‘ఆర్డినెన్స్’ అంటేనే తాత్కాలికం. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు, కేంద్రంలో పార్లమెంట్లో సమావేశాలు జరుగుతున్న సమయంలో కాకుండా ఇతర సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకొని దాన్ని అమలుచేయవలసి వచ్చినప్పుడు ఆర్డినెన్స్ రూపంలో ఒక బిల్లును తీసుకువస్తారు. ఆ తర్వాత ఆ బిల్లును పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేసుకుంటారు. లేకపోతే ఆ ఆర్డినెన్స్ అక్కడికే రద్దవుతుంది. ఆ ఆర్డినెన్స్ అమల్లోకి రావాలంటే రాష్ట్రంలో గవర్నర్, కేంద్రంలో రాష్ట్రపతి ఆమోద ముద్ర తప్పనిసరి. అత్యవసర సందర్భాల కోసం రాజ్యాంగం కల్పించిన ఇలాంటి ఓ తాత్కాలిక వెసులుబాటుతో అత్యంత కీలకమైన బీసీ రిజర్వేషన్లకు ముడిపెట్టింది రేవంత్ సర్కార్. ఆర్డినెన్స్ తీసుకువచ్చి స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని చెప్తున్నది. ఇది మరోమారు బీసీలను మోసపుచ్చడమే.
నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రెండు వేర్వేరు బిల్లులను ఆమోదించి, వాటి ఆమోదం కోసం గవర్నర్‌కు పంపింది. అవింకా ఆయన దగ్గరే పెండింగ్‌లో ఉన్నాయి. మళ్లీ అదే తరహా బిల్లును ఆర్డినెన్స్ రూపంలో కాంగ్రెస్ తీసుకువస్తే అసలు గవర్నర్ ఆమోదిస్తారా అన్నది మొదటి ప్రశ్న.
ప్రస్తుతం దేశంలోని రాజకీయ పరిస్థితులను గమనించినట్టయితే బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, కేంద్రానికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. తమిళనాడులో ఆర్ఎన్ రవి, పశ్చిమబెంగాల్లో ఆనంద్ బోస్, కేరళలో ఆరిఫ్ ఖాన్… బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో అక్కడి ప్రభుత్వాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు రాజకీయ లబ్ధి చేకూర్చే బీసీ రిజర్వేషన్ బిల్లును గవర్నర్ ఆమోదిస్తారా?
ఆమోదించరని తెలిసే కాంగ్రెస్ ‘మేం బిల్లులను ఆమోదించి పంపాం, అంతా కేంద్రం చేతుల్లోనే ఉంది’ అని చేతులు దులిపేసుకొనే ప్రకటనలు చేసింది. అయితే, హైకోర్టు మూడు నెలల్లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో మళ్లీ ఆర్డినెన్స్ అంటూ హంగామా చేస్తున్నది. తాత్కాలికమైన ఆర్డినెన్స్ ద్వారా సుప్రీం తీర్పునకు విరుద్ధంగా కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లను ఎలా పెంచుతుందో వారికే తెలియాలి. రిజర్వేషన్లపై ఇందిరా సహానీ కేసులో సుప్రీం కోర్టు విధించిన 50 శాతం పరిమితి ఇక్కడ మరో అత్యంత కీలకమైన విషయం. ప్రస్తుతం తెలంగాణలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నా యి. బీసీలకు అటూఇటుగా 27 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రిజర్వేషన్ గణాంకాలు కొంత సంక్లిష్టంగా ఉన్నా సుప్రీం కోర్టు విధించిన పరిమితికి లోబడే అమలవుతున్నాయి. అయితే, కాంగ్రెస్ చెప్తున్నట్టు బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచితే రిజర్వేషన్లు 50 శాతం పరిధిని దాటిపోతాయి. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం.
తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇక్కడి బలహీన వర్గాలకు న్యాయం జరుగాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. పంచాయతీ ఎలక్షన్లలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చర్చ చేసి చట్టం కూడా తీసుకువచ్చారు. ఆ చట్టం ప్రకారం 34 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని, మొత్తం రిజర్వేషన్ 61.19 శాతం ఇవ్వాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ, దీనిపై సంగారెడ్డి జిల్లాకు చెందిన స్వప్న రెడ్డి అనే సర్పంచ్, గోపాల్‌రెడ్డి అని సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు (వీరిద్దరూ కాంగ్రెస్ నాయకులే) హైకోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్ 50 శాతం దాటవద్దని హైకోర్టు కొట్టేసింది. అయినా, బీసీల మీద ఉన్న కమిట్మెంట్తో కేసీఆర్ ‘గతంలో ఉన్నదే మాకు ఇవ్వండి’ అని సుప్రీం కోర్టుకు అప్పీల్‌కు వెళ్లారు.
ఇక కాంగ్రెస్ వాదించే మరో అంశం ఏమంటే… రాజ్యాంగంలోని 9వ షెడ్యూలు. ‘మేం చేసిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేరిస్తే చాలు. ఇక కోర్టు వాటిని ముట్టుకోదు. బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలి’ అంటూ నెపాన్ని పక్కకు నెడుతున్నది. కానీ, ఏ చట్టమైనా, అది 9వ షెడ్యూల్లో ఉన్నా, రాజ్యాంగ విరుద్ధమైనదని భావిస్తే న్యాయ సమీక్షకు వెళ్లాల్సిందే. 9వ షెడ్యూల్లో ఉన్న చట్టాలను కూడా సమీక్షించే అధికారం తమకు ఉన్నదని సుప్రీం కోర్టు 2007లో ‘ఐఆర్ కోయెలో వర్సెస్ తమిళనాడు’ కేసులో స్పష్టం చేసింది. అంటే, కాంగ్రెస్ చేస్తున్న వాదన అంతా బూటకమే.
గతంలో హైకోర్టు మొట్టికాయలు వేసిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ బూసాని వెంకటేశ్వర్రావు చైర్మన్‌గా బీసీ డెడికేటెడ్ కమిషన్ వేసింది. కానీ ఈ కమిషన్ బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై సర్వేను సమగ్రంగా నిర్వహించలేదు. దీనిపై సొంత పార్టీ నేతలు సైతం విమర్శలు గుప్పించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేయించాలి.
బీసీల్లోని ఏయే కులాలు విద్యాపరంగా, రాజకీయపరంగా వెనుకబడ్డాయో గుర్తించాలి. పూర్తి వివరాలతో సరైన నివేదిక రూపొందించాలి. ఆయా వర్గాలకు ఎంత మేర రిజర్వేషన్ ఇవ్వాలనేది స్పష్టం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆయా కులాలు ఏ విధంగా లబ్ధి పొందుతాయో కోర్టు ముందుంచాలి. రాష్ట్రంలో బీసీ జనాభా సగం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వారు అత్యంత అసాధారణ స్థితిలో వెనుకబడి ఉన్నారని, వారికి మేలు చేయాలంటే 50 శాతం రిజర్వేషన్ పరిమితిని దాటి రిజర్వేషన్లను కల్పించాలని కోరాలి. అందుకు అనుకూలమైన డాటాను సమర్పించాలి.
పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీ రిజర్వేషన్లను పెంచుతామంటున్నది. తర్వాత మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. అప్పుడు మున్సిపల్ చట్టాన్ని సవరించాలి. అంతేకాదు, కీలకమైన ఉద్యోగ నోటిఫికేషన్లలో రిజర్వేషన్లపై ఉండే దృష్టి ఎంతటిదో తెలియంది కాదు. కాబట్టి ఈ అంశంపై ఎవ్వరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితుల్లో సుప్రీం సూచించిన విధంగా అధ్యయనం చేయకుండా, నివేదికలు సమర్పించకుండా రిజర్వేషన్లను గంపగుత్తగా 42 శాతానికి పెంచుతామంటే అది ఫలితాన్నివ్వదు.
దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఏండ్ల తరబడి బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయి. అటు రాహుల్ గాంధీ, ఇటు ప్రధాని మోదీ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటున్నారు. మరి ఎవరు అడ్డుకుంటున్నారో బీసీ సమాజం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఏదేమైనా ఈ రెండు జాతీయ పార్టీలు బీసీలకు వ్యతిరేకమని స్పష్టంగా తెలుస్తున్నది. కాబట్టి, బీసీలు మరో పోరాటానికి నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
గోసుల శ్రీనివాస్ యాదవ్ 98498 16817