వేల ఏండ్ల ‘వెలి’వాడల కన్నీళ్లను తుడిచేందుకు కాంగ్రెస్ పాలకులకు ఇంకా చేతులు రావడం లేదు. నిజాయితీ, శ్రమనే నమ్ముకొని, రెక్కలనే ఆయుధంగా మలచుకొని అట్టడుగు స్థాయుల్లో బతుకీడుస్తున్న దళితులను ‘చేవెళ్ల డిక్లరేషన్’పేరుతో మరోమారు దగా చేసినట్టే అనిపిస్తున్నది. ఇందిరమ్మ రాజ్యం, రాజ్యాంగ పరిరక్షణ పేర్లతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన ‘హస్తం’ పాలకులను.. ఇప్పుడు చేవెళ్ల డిక్లరేషన్ హామీల అమలు కోసం నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది.
రాష్ట్ర జనాభాలో దళితులు సింహభాగంగా ఉన్నారు. 2023, ఆగస్టు 26న చేవెళ్లలో జరిగిన ప్రజాగర్జన బహిరంగ సభలో స్వయంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షు డు మల్లిఖార్జున ఖర్గే ‘ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్’ను అత్యంత ఆర్భాటంగా ప్రకటించారు. అనంత రం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకున్నది. ఇందులో దళితుల పాత్ర కీలకమైంది. అయితే, దళితుల సంక్షేమం అంశంలో ‘ప్రజా పాలన’ అంటూ చెప్పుకొంటున్న పాలకుల శైలి ‘ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటినాక బోడమల్లన్న’ అన్న చందంగా ఉన్నది. ‘ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్’ సమగ్ర అమలుపై దృష్టి కేంద్రీకరించకపోవడమే ఇందుకు ఉదాహరణ. ఎస్సీలకు ఇచ్చిన హామీల్లో ‘ఎస్సీ వర్గీకరణ’ అంశమే కార్యరూపం దాల్చింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి, తొలి సీఎం కేసీఆర్ స్వయంగా సంబంధిత తీర్మానం కాపీని ప్రధాని మోదీకి అందజేశారు. ఇక రాజకీయ పార్టీలన్నీ ఆదినుంచి ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ వచ్చాయి. ఒక పక్క సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మక తీర్పు. మరోపక్క తెలంగాణలో దళితుల జనాభాలో మాదిగల సంఖ్య అత్యధికంగా ఉండటంతో ఎస్సీ ఉప వర్గీకరణ అమలుకు అనివార్యత ఏర్పడింది. ఏ ప్రభుత్వం ఉన్నా, రిజర్వేషన్ల ఉప వర్గీకరణ చేయాల్సి వచ్చేది. తాను సీఎంగా లేకుంటే వర్గీకరణ అసలు జరిగేదే కాదన్నట్టుగా ఎనుముల రేవంత్ రెడ్డి పదే పదే గొప్పలకు పోవడం హాస్యాస్పదం. వర్గీకరణ చట్టం చేయకుండానే ఇటీవల హడావుడిగా గ్రూప్-1, 2, 3తో పాటు ఇతర శాఖల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల మాదిగ, ఉప కులాలకు నష్టం జరిగిన మాట వాస్తవం కాదా? దీనికి ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాలి.
ఇక, డిక్లరేషన్‌లో పేర్కొన్న ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్ల పెంపు, ఇంటి స్థలంతో పాటు భవన నిర్మాణానికి రూ.6 లక్షల సహకారం అందిస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైంది. మాదిగ, మాల, ఉప కులాలకు వేర్వేరుగా మూడు కార్పొరేషన్లను ఏర్పాటుచేస్తామన్న వాగ్దానాన్ని కూడా విస్మరించారు. కేవలం ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటుచేసి ‘మమ’ అనిపించారు. అయితే, గత జూలై 8న ప్రభుత్వం మొత్తం 34 మందితో కూడిన కార్పొరేషన్ చైర్మన్ల తొలి జాబితాను విడుదల చేసింది. అందులో కేవలం దళిత సామాజిక వర్గానికి ఒక్క పదవిని (సంప్రదాయబద్ధంగా వస్తున్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి) కేటాయించడం గమనార్హం. ఈ పదవుల కేటాయింపుల్లోనూ జనాభాలో అతి స్వల్పంగా ఉన్న తన సొంత సామాజికవర్గానికి రేవంత్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శ ఉన్నది. ఇక విద్యాజ్యోతులు పథకం ద్వారా 10వ తరగతి పాసైతే రూ.10 వేలు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ పూర్తిచేస్తే రూ.25 వేలు, పీహెచ్డీ పూర్తిచేసిన యువతకు రూ.5 లక్షల సాయం అందిస్తామన్న హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో పేద విద్యార్థులు అవస్థలు పడుతూ చదువుకు దూరమయ్యే దుస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉంటే విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే అవకాశం పొందిన దళిత యువతకు ప్రభుత్వం ‘అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్’ ద్వారా అందించే సహకారంలో కూడా తీవ్ర జాప్యం నెలకొన్నది. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థి ఇటీవల తనకు స్కాలర్షిప్ను మంజూరు చేయించాలని ‘ఎక్స్’ వేదికగా సీఎం రేవంత్‌కు తన గోడును విన్నవించుకున్నాడు. ప్రతి మండలంలో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, డిగ్రీ, పీజీ చదివే ఎస్సీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చకపోగా, దశాబ్దం పాటు ఆదర్శంగా నిలిచిన ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో ప్రత్యేక పట్టింపు లేకపోవడంతో ఇప్పుడు విద్యార్థుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. సీడీఎస్ (సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్) భవనం ప్రారంభానికి ప్రభుత్వం ఎందుకు అనాసక్తి చూపుతున్నది? దళితుల అభ్యున్నతికి మెరుగైన పరిశోధనలు, ప్రణాళికలు జరగొద్దా ? గత ప్రభుత్వం ఎలాంటి షరతులు, బ్యాంకు లింకేజీ లేకుండా నిరుపేద దళిత కుటుంబాలకు ఏకమొత్తంగా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఫలితంగా 44 వేల మందికి ఆర్థిక లబ్ధి జరిగింది. అంతేకాదు, మూడెకరాల భూ పంపిణీ వల్ల కూడా కొంతమేర మేలు జరిగింది. ఇక, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ‘అంబేడ్కర్ అభయ హస్తం’ పథకం ద్వారా దళిత కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం, ఇందుకోసం ప్రతి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయిస్తామన్న హామీని తుంగలో తొక్కారు.
2024-25, 2025-26 బడ్జెట్ కేటాయింపుల్లో అసలు ‘అంబేద్కర్ అభయహస్తం’ ఊసే లేదు. పైగా దళితబంధు నిధుల్లో కొరత విధించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులపై నిజాలు దాస్తూ వస్తున్నారు. బహుశా, దళితులు కుట్రలు పసిగట్టలేరనే ప్రగాఢ విశ్వాసం ఆధిపత్య పాలకుల్లో ఇంకా సజీవంగానే ఉందనిపిస్తున్నది. అగ్రనేత లు రాహుల్‌గాంధీ, ప్రియాం కా గాంధీ ప్రకటించిన డిక్లరేషన్లపై ఆసక్తి చూపుతూ, మల్లిఖార్జున ఖర్గే ప్రకటించిన డిక్లరేషన్‌పై నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంలో రేవంత్‌రెడ్డి ఆంతర్యం ఏమిటో? గాంధీలంటే అభిమానమా? ఖర్గే అంటే లెక్కలేనితనమా? అనే సందేహం కలుగుతున్నది. ‘జై భీమ్’ అంటూ నిత్యం నినదిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘చేవెళ్ల డిక్లరేషన్’ సమ గ్ర అమలు కోసం రేవంత్‌ను ఆదేశించాలి. కాం గ్రెస్ పాలకుల ఆలోచనల్లో ఇకనైనా ‘మార్పు’ రావాలి. లేదంటే, ప్రజలే ప్రభుత్వాలను మార్చుకుంటారు.
(వ్యాసకర్త: సోషియాలజీ విద్యార్థి, ఓయూ)
-నరేష్ పాపట్ల
95054 75431