సమాజం సంస్కరించబడాలన్నా, సమసమాజ స్థాపన జరుగాలన్నా, సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజలు అభ్యున్నతి సాధించాలన్నా ఒక్క విద్యతోనే సాధ్యం. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూజారి లేని గుడిలా, పంతులు లేని బడిలా తయారైంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య లభించక, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు కట్టలేక అనేక మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఒక్కో రంగాన్ని సంస్కరిస్తూ విద్యారంగంలో సమూల మార్పుల కోసం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విప్లవాత్మక అడుగులు వేసింది.
వేయి గురుకులాలు, మోడల్ స్కూళ్లు కట్టించి కొత్త ప్రయత్నం చేసింది. మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యా నిధి, ముఖ్యమంత్రి విదేశీ స్కాలర్షిప్ పథకం, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పేరుతో విదేశీ విద్యను అభ్యసించాలన్న ఎందరో పేద, మధ్యతరగతి విద్యార్థుల కలను సాకారం చేసింది. అలాగే అందరికీ కలలాంటి మెడికల్ విద్యను చేరువ చెయ్యడానికి జిల్లాకో మెడికల్ కాలేజీని నిర్మించింది. కానీ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఎందరో విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో మొదటి దఫా ఓవర్సీస్ స్కాలర్షిప్ పొందిన విద్యార్థులకు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడత చెల్లించకపోవడంతో అర్ధాంతరంగా చదువులు ఆపేసి సొంతగడ్డకు తిరిగొస్తున్నారు.
గురుకులాల్లో కలుషిత ఆహారం, ఒత్తిడి ఇతర కారణాల వల్ల ఇప్పటికే వందకుపైగా చిన్నారులు మరణించారు. రెండేండ్ల రేవంత్ పాలనలో వెయ్యికి పైగా డిగ్రీ కాలేజీలు, రెండు వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ పూర్తిగా కనుమరుగైంది. ఇదీ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనత. సీఎం రేవంత్ గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏడాదికోసారి చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నెల నెలా చెల్లిస్తామన్నారు. కానీ, ఆ మాటలు నీటిమూటలయ్యాయి. ఆ నిర్ణయంపై ఇప్పటివరకు కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలో పేరుగాంచిన కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ వంటి విశ్వవిద్యాలయాలు సైతం సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నామని ప్రకటించి ఇప్పటికి ఐదు సార్లు వరుసగా పరీక్షలు వాయిదా వేశాయి. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా?
స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా సకాలంలో స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల ఇంటర్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ లేదా బీటెక్‌లో చేరాలన్నా, డిగ్రీ పూర్తయి పీజీలో చేరాలన్నా, ఇంకేదైనా పై చదువులు చదువాలన్నా తమ సొంత డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోవలసిన దుస్థితి దాపురించింది. ఆఖరికి ప్రభుత్వ కళాశాలలు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ జమ కాకపోవటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇలా అనేక సమస్యల వల్ల ఏకంగా ఒక జనరేషన్ విద్యార్థులు మొత్తం ఆగమయ్యే పరిస్థితి దాపురించింది. దేశ నిర్మాణానికి ఎంతో కీలకమైన విద్యారంగాన్ని ఇంతగా నిర్లక్ష్యం చేయడం అత్యంత దారుణం. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)
ఏనుగుల రాకేష్ రెడ్డి