ఉమ్మడి ఏపీలో దశాబ్దాల పాటు నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ రైతులు నిరుత్సాహానికి గురయ్యారు. అస్థిర వర్షాలు, నిరంతర కరువులతో పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు. అట్లాంటి కష్టకాలంలో చెక్‌డ్యాంలు వారిలో కొత్త ఆశలు కలిగించాయి. కాలక్రమంలో చెక్‌డ్యాంలు సాగునీటి భద్రతకు మూలస్తంభాలుగా నిలిచాయి. అవి అన్నదాతలను నిరాశ, నిస్పృహల నుంచి ఆశాభరిత జీవితం వైపు నడిపించాయి. వాగులు, నదులపై కాంక్రీట్, మట్టి, రాళ్లతో తక్కువ వ్యయంతో కట్టిన అడ్డుగోడలే చెక్‌డ్యాంలు. ఇవి వర్షపు నీటిని నిల్వ చేసేందుకు బాగా ఉపయోగపడతాయి. ఇవి నీటి ప్రవాహాన్ని తగ్గిస్తాయి. మట్టి కోతకు గురికాకుండా అరికడతాయి. భూమిలోకి నీరు ఇంకేలా చేసి భూగర్భజలాలు పెరిగేందుకు దోహదపడతాయి. కరువు పీడిత ప్రాంతాల్లో వర్షపు నీటి సేకరణకు ఇవి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉత్తమ పరిష్కార మార్గాలు.
వర్షాభావ ప్రాంతాల్లో భూగర్భ జలాల రీచార్జిలో చెక్‌డ్యాంలు కీలకపాత్ర పోషిస్తాయని అంతర్జాతీయ నీటి నిర్వహణ సంస్థ (ఐడబ్ల్యూఎంఐ) పేర్కొన్నది. ఇవి ఉపరితల నీటి ప్రవాహాలను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుతాయని, నీటి భద్రతను మెరుగుపరుస్తాయని, వాతావరణ మార్పులను నిరోధిస్తాయని ఈ సంస్థ విస్తృత అధ్యయనంలో నిరూపితమైంది. చెక్‌డ్యాంల నిర్మాణ ఫలితంగా వ్యవసాయ దిగుబడులూ పెరిగాయని ఈ సంస్థ నొక్కిచెప్పింది.
ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు (ఎఫ్ఏవో, యూఎన్డీపీ, యూఎన్ఈపీ) చెక్‌డ్యాంల నిర్మాణానికి మద్దతిస్తున్నాయి. ఎఫ్ఏవో తన వాటర్‌షెడ్ మార్గదర్శకాల్లో చెక్‌డ్యాంలను చేర్చింది. కరువు నివారణ ప్రాజెక్టుల్లో భాగంగా చెక్‌డ్యాంల నిర్మాణానికి యూఎన్డీపీ నిధులను సమకూర్చింది. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని (ఎస్డీజీ-6: శుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం) సాధించేందుకు తక్కువ ఖర్చుతో కూడిన, వికేంద్రీకృత పరిష్కారాలుగా చెక్‌డ్యాంలను ఐరాస గుర్తించింది.
భారతదేశంలో చెక్‌డ్యాంల నిర్మాణాలకు సంబంధించి చారిత్రక మూలాలున్నాయి. ఇవి పూర్తిగా కొత్త నిర్మాణాలేమీ కావు. శతాబ్దాల నుంచి నీటిసంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. సింధు లోయ నాగరికత కాలంలోనే ధోలవీర, హరప్పా ప్రాంతాల్లో చిన్న డ్యాంలు, చిన్నచిన్న కట్టల (bunds) నిర్మాణాల ఉన్నట్టు ఆధారాలు లభించాయి. క్రీ.శ. 2వ శతాబ్దంలో చోళ రాజు కరికాలుడు తమిళనాడులోని కావేరి నదిపై కట్టించిన కల్లనై డ్యాం అత్యంత ప్రసిద్ధమైన, పురాతనమైన చెక్‌డ్యాంగా చెప్పవచ్చు. ఇది ఇప్పటికీ వినియోగంలో ఉండి, సాగునీటి అవసరాలను తీరుస్తున్నది. అంతేకాదు, ప్రపంచంలో ఇంకా వాడుకలో ఉన్న అతి పురాతన సాగునీటి ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి కావడం విశేషం.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1960లలో చెక్‌డ్యాంల నిర్మాణాలు మొదలయ్యాయి. కరువు ప్రాంతాల అభివృద్ధి (డీపీఏపీ) వంటి కార్యక్రమాలు కరువు ప్రభావిత ప్రాంతాల్లో భూగర్భ జలాల రీచార్జికి ఎంతగానో దోహదపడ్డాయి. 1980-90లలో రాజస్థాన్, గుజరాత్లో ఎన్జీవోలు, పలు సంస్థల ప్రభావంతో వీటి నిర్మాణాలు ఊపందుకున్నాయి. రైతులను కరువు నుంచి కాపాడుతున్న చెక్‌డ్యాంలు ఇప్పుడు తెలంగాణకు అత్యంత అవసరం. ఇవి అన్నదాతలకు జీవనాధారం కల్పించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడతాయి.
తెలంగాణ ఏర్పడకముందు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఆంధ్ర, రాయలసీమల ప్రాంతాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దాంతో తెలంగాణలోని గోదావరి బెల్ట్ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఆంధ్ర ప్రాంతానికి పెద్దపీట వేయడం, తెలంగాణ సాగునీటి అవసరాలను గాలికొదిలేయడంతో తెలంగాణ రైతులు వర్షపునీటిపై, భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నాటి వలస ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో గత ఆరు దశాబ్దాలుగా అనేక చెరువులు పూడిపోయాయి. దాంతో 1960లో 48 శాతంగా ఉన్న సాగు భూమి 1998 నాటికి 11 శాతానికి పడిపోయింది. బోరుబావులు ఎండిపోవడం, పంటలు నష్టపోవడం, అప్పుల భారం పెరగడం – లాంటివన్నీ కలగలిసి వేలాది మంది తెలంగాణ రైతులను ఆత్మహత్యలకు పురికొల్పాయి. తెలంగాణ వ్యవసాయంపై చూపిన ఈ వివక్ష ప్రాంతీయ అసమానతలను మరింత పెంచి, స్వరాష్ట్ర ఉద్యమానికి ఒక కారణమైంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సాగునీటిరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ‘ప్రతి ఎకరానికి నీరు’ అన్న నినాదంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సాగునీటిరంగాన్ని ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నారు. విప్లవాత్మక ఆలోచనలతో సాగునీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలకు అంకురార్పణ చేశారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 46 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని నిర్మించారు. 2022 నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,250 చెక్‌డ్యాంలు నిర్మించింది. ఈ నిర్మాణాలు రెండు దశల్లో జరిగాయి. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మానేరు నది, మూలవాగు వెంబడి 24 చెక్‌డ్యాంలు కట్టారు. తత్ఫలితంగా ఒకప్పుడు కరువుకు చిరునామాగా ఉన్న తెలంగాణ పల్లెలు ఇప్పుడు ధాన్యాగారాలుగా మారాయి.
నదులు, వాగులకు ఇరువైపులా సాగు చేసుకునే చిన్న, సన్నకారు రైతుల జీవితాల్లో చెక్‌డ్యాంలు వెలుగులు నింపాయి. వర్షపు నీటికి అడ్డుకట్టవేసి నదులు, వాగులపై చిన్నపాటి జలాశయాలను సృష్టించడంతో ఏడాది పొడవునా సాగునీళ్లు అందుబాటులోకి వచ్చాయి. మోటర్ల సాయంతో ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు సాధ్యమైంది. భూగర్భ జలాలు 5-10 అడుగులు పెరిగి బావులు మళ్లీ నిండాయి. పంట దిగుబడి స్థిరంగా ఉండి, సాగు ఖర్చులు తగ్గి రైతుల ఆదాయం పెరిగింది. చేపల పెంపకం అదనపు ఆదాయంగా మారింది. చెక్‌డ్యాంల నిర్మాణ ఫలితంగా ఒకప్పటి బీడు భూములు వరి పొలాలుగా మారాయి. ఫలితంగా సాగు భూమి 284 శాతం పెరిగి 90 లక్షల ఎకరాలకు చేరుకున్నది. దాంతో ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానానికి చేరుకున్నది. రాష్ట్రం నుంచి కరువు పరారైంది. వలసలు పూర్తిగా తగ్గిపోయాయి. రైతుల ఆదాయం పెరిగి భవిష్యత్తుపై వారికి భరోసా ఏర్పడింది.
కానీ, తెలంగాణ రైతులు ఎన్నడూ ఊహించని భయానక ఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. రెండేండ్ల క్రితం మేడిగడ్డ ఘటన జరిగితే, గత 30 రోజుల్లోనే రెండు పెద్ద పర్యావరణ విధ్వంసాలు జరిగాయి. మానేరు నదిపై నిర్మించిన రెండు చెక్‌డ్యాంలలో ఈ ఏడాది నవంబర్ 21న గుంపుల-తనుగుల వద్ద, డిసెంబర్ 17న అడవి సోమనపల్లి వద్ద చెక్ డ్యాంలు కూలిపోయిన ఘటనలు జరిగాయి. వీటిపై
అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
నిర్మాణ లోపాల వల్లే చెక్‌డ్యాంలు కూలిపోయాయని కొందరు చెప్తున్నారు. కానీ, ఈ వాదన క్షేత్రస్థాయి పరిస్థితులకు విరుద్ధంగా ఉందనిపిస్తున్నది. ఎందుకంటే నీటిని నిల్వ చేయడానికి కట్టిన ఏ నిర్మాణంలోనైనా లోపాలుంటే, నీరు లీక్ అవుతుందే కానీ నిల్వ ఉండదు. ఉదాహరణకు, తనుగుల-గుంపుల దగ్గర మూడు చెక్ డ్యాంలు నిర్మించారు. ధ్వంసమైన చెక్‌డ్యాం ఎగువ భాగంలో మరో చెక్‌డ్యాం ఉంది. అందులో నీరు నిండుగా ఉంది. కానీ, దిగువ భాగంలోని మరో చెక్‌డ్యాంలో నిర్మాణ లోపాల వల్ల నీరు ఎప్పుడూ నిల్వ ఉండదని రైతులు చెప్పారు. మధ్యలో ఉన్న తనుగుల-గుంపుల చెక్‌డ్యాంలో అటువంటి సమస్యలు లేవు. ఈ ఏడాది వర్షాలు తగ్గుముఖం పట్టాక నవంబర్ దాకా కూడా ఈ చెక్‌డ్యాంలో పుష్కలంగా నీటి నిల్వ ఉంది. అందుకే రైతులు వందల మీటర్ల పొడవునా పైప్లైన్లు వేసుకొని వరి సాగు చేశారు. ఒకవేళ నిర్మాణ లోపాలుంటే రైతులు అంత మొత్తం ఖర్చు పెట్టి పైప్లైన్లు వేసుకునేవారు కాదు. అంతేకాదు, వాగు రెండు వైపులా దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా పంటలు పండేవి కావు.
మన దేశంలో పర్యావరణ చట్టాలు ఎంత కఠినంగా అమలవుతున్నాయో అందరికీ తెలుసు. ఒక్క చెట్టును నరికినా జైలు శిక్ష విధిస్తారు. అలాంటప్పుడు చెక్‌డ్యాంలను కూలకొట్టడం ఎంత పెద్ద నేరమో స్పష్టంగా అర్థమవుతున్నది. చెట్ల నరికివేతను అడ్డుకుని సుమోటో ఆదేశాలు జారీచేసే వ్యవస్థలు ఈ ఘటనలపై ఇప్పుడు మౌనం వహిస్తే ఇ లాంటి దాడులు మరిన్ని జరిగే ప్రమాదమున్నది. ఇంజినీర్లు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం వల్ల ఈ దుశ్చర్యల వెనుక బలమైన అసాంఘిక శక్తులు ఉన్నట్టు స్పష్టమవుతున్నది. తమంతట తాముగా బృందాలు ఏ ర్పాటు చేసుకొని గస్తీ తిరగాల్సిన పరిస్థితి వస్తుందేమోనని రైతులు ఇప్పుడు ఆందోళన పడుతున్నారు.
ఇన్నాళ్లూ మానేరు వాగు నీళ్లు వృథాగా సముద్రంలో కలిసిపోయేవి. కానీ, చెక్‌డ్యాంల నిర్మాణం తర్వాత వందల ఎకరాలు సాగులోకి వచ్చాయి. దశాబ్దాల కరువు మాయమైంది. రైతుల ఆర్థిక సమస్యలు తగ్గిపోయాయి. చెక్‌డ్యాంల మూలంగానే వ్యవసాయం బాగుపడిందని రైతులు భావిస్తున్నారు. వాస్తవానికి ఆ నిర్మాణాల వల్లనే వారు పంటలు పండించి ఆర్థిక స్థిరత్వం సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవ్వరి ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులపై చర్య తీసుకోవాలి. నీటి-పర్యావరణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి. ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించకపోతే నదులు ఎండిపోతాయి. పొలాలు మళ్లీ బీడువారుతాయి. రైతుల ఆశలు అడుగంటిపోతాయి. అందుకే రైతుల కోసం మనందరం నిలబడదాం… చెక్‌డ్యాంలను కాపాడుకుందాం!
– (వ్యాసకర్త: ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం)
చంద్రి రాఘవరెడ్డి