ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాంతం పీపుల్స్‌వార్ (మావోయిస్టులు)కు అడ్డాగా ఉండేది. ‘ఇందుప్రియాల గెరిల్లాదళం’ అంటే అప్పటి మెదక్ జిల్లానే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఒక సంచలనం. సాయంత్రం ఆరు దాటితే చాలు మనుషులు ఇంటినుంచి బయటకు రావడానికే జంకేవారు. ఎన్కౌంటర్లు, ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలు, అరెస్టులు ఇలా ప్రతిక్షణం భయం భయంగా గడిచేది. ఓ వైపు మావోయిస్టుల తుపాకీ నీడ, మరోవైపు పోలీసుల బూట్ల చప్పుడు… ఇవి నాకు ఊహ తెలిసినప్పటి పరిస్థితులు. అలాంటి భయంకర పరిస్థితుల మధ్య ఉన్నత చదువుల కోసం మా పక్కనే ఉన్న గజ్వేల్‌కు వచ్చి స్థిరపడ్డాం. నాటి పరిస్థితులతో ఇప్పుడున్న పరిస్థితులను పోల్చిచూస్తే నమ్మశక్యంగా లేదు.
ఉమ్మడి రాష్ట్రంలో అంతంత మాత్రంగా ఉన్న మా ప్రాంత పరిస్థితులు తెలంగాణ వచ్చాక పూర్తిగా మారాయి. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడంతో అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతున్నది. కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా మా సిద్దిపేట జిల్లా అందునా మా గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తుండటం ఇక్కడి ప్రజల అదృష్టంగా చెప్పాలి. 60 ఏండ్ల తెలంగాణ కలను నిజం చేసిన మహా నాయకుడు మా ప్రాంత ఎమ్మెల్యే అంటే మా కన్నా అదృష్టవంతులు ఎవరుంటారు. తెలంగాణ స్వరాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో అపూర్వ విజయంతో కేసీఆర్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన క్షణం యావత్ రాష్ట్రంతో పాటు గజ్వేల్ మురిసిపోయింది. స్వయాన సీఎం కేసీఆర్ తన సొంత గజ్వేల్ నియోజకవర్గం పైనా ప్రత్యేక దృష్టిపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తొలి దశలోనే గజ్వేల్‌లో ఊహించని అభివృద్ది జరిగింది. గజ్వేల్ అభివృద్ధి నమూనానే రాష్ట్ర అభివృద్ధికి గీటురాయిగా మారింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో రవా ణాశాఖ మంత్రిగా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గజ్వేల్‌కు తర చూ వస్తుండేవారు. అప్పటినుంచే కేసీఆర్‌కు గజ్వేల్పైనా ప్రత్యేక దృష్టి ఉండేది. గజ్వేల్ అప్పటికే కొంత వాణిజ్యపరంగా అభివృద్ధి సాధించిం ది. దాన్ని మరింత మెరుగుపరచాలని అనుకున్నదే తడవుగా గజ్వేల్ -హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రారంభించారు. అంటే కేసీఆర్‌కు నాటినుంచే గజ్వేల్ మీద ప్రత్యేక ప్రేమ ఉండేదని తెలుస్తున్నది. ఆ ప్రేమే తెలంగాణ ఆవిర్భావం తర్వాత గజ్వేల్ నుంచి ప్రాతినిథ్యం వహించేలా చేసింది. అదే మా గజ్వేల్ ప్రజల తలరాతను మార్చింది.
నెలలో ఒకసారి అదీ సెలవురోజున గజ్వేల్ వెళ్లివచ్చినప్పుడల్లా ప్రతిసారి ఏదో కొంగొత్త అనుభూతి. నేను చిన్నప్పుడు చూసిన గజ్వేలేనా అని అనిపిస్తుంటుంది. విశాలమైన రోడ్లు, అత్యాధునిక ప్రభుత్వాసుపత్రి, వెజిటేబుల్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆఫీసులు, ఇలా ఒకటా రెండా ఎంతచెప్పినా తక్కువే. ఒకరోజు అప్పటి డిగ్రీకాలేజ్… ఇప్పటి ప్రభుత్వాసుపత్రి ముందు ఉద్యమ సమయంలో చేసిన దీక్షలు గుర్తుచేసుకుంటే.. ఆ దీక్షా ఫలితం ఎంత ఉందో కండ్ల ముందే కనిపిస్తున్నది.
ఉద్యమ పంథా అయినా, అభివృద్ధి ప్రణాళిక అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతమైన ఆలోచనల నుంచి పుట్టినవే. దార్శనికుడి ఆలోచనలే అనంతం. ఆయన ఆచరణ మహాద్భుతం. తన ఆలోచనలకు అనుగుణంగా ప్రతిదీ జరుగుతుండటం ఆయన సంకల్పానికి నిదర్శనం. కలలు అందరూ కంటారు కానీ వాటిని నెరవేర్చే సత్తా కొందరికే ఉంటుంది. ఆ కోవకు చెందినవారే సీఎం కేసీఆర్. ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పాటు కాబోతున్నదని, రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి ఎలా ఉండాలనేది అప్పటికే కేసీఆర్ నిర్ణయించారు. దాని ఫలితమే నేటి అభివృద్ధి కార్యక్రమాలు.
‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్నిరంగాల్లో వెనుకకు నెట్టివేయబడింది. వనరులున్నా కుట్రపూరితంగా నిర్లక్ష్యానికి గురైంద’ని సీఎం కేసీఆర్ పదేపదే చెప్పేవారు. తెలంగాణ ఏర్పాటయ్యాక కేవలం రెండు రాష్ర్టాల మధ్య భౌగోళిక విభజన మాత్రమే జరిగింది. కానీ నాడు సాధ్యం కానీ అనేక పనులు ఇప్పుడు కార్యరూపం దాల్చుతున్నాయి. నాడు అన్నదాతల ఆత్మహత్యలకు తెలంగాణ చిరునామాగా ఉండేది. ఇప్పుడు అదే తెలంగాణ అన్నపూర్ణగా మారింది. తెలంగాణ… కోటి ఎకరాల మాగాణిగా మారింది. దానికి కారణమేంటి? కేవలం నాయకుడి సంకల్పం, చిత్తశుద్ధి. కేసీఆర్ రైతుబంధుతో తెలంగాణను రైతు రాజ్యం చేశారు. కాళేశ్వరంతో కోటి ఎకరాల మాగాణిగా మార్చారు. 24 గంటల కరెంట్‌తో తెలంగాణలో నిత్య వెలుగులు విరజిమ్ముతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు ఇస్తున్నారు. మరోవైపు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే లక్ష వరకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టారు.
తెలంగాణ పథకాలు ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. రైతుబంధు, మిషన్ భగీరథ, దళితబంధు ఇలా అనేక పథకాలు కేంద్రంతో సహా ఇతర రాష్ర్టాల్లో అమలవుతున్నాయి. ఇప్పుడు ఇదే తెలంగాణ అభివృద్ధి నమూనా యావత్ దేశం కోరుకుంటున్నది. దేశంలో ఏ రాష్ర్టానికి వెళ్లినా తెలంగాణ సంక్షేమ పథకాల గురించే చర్చ జరుగుతున్నది. దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణది ప్రత్యేక స్థానమంటూ అన్ని రాష్ర్టాల వారు కితాబు ఇస్తున్నారు. సంకల్పం ఉంటే సాధ్యం కానిదేదీ లేదని సీఎం కేసీఆర్ నిరూపించారు. నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యమమైనా, అభివృద్ధి అయినా అనుకున్నది సాధించవచ్చని కేసీఆర్ నిరూపించారు. తెలంగాణ ఉద్యమ తరహాలో మరో మహోత్తమ పోరాటానికి మన సీఎం కేసీఆర్ సంకల్పించారు. బంగారు భారతావని కోసం నడుం బిగిస్తున్నారు. కేసీఆర్ ఏదీ తలపెట్టిన దానికి తిరుగుండదు. ‘సార్ మాటే మా మాట. సార్ బాటే మా బాట’ అంటున్నది యావత్ తెలంగాణ. దేశం బాగు కోసం చేసే ధర్మ పోరాటానికి యావత్ తెలంగాణ అంతా సార్ వెంటే.
-ఐ రాధాకృష్ణ