Telangana | మౌలిక సమస్యల సుదీర్ఘకాలం పాటు అధ్యయనం చేసి, వాటిని అవగాహన చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల సరైన మార్గాలను అన్వేషించుకొని అమలు చేయగల సమర్థవంతమైన నాయకత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. ప్రజలను మభ్యపెట్టి, అలవికాని హామీలను గుప్పించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం, ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలు తీసుకునే అసమర్థ నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని పదేండ్ల కాలంలో రాష్ట్ర మత్స్యరంగంలో జరిగిన ప్రయత్నాలు, తీసుకున్న చర్యలు, అమలుపరిచిన పథకాలు… వీటన్నింటి పర్యవసానంగా స్పష్టంగా సాక్షాత్కరిస్తున్న ఫలితాలు ఇప్పుడు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అయితే, గత ఏడాది కాలంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు తెలంగాణ మత్స్యరంగంలో జరుగుతున్న దుష్పరిణామాలను పరిశీలిస్తే రానున్న మరో నాలుగేండ్ల రాజ్యాంగ బద్ధమైన పదవీకాలంలో ఈ రాష్ట్ర ప్రజల అనుభవంలోకి చేదు అనుభవాలను అంచనా వేయడం కష్టసాధ్యంగానే కనిపిస్తున్నది.
ఉమ్మడి ఏపీ ఉనికి కాలంలో అత్యంత నిరాదరణకు, బుద్ధిపూర్వక నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంత మత్స్యరంగం లక్షల మంది మత్స్యకార కుటుంబాలకు జీవనాధారంగా నిలువలేకపోయింది. ఫలితంగా తరతరాల నుంచి చేపల వేట ప్రధాన వృత్తిగా స్థిరపడిన సంప్రదాయ మత్స్యకార కుటుంబాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే తమ జీవితాలకు తమ కులవృత్తి ఒక సాంత్వనగా, ఆలంబనగా నిలుస్తుందని ఎన్నో ఆశలు పెంచుకున్నారు. మలిదశ ఉద్యమంలో అమరునిగా నిలిచిన కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి అనేక మంది మత్స్యకార సోదరులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. చిన్నతనంలో మత్స్యకార కులానికి చెందిన ముదిరాజ్ తల్లి చనుబాలు తాగి పెరిగినట్టు అనేక సందర్భాల్లో భావోద్వేగంతో ప్రకటించుకున్న కేసీఆర్ తెలంగాణలోని మత్స్యకారుల పట్ల పూర్తి అవగాహనతోనూ, సమస్యల పట్ల సహానుభూతితోనూ వ్యవహరించారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే మత్స్యకారుల జీవితాలపైనా, మత్స్యరంగాన్ని వారికి జీవనాడిగా మార్చేందుకు గాను తమ ప్రభుత్వం తీసుకోవాలనుకుంటున్న చర్యలపైనా నిండు అసెంబ్లీలో సుమారు గంటపాటు సుదీర్ఘంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రదర్శించిన ఈ ఔదా ర్యం రాష్ట్రంలోని మత్స్యరంగానికి చెందిన సుమా రు 60 లక్షల మంది మత్స్యకారులకు వెయ్యేనుగుల బలాన్ని సమకూర్చింది. ఆ రంగం పట్ల తెలంగాణ సమాజంలో అప్పటివరకు నెలకొని ఉన్న చులకనభావాన్ని పటాపంచలు చేసి గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసింది. అసెంబ్లీ వేదిక నుంచి మత్స్యరంగ భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రవచించిన అంశాలన్నింటినీ అమలుపరిచి ఫలితాలను సాక్షాత్కరించేందుకు గాను కేసీఆర్ ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు.
ప్రపంచవ్యాప్తంగా మేధావి వర్గాలను అబ్బురపరిచి రైతుబంధు పథకాన్ని అమల్లోకి తీసుకురావడానికి రెండేండ్ల ముందుగానే దేశంలోనే మొదటిసారిగా 2016లోనే ఉచిత చేపపిల్లల పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం ఎనిమిది దఫాలుగా ఈ పథకాన్ని ఎంతో ఔదార్యంతో అమలుపరిచారు. ఫలితంగా రాష్ట్రంలో చేపల ఉత్పత్తిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
మత్స్యకార కుటుంబాల్లో ఈ రంగం పట్ల కొడిగట్టుకుపోయిన ఆశలు చిరురించాయి. మత్స్యరంగం తమకు జీవనాధారంగా నిలుస్తుందనే విశ్వాసం మత్స్యకారుల్లో పెరిగింది. గతంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగానికి ఊతమివ్వడం కోసం కాళేశ్వరం లాంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ లాంటి బృహత్తర పథకాల అమలు ఫలితంగా చెరువులు, కుంటల్లో ఏడాది పొడవునా నీటి నిల్వ సౌలభ్యం ఏర్పడింది. ఈ కారణంగా నీటి వనరులపైనే పూర్తిగా ఆధారపడిన మత్స్యకారుల ఆదాయం భారీగా పెరిగింది.
మత్స్యకారులంటే సమాజంలో ఒక గౌరవనీయమైన స్థానం లభించింది. పర్యవసానంగా మత్స్యకార వృత్తి పట్ల నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న చేపల వృత్తి కులాలకు చెం దిన యువతలో మత్స్యకారునిగా గుర్తింపు కావాలనే తాపత్రయం పెరిగింది. ఈ పరిస్థితులకు అనుగుణంగా అప్పటి ప్రభుత్వం రెండున్న ర ఎకరాలకు ఒకరికి సభ్యత్వం కల్పించే నిబంధనలను సవరించి ఒక ఎకరానికి ఒకరికి సభ్యత్వాన్ని కల్పించే సాహసోపేతమైన సవరణను అమల్లోకి తీసుకువచ్చింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి రెండున్నర లక్షలుగా ఉన్న మత్స్యకారుల సంఖ్య ప్రభుత్వం సవరించిన నిబంధనల కారణంగా నాలుగు లక్షలకు చేరుకున్నది. మత్స్య సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చుకునేందుకు ప్రభుత్వమే మత్స్యశాఖ ద్వారా రెండు దశల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, కొత్తగా మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేయడం, వాటిల్లో అర్హులైన యువకులను చేర్చుకునే కార్యక్రమాన్ని నిర్వహించడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. కొత్తగా సుమారు రెండు వేల మత్స్య సహకార సంఘాలను ఏర్పాటుచేయడమే కాకుండా, దాదాపు రెండు లక్షల మందికి ఈ సంఘాలలో కొత్తగా సభ్యత్వం కల్పించడం దేశ చరిత్రలోనే ఒక అరుదైన సంఘటనగా నిలిచింది.
దశాబ్దాల తరబడి గ్రామాల్లోని చెరువులు గ్రామ పంచాయతీల ఆధీనంలో ఉండేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ పరిధి నుంచి చెరువులను తొలగించింది. తద్వారా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగయ్యాయి. చెరువులను మత్స్యసహకార సంఘాలకు నేరుగా కేటాయించే విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో ఎంతో ఊరట కలిగింది. అం తేకాకుండా, ఈ చెరువుల కేటాయింపులో స్థానిక రాజకీయ జోక్యానికి కూడా తెర దించడం వల్ల కక్షసాధింపు చర్యలకు ఆస్కారం లేకుండా పోయింది. ఈ పద్ధతిలో రాష్ట్రంలోని దాదాపు 26 వేల గ్రామ పంచాయతీ చెరువులపై స్థానిక మత్స్యసహకార సంఘాలకు అజమాయి షీ లభించింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు దానికి అనుబంధంగా నిర్మించిన జలాశయాల్లోనూ ఆ ప్రాంత పరిధిలోని మత్స్యకారులకు లైసెన్స్‌లు జారీచేయడంతో మత్స్యకారులు ఆయా రిజర్వాయర్లలో చేపలు పట్టుకునే హక్కు ను సాధించారు.
ఒకవైపు కేంద్రం ద్వారా అమల్లోకి వచ్చిన నీలి విప్లవం, ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన లాంటి పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర పరిధిలో పటిష్ఠమైన చర్యలు తీసుకుంటూ నే, మరోవైపు మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గాను, మత్స్యసహకార సం ఘాలను పటిష్ఠపరిచేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకున్నది. ముఖ్యం గా రూ.1000 కోట్ల భారీ నిధులతో చేపట్టి అమ లు జరిపిన సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం రాష్ట్రంలోని సుమారు లక్షా ముప్ఫై వేల మంది మత్స్యకార కుటుంబాలకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో సుమారు 63 వేల ద్విచక్ర వాహనాలు (మోపెడ్స్) పంపిణీ చేయడం తెలంగాణలోని మత్స్యకారుల్లో ఉత్సాహపూరితమైన వాతావారణాన్ని కల్పించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా తానే పూచీకత్తుగా నిలిచి జాతీయ సహకార ఆర్థిక సంస్థ ద్వారా వెయ్యి కోట్ల భారీ రుణాన్ని సేకరించి మరీ ఈ పథకాన్ని అమలు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం పూర్వపు 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో జిల్లా స్థాయి మత్స్య సహకార సంఘాలను సైతం విస్తరించేందుకు గాను నాటి ప్రభుత్వం పూనుకొని ఆ దిశగా అడుగులు వేసింది. కొత్త జిల్లాలతో పాటుగా పూర్వపు జిల్లాల్లోనూ కొత్తగా మత్స్య సహకార సంఘాలను అధికారికంగా నమోదు చేయించేందుకు జిల్లా స్థాయిలో తాత్కాలిక కమిటీలను ఏర్పాటుచేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేశారు.
తదనంతర చర్యగా జిల్లా స్థాయి మత్స్య సహకార సంఘాలను చేసేందుకూ చర్యలు తీసుకున్నది. ఈ తతంగాలను పూర్తిచేసేందుకు రాష్ట్ర స్థాయి ఫిషరీస్ ఫెడరేషన్‌కు తాత్కాలిక పద్ధతిలో చైర్మన్, వైస్ చైర్మన్లను నియమించి మత్స్యరంగంలో సహకార చట్టం నిబంధనలకు అనుగుణంగా సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రాష్ట్రం లో మహిళా మత్స్యకారుల్లో ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు, మహిళా సాధికారికతను సాధించేందుకు మహిళా మత్స్యకార సొసైటీల ఏర్పాటును ప్రోత్సహించారు. అదేవిధంగా మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వ నిబంధనల ప్రకారం సభ్యత్వం లభించని ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు మత్స్య మార్కెటింగ్ సొసైటీల ఏర్పాటును కూడా ప్రోత్సహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ మత్స్యరంగంలో ఏదో ఒక పద్ధతిలో అవకాశాలను కల్పించేందుకు అంతకుముందున్న నిబంధనలను సరళీకృతం చేసింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం లో అదనంగా సుమారు రెండు వేల మేరకు నూత న మత్స్య సహకార, మత్స్య మహిళా, మత్స్య మార్కెటింగ్ సహకార సంఘాలు ఏర్పాటయ్యా యి. వీటిల్లో దాదాపు రెండు లక్షల మంది మత్స్యకారులకు అదనంగా సభ్యత్వం లభించడంతో పాటుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తీసుకువచ్చే పథకాలన్నింటికీ అర్హత లభించింది.
తెలంగాణలోని 33 జిల్లాల్లో తొలిసారి గత సంవత్సరంలో మూడురోజుల పాటు ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్స్ కార ణంగా ఔత్సాహిక మత్స్యకారులకు ప్రోత్సాహం లభించింది. సుమారు ఆరేండ్ల కిందట వనపర్తి జిల్లా పెబ్బేరులో పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేసిన ఫిషరీస్ కళాశాల విజయవంతంగా నడుస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.12 కోట్లతో మేడ్చల్‌లో నిర్మించిన మత్స్యకార వృత్తి శిక్షణా సంస్థ ఒక ఆదర్శ కేంద్రంగా నిలిపేందుకు అవకాశాలున్నాయి. అయితే అన్ని రకాలుగా సంసిద్ధమై ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఈ శిక్షణా సంస్థను ఉపయోగంలోకి తీసుకురావాలనే సోయి నేటి ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూరం. రాష్ట్రంలో మత్స్యకారుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిలువెత్తు నిదర్శనం. ఇక గత ప్రభుత్వ హయాంలో అమలైన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని నీరుగార్చేందుకు గాను ఇప్పటి ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. అందుకేనేమో పంపిణీ చేయవలసిన చేపపిల్లల పరిమాణాన్ని సగానికి తగ్గించింది. ఈ సగం పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఇంకా పూర్తిచేయకపోవడం బాధాకరం. ఈ విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తమ ప్రభుత్వ నిర్వా కం మీద మీడియా ముఖంగా విరుచుకుపడ్డారు. చెరువుల్లో చేప పిల్లలను వదలకుండా కార్యక్రమాన్ని బహిష్కరించి ఆయన వెళ్లిపోవడం లాంటి విపరిణామాలు తెలంగాణ మత్క్యరంగం పట్ల, ఆ రంగం మీద ఆధారపడిన 4 లక్షల పైచిలుకు మత్స్యకార కుటుంబాల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిదర్శనం.
(వ్యాసకర్త: ‘ఫిషరీస్ ఫెడరేషన్’ మాజీ చైర్మన్, ‘తెలంగాణ ఫిషరీస్ సొసైటీ’ వ్యవస్థాపక అధ్యక్షులు, ‘ఏషియన్ ఫిషరీస్ సొసైటీ’ సభ్యులు)
-పిట్టల రవీందర్
99630 62266