆగ్రహం
భూసేకరణ సందర్భంగా తమకు సరైన సమాచారం ఇవ్వకుండా సర్వే (Survey) నిర్వహించారని, భూములకు సరైన విలువ నిర్ణయించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. మాగనూరు చుట్టుపక్కల 167వ జాతీయ రహదారి వెంట భూములకు బహిరంగ మార్కెట్లో ఎకరాకు భారీ ధరలు ఉన్నప్పటికీ, తమ భూములకు ఎకరం సుమారు రూ. 12 లక్షల చొప్పున విలువ నిర్ణయించడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాతో చర్చించకుండా మా ఆస్తులకు ధర ఎలా నిర్ణయిస్తారు, మీరిచ్చే పరిహారంతో కనీసం ఒక ప్లాట్ కూడా కొనలేం అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు
భూసేకరణ పరిహారం (Land Acquisition Compensation) విషయంలో తమకు జరిగిన అన్యాయంపై గత నాలుగేళ్లుగా కలెక్టర్, ఆర్డీవో, ఎన్హెచ్ఏఐ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని బాధిత రైతులు వాపోయారు. దీంతో న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తున్నామని తెలిపారు. తమ పొలాల్లో నిర్మాణ పనులు చేపట్టకుండా కోర్టు నుంచి స్టే ఉత్తర్వులు ఉన్న విషయాన్ని అధికారులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు రైతులు పేర్కొన్నారు. దీంతో పనులను నిలిపివేసినట్లు తెలిపారు.
మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వాలి
భూములు కోల్పోతున్న రైతుల (Farmers)తో అధికారులు చర్చించి, భూసేకరణకు సంబంధించిన నిబంధనల ప్రకారం పరిహారం విషయంలో స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత భూమి విలువ, భూసేకరణ చట్టంలోని పరిహార నిబంధనలు, సంబంధిత కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు. భూములు కోల్పోయే రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని న్యాయబద్ధమైన పరిహారం నిర్ణయించాలి. అప్పుడే రహదారి నిర్మాణానికి సహకరిస్తాం అని రైతులు స్పష్టం చేశారు.