ఒక సమాజం అభివృద్ధిని కొలిచే కొలమానాల్లో ప్రజారోగ్యం అత్యంత ముఖ్యమైనది. వైద్యరంగంలో ఆధునిక సదుపాయాలు, చికిత్సలు అందుబాటులోకి వచ్చిన తర్వాత జీవన ప్రమాణాలు పెరిగాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరిగింది. ఉదయం నడక, వ్యాయామం, ధ్యానం వంటివి దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. నేటికీ అది ఆదర్శనీయంగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు ‘తెలంగాణ రన్’ను పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నది.
ఓవైపు ఈ విధంగా వైద్యరంగాన్ని పటిష్ఠపరుస్తూ, మరోవైపు, ప్రజల్లో ఆరోగ్యం పట్ల స్పృహను పెంచే కార్యక్రమాలు అమలు చేస్తున్నది. పల్లె ప్రకృతి వనాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి, అక్కడ వాకింగ్ ట్రాక్‌లను, ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసింది. పట్టణ ప్రగతిలో భాగంగా అనేక పార్కులను సుందరీకరించి, వాటిల్లో నడక, వ్యాయామం కోసం సౌకర్యాలను కల్పించింది.
వ్యవసాయ విప్లవం ద్వారా రాష్ర్టాన్ని ఆకుపచ్చని తెలంగాణగా మార్చిన ప్రభుత్వం.. ఆరోగ్య తెలంగాణగా కూడా మార్చేందుకు అనేక చర్యలు చేపట్టింది. ప్రజారోగ్య రంగం బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నది. దీని ఫలితంగానే పలు జాతీయ ఆరోగ్య సూచీల్లో, నివేదికల్లో తెలంగాణ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నది. ఓవైపు ఈ విధంగా వైద్యరంగాన్ని పటిష్ఠపరుస్తూ, మరోవైపు, ప్రజల్లో ఆరోగ్యం పట్ల స్పృహను పెంచే కార్యక్రమాలు అమలు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు, చిన్నారులకు ఉపయుక్తంగా ఉండేలా క్రీడాప్రాంగణాలను నిర్మిస్తున్నది. ఈ ప్రాంగణాల్లో క్రీడా పరికరాలను కూడా ప్రభుత్వమే సమకూర్చుతున్నది. పల్లె ప్రకృతి వనాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి, అక్కడ వాకింగ్ ట్రాక్‌లను, ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసింది. పట్టణ ప్రగతిలో భాగంగా అనేక పార్కులను సుందరీకరించి, వాటిల్లో నడక, వ్యాయామం కోసం సౌకర్యాలను కల్పించింది. ఈ విధంగా ప్రజల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న చైతన్యాన్ని పెంపొదిస్తున్నది. దీంట్లో భాగంగానే క్రీడలను ప్రోత్సహిస్తున్నది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సీఎం కప్‌లో వేలాదిమంది యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొనటం తెలిసిన విషయమే. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో విశేష ప్రతిభను కనబరిచిన క్రీడాకారులను ప్రోత్సహించి, వారి కెరీర్‌కు బాటలు వేస్తున్నది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా మైదానం, ఆరు వేల జనాభా గల గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం కేసీఆర్‌కు క్రీడల పట్ల ఉన్న మక్కువకు తార్కాణం. విద్య, ఉద్యోగాల్లో కూడా వారికి రిజర్వేషన్లను అమలు చేస్తున్నది. ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహం కారణంగానే తెలంగాణ కీర్తిపతాక అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతున్నది.
నేడు తెలంగాణ రన్ కార్యక్రమం పోలీసుశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నది. పోలీసులకు దేహదారుఢ్యం, ఆరోగ్యం తప్పనిసరి. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులకు ఫుడ్ ప్యాకెట్లకు బదులు మిల్లెట్స్ ఆహారాన్ని అందిస్తున్నారు. ఇది సత్ఫలితాలు ఇస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలుచేసే యోచన జరుగుతున్నది.
ఇప్పటికే పోలీసు శాఖను ఆధునీకరించే చర్యలను చేపట్టిన ప్రభుత్వం పోలీసుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నది. ప్రత్యేక ఆరోగ్యశిబిరాలను నిర్వహిస్తూ, ఆరోగ్య సమస్యల బారిన పడినవారికి ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు. మహిళా పోలీసులకు సంబంధించి ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న పోలీసులు క్రీడల్లో కూడా తమ ప్రతిభను కనబరుస్తూ తెలంగాణ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటుతున్నారు. గత ఏడాది జరిగిన అఖిల భారత పోలీసు స్పోర్ట్స్ మీట్, జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ పోలీసులు 54 పతకాలను సాధించారు. వ్యక్తిగత విభాగంలో 5 స్వర్ణ, 8 కాంస్య, 12 రజత పతకాలను సాధించడం రాష్ర్టానికి గర్వకారణం. అలాగే జట్లవారీగా జరిగిన క్రీడల్లో 5 కాంస్యం, 24 రజత పతకాలను కైవసం చేసుకున్నారు.
పోలీసు ఉద్యోగమంటేనే కత్తిమీద సాము లాంటిది. ఒకవైపు విధుల నిర్వహణలో బిజీగా ఉంటూనే మరోవైపు ఆరోగ్యానికి, క్రీడలకు కొంతసమయాన్ని కేటాయిస్తున్నారు. నూతనంగా నిర్మిస్తున్న పోలీసుస్టేషన్ భవనాలలో ప్రభుత్వం జిమ్‌లను ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయం. విరామ సమయంలో పోలీసులు జిమ్‌లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా వారు ఆరోగ్యవంతులుగా ఉండి, విధులను సక్రమంగా నిర్వర్తించగలుగుతారనేది ప్రభుత్వ ఆలోచన. కొత్తగా పోలీసు ఉద్యోగాలకు తీసుకుంటున్న వారి ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. పోలీసు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచే వారిలో ఆరోగ్య స్పృహను పెంపొందిస్తున్నది.
పోలీసు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్వయంగా పోలీసుశాఖనే శిక్షణ నిస్తున్నది. శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవటం, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రో వంటి వాటిల్లో ఆయా జిల్లాలఎస్పీల ఆధ్వర్యంలో ఈ శిక్షణను ఇస్తున్నారు. అభ్యర్థులకు ఇది ఎంతో మేలు చేస్తున్నది. శిక్షణ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయటం చాలామంది పేదవర్గాల అభ్యర్థులకు తలకు మించిన భారంగా మారింది. ఈ విషయాన్ని గమనించిన సీఎం కేసీఆర్.. అభ్యర్థులందరికి ఉచితంగానే పోలీసుశాఖ ద్వారానే తర్ఫీదు ఇవ్వాలని ఆదేశించారు.
గత తొమ్మిదేండ్లలో 48,096 పోలీసు ఉద్యోగాల భర్తీకి మూడు నోటిఫికేషన్లు ఇవ్వగా ఇప్పటి వరకు 28,277 పోస్టులను భర్తీ చేశారు. మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం పోలీసు నియామకాల్లో దేశంలోనే తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. శాంతి భద్రతల నిర్వహణ సమర్థవంతంగా అమలు జరిగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనేది సీఎం కేసీఆర్ ఆలోచన. ఆ దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగడం వల్లనే దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇవాళ రాష్ర్టానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయి.
అన్నింటా తెలంగాణను అగ్రగామిగా నిలుపాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యం. ఆయన దార్శనికత వెలుగులో రూపొందించిన, అమలు చేసిన వినూత్న పథకాల కారణంగానే సాగునీటి నుంచి ఐటీ వరకూ మన రాష్ట్రం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ మాడల్ నేడు యావత్ దేశానికి ఆసక్తి కలిగిస్తున్నది.
వైద్య ఆరోగ్య రంగాల్లోనూ తెలంగాణ వడివడిగా ముందుకు సాగుతున్నది. ప్రజలందరు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. రాష్ర్టాలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య పరిరక్షణ పట్ల మనమందరం చైతన్యాన్ని పెంపొందించుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తెలంగాణ రన్ సందేశం రాష్ట్రమంతటా వినిపించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం.
(వ్యాసకర్త: చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌజింగ్ కార్పొరేషన్)
-కోలేటి దామోదర్
98491 44406