‘రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఆయుధాలు పట్టుకొని అడవిలో కలువాలె’ అని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి స్టేషన్ ఘన్‌పూర్‌లో ఇటీవల చేసిన వ్యాఖలు అత్యంత ఖండనీయమైనవి. యువతను రెచ్చగొట్టేలా రేవంత్ చేసిన ఈ విద్వేషపూరిత ప్రసంగం కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విషం చిమ్మేందుకేనని ప్రజలకు అర్థమవుతున్నది. ఇది తెలంగాణను తెర్లు చేసే కుట్రపూరిత వైఖరి. తమ కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కకపోతే రాష్ర్టాన్ని ఆగంజేస్తాం, ప్రజలు ఏమైపోయినా మాకు అవసరం లేదనే ధోరణి రేవంత్ రెడ్డిలో స్పష్టంగా కనపడుతున్నది.
ఎన్నికల వేళ ఎట్లనన్న జేసి గెలువాలని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్‌రెడ్డి అసుసరిస్తున్న విధానం బాగా లేదు. ఆయన హావభావాలు, ఆక్రోశం నుంచి వస్తున్న ప్రకటనలు, చేస్తున్న చేష్టలు, రేవంత్ ద్వేషపూరిత, హింసాయుత మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తుందో చెప్పకుండా సీఎం కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తుండటం విడ్డూరం. రేవంత్‌రెడ్డి ప్రతీకారేచ్ఛతో చేసిన ప్రసంగం తెలంగాణ ప్రజలను ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. జనం లేక వెల వెలబోతున్న కాంగ్రెస్ సభలే కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమని రుజువుచేస్తున్నాయి. దీంతో సహనం కోల్పో తూ వ్యవహరిస్తున్న రేవంత్ తీరు, అనుసరిస్తున్న పద్ధతు లు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. ఇంకా విషాదం ఏమంటే మీడియా ప్రతినిధులనూ దూషించడం లాంటి దిగజారుడు చేష్టలతో రేవంత్‌రెడ్డి తీరు సొంత పార్టీ నాయకులకే పెద్ద తలనొప్పిగా మారుతున్నది.
రేవంత్‌రెడ్డి వాడుతున్న బూతు పదజాలాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడే ఇంత ఆగంజేస్తున్న రేవంత్‌రెడ్డి పుసుక్కున గెలిస్తే గినా ఇంకెంత ఆగంజేస్తడోనని ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తున్నదని ప్రజలు వాపోతున్నారు. ఇటువంటి స్వార్థపూరిత నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలనే ఆలోచన ప్రజల్లో ముందుగానే మొదలవడం శుభ పరిణామం. తెలంగాణను ఆగం జేసిన కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నెలకో ముఖ్యమంత్రి చొప్పున కొట్లాటలే తప్ప రాష్ట్రంలో స్థిర ప్రభుత్వం ఉండదని ప్రజలకు స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీలో అయ్యే కొట్లాటలు, కుమ్ములాటలు రాష్ర్టాన్ని ఏ దరికి చేరుస్తాయోనని ప్రజలు ఇప్పటికే అయోమయంలో పడ్డారు.
ఏ మాత్రం సహనం, ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్న టీపీసీసీ అధ్యక్షుని వ్యవహారం తెలంగాణ సమాజానికి తెలియందేం కాదు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల మీదికి గన్నులెత్తి సమైక్యవాదుల మోచేతి నీళ్లు తాగిన దృశ్యాలను తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదు. కష్టపడి త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను తెర్లు చేయాలని కుట్రలు పన్నుతున్న ఈ విద్వేషపు నాయకులు ‘మాకు ఓటు వేయండి’ అంటే నమ్మేంత అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు. అరువై ఏండ్ల కింద వచ్చిన తెలంగాణను ఆంధ్రోళ్లకప్పజెప్పి వందలాది మంది ప్రాణాలను తీసింది కాంగ్రెస్. మలిదశ ఉద్యమంలో తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురై అనివార్య స్థితిలో తెలంగాణను ప్రకటించిక తప్పలేదు. ఇలాంటి పార్టీకి తెలంగాణ సమాజం ఎందుకు ఓటేస్తది? అట్లా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తరనుకోవడమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పెద్ద తప్పు.
‘ఒక్క చాన్స్ ఇద్దాం’లే అని ప్రాణాలు తీసే ప్రమాదానికి ఎవరైనా అవకాశం ఇస్తారా? ఇచ్చి తమ ప్రాణాలను తామే తీసుకుంటారా? ఉంటయి, అవును ఉంటయి. కుటుంబం అన్నంక మంచి, చెడు పంచాయితీలుంటయి. అలుగుళ్లు, గులుగుళ్లు ఉంటయి. ఇంట్ల ఉన్న మన నాయిన మీద అలుగమా, గులుగమా? మన ఇంటోళ్ల మీద గులుగకుంటే మంది మీద గులుగుతమా? గులిగితే వాళ్లు ఊకుంటరా? ఎంత గులిగినా, అలిగినా మోకా వచ్చినప్పుడు ఒక్కటైతం తప్ప బయటోనికి, మందికి అవకాశం ఇస్తమా? ఇప్పుడు కూడా అంతే…
తెలంగాణ రావడం కష్టమే అన్న సమయంలో రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్. వచ్చిన తెలంగాణను నిలబెట్టేందుకు ఆయన పడ్డ కష్టాలు తెలంగాణ సమాజానికి తెలియనివి కావు. వ్యవసాయం, విద్యుత్తు, సాగు, తాగునీరు, విద్య, వైద్యం ఇట్లా అన్ని రంగాల్లో తెలంగాణను బలోపేతం చేసిన మహోన్నత నాయకత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ది.
తనతో అవకాశవాదులు, పదవుల కోసం పార్టీలను కబ్జాచేసే దగాకోరులతో పోటీ ఏమిటో? ఒక్క ముక్కల చెప్పాలంటే ఇది తెలంగాణ సమాజానికే అవమానకరం. గులుగుడు, గులుగుడు వరకే. కేసీఆర్‌కు మద్దతిచ్చుడు మద్దతిచ్చుడే.. కేసీఆర్‌తో తెలంగాణ సమాజానిది పేగుబంధం. అందుకే ఆయనను మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటే తప్ప, తమకు సంపూర్ణ క్రాంతి సాధ్యం కాదని తెలంగాణ సమాజం బలంగా విశ్వసిస్తున్నది. సీఎంగా తిరిగి కేసీఆర్‌ను ఎన్నుకోవాలంటే గులుగుడు, గులుగుడే, గుద్దుడు గుద్దుడే. దేనిది దానికే.. ఇదీ ఇవ్వాళ తెలంగాణ సమాజం ఆలోచిస్తున్న ధోరణి. అందుకే కేసీఆర్ నాయకత్వంలో సమర్థవంతమైన నాయకత్వాన్ని, సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగిద్దాం.
సహస్ర