తెలంగాణ బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే గంభీరమైన అంశం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చట్టపరంగా పరిష్కరించకుండా రాజకీయ లబ్ధి కోసమే ఉపయోగించుకుంటున్నట్లు స్పష్టమవుతున్నది. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై వేగంగా నిర్ణయం తీసుకునే మార్గాలు సుప్రీంకోర్టు నిర్దేశించినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయపరమైన దారులు వదిలి ధర్నాలు, పార్టీ అగ్రనాయకత్వానికి ప్రజెంటేషన్లకే పరిమితమవుతున్నారు. దీంతో ఇది బీసీల హక్కులను రక్షించే పోరాటం కాదని, కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో పాయింట్లు సాధించుకునే ప్రయత్నమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రపతి వద్ద ఏవైనా బిల్లులు నిలిచిపోయిన సందర్భంలో సహజంగా అన్ని పార్టీలతో చర్చించి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళ్లాలి. కానీ, రేవంత్ ప్రభుత్వం మాత్రం తమకు నచ్చినవారినే వెంట తీసుకెళ్లి ఢిల్లీలో ధర్నా చేయాలనుకుంటున్నది. అధికారిక ఆహ్వానం లేకపోవడం నిర్లక్ష్యం మాత్రమే కాదు, ఉద్దేశపూర్వకంగా విభజించి రాజకీయ లబ్ధి కోసమే చేసిన ప్రయత్నమని విశ్లేషకులు అంటున్నారు. బీసీ రిజర్వేషన్ల వంటి కీలక అంశాన్ని ప్రభుత్వ స్వంత ప్రచార అంశంగా మార్చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రధాన ప్రతిపక్షాలను ఆహ్వానించకపోవడం వెనుక ఉన్న ఉద్దేశంపై గంభీర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రజల హక్కులకు సంబంధించిన అంశాన్ని పార్టీ కార్యకలాపాల స్థాయికి తగ్గించడం ఎంతవరకు సమంజసమనే చర్చ జరుగుతున్నది.
2025 ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ కేసులో బిల్లులపై గరిష్ఠంగా మూడు నెలల్లో రాష్ట్రపతి, గవర్నర్లు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం నేరుగా రిట్ ఆఫ్ మాండమస్ దాఖలు చేసి రాష్ట్రపతి గడువులోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు ద్వారా ఆదేశింపజేసుకోవచ్చు. కానీ, ఈ మార్గాన్ని పక్కనబెట్టి ధర్నాల ద్వారా ఒత్తిడి రాజకీయాలు చేయడం బీసీల భవిష్యత్తును రాజకీయ లబ్ధి కోసం తాకట్టు పెట్టడమే. న్యా యపరమైన పోరాటం చేయకపోవడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తున్నది.
ఆర్టికల్ 31 సీ కింద రక్షణ తెచ్చుకుంటే సరిపోతుందని ప్రభుత్వం భావిస్తున్నది. కానీ, మినర్వా మిల్స్ (1980) తీర్పు ప్రకారం ఈ రక్షణ ఆర్టికల్ (39) (బీ), 39(సీ) వరకు మాత్రమే పరిమితం. అంతేకాదు, IR Coelho (2007) ప్రకారం 1973 తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చిన ఏ చట్టమైనా బేసిక్ స్ట్రక్చర్ టెస్టులో నిలబడాలి.
ఇటీవల గౌరవ్ కుమార్ కేసులో కూడా 50 శాతం దాటే రిజర్వేషన్లకు అసాధారణ పరిస్థితులు, శాస్త్రీయ డేటా, స్వతంత్ర కమిషన్ సిఫారసులు తప్పనిసరని పాట్నా హైకోర్టు పునరుద్ఘాటించింది. ఇవి లేకుండా రాష్ట్రపతి ఆమోదం తెలిపినా కోర్టులో ఈ బిల్లులు నిలబడవు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎస్ఈఈఈపీసీ సర్వే, ఏకసభ్య బూసాని కమిషన్ నివేదికపై ఆధారపడి తీసుకున్న నిర్ణయాలు ఈ ప్రమాణాలను సంతృప్తపరచవు.
తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లను శాశ్వతం చేసుకోవడంలో శాస్త్రీయ సర్వేలు, సత్తానాథన్అంబాశంకర్ కమిషన్ నివేదికలు, అసెంబ్లీ చర్చలు కీలకపాత్ర పోషించాయి. రాష్ట్రపతి ఆమోదం తెచ్చుకుని, 76వ రాజ్యాంగ సవరణతో 9వ షెడ్యూల్లో చేర్చడమే ఆ రిజర్వేషన్లను నిలబెట్టగలిగాయి. కానీ, తెలంగాణలో మాత్రం ఎస్ఈఈఈపీసీ సర్వే, ఏకసభ్య బూసాని కమిషన్ నివేదికల ఆధారంగా బిల్లులు రూపొందించి, శాసనసభ-మండలిలో చర్చ లేకుం డా రాష్ట్రపతికి పంపడం పెద్ద తప్పిదం. ఇది ప్రజాస్వామ్య పారదర్శకతకు విరుద్ధం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 6వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతిని కలిసి ఒత్తిడి తేవాలనుకోవడం రాజకీయ లబ్ధి కోసమే. కానీ, రాష్ట్రపతి ఆమోదించకపోతే ఆ బిల్లులు నిలిచిపోయే పరిస్థితి మారదు. ఈ చర్యలు కాంగ్రెస్ పార్టీ స్థానిక, జాతీయ రాజకీయాల్లో మైలేజీ కోసం చేసిన ప్రయత్నాలుగానే కనిపిస్తున్నాయి. న్యాయపరంగా పోరాటం చేయకుండా, ఇలాంటి ప్రయత్నాలు చేయడం ఫలితం ఇవ్వదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బీసీలకు న్యాయం చేయాలంటే చట్టపరమైన లోపాలను సరిదిద్దుకుని, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణతో 9వ షెడ్యూల్లో చేర్చడం తప్పనిసరి. ఎన్నో లోపాలతో నిండిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించబోరని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించడంలో ప్రభుత్వం నిజమైన గంభీరత చూపడం లేదని స్పష్టమవుతున్నది. ప్రజా ప్రదర్శనలు, ధర్నాలు మాత్రమే చేసి, న్యాయపరమైన దిశలో ముందుకు వెళ్లకపోవడం బీసీల హక్కులను రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ వాడుకుంటున్నదన్న విమర్శలకు బలాన్ని చేకూరుస్తున్నది.
– (వ్యాసకర్త: మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్)
డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు