వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చుకునే వ్యవహారంలో న్యాయపరమైన ఆటంకం ఎదురైంది. వీఆర్ఏ వ్యవస్థ సమాజానికి చేసిన సేవ గురించి, త్యాగం గురించి నేటికాలంలో చాలామందికి తెలియకపోవచ్చు. దేశ స్వాతంత్య్రానంతరం సమాజాన్ని పట్టిపీడించే చట్టాలు, వ్యవస్థలు రద్దు చేయబడ్డాయి.
పేద ప్రజలపై అజమాయిషీ చేసే పటేల్, పట్వారీ వ్యవస్థలు కూడా రద్దు చేయబడ్డాయి. కానీ చాకిరి చేసేనాటి వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయలేదు కదా ఇంకా బానిస సంకెళ్లను బలంగా వేశారు. వీఆర్ఏ వ్యవస్థలో అధికంగా అట్టడుగు వర్గానికి చెందిన పేదవారు ఉండటమే కారణం. వీఆర్ఏ వ్యవస్థ రద్దయితే చాకిరి వ్యవస్థ రద్దయినట్టే. అయితే ప్రస్తుతం రద్దు ప్రక్రియకు అడ్డంకి ఎదురైంది.
తెలంగాణ ఏర్పాటుతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకోవడంతో వీఆర్ఏల బానిస సంకెళ్లను తెంచేందుకు నడుం బిగించారు. వీఆర్ఏల ఆత్మగౌరవానికి బాటలు వేశారు. పస్తులుండే వీఆర్ఏలకు రెండుపూటలా పట్టెడు మెతుకులు పెట్టేవిధంగా వేతనాలను పెంచి వీఆర్ఏ కుటుంబాల్లో ఆకలి కేకలను ఆపారు. వీఆర్ఏల సాధకబాధకాలు తెలిసిన సీఎం కేసీఆర్ వీఆర్ఏలను క్రమబద్ధీకరణ, సర్దుబాటు చేస్తూ వెట్టిచాకిరి వ్యవస్థకు స్వస్తి పలికి ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని ప్రసాదించారు. ఇది కలిగించిన సంతోషం ఎంతో కాలం నిలువ లేదు.
వీఆర్లకు లాస్ట్‌గ్రేడ్ స్థాయి నుంచి జూనియర్ అసిస్టెంట్ స్థాయి కల్పించడం వెనుక వీఆర్ఏల న్యాయమైన సుదీర్ఘపోరాటం, త్యాగం దాగి ఉన్నది. గ్రామాల్లో నాయకుల ఇండ్ల వద్ద, కొంతమంది అధికారుల ఇండ్ల వద్ద వ్యక్తిగత సేవలందించారు. గ్రామాల్లో న్యాయవిజ్ఞాన సదస్సులు జరిగిన సమయంతో సంబంధం లేకుండా కుర్చీలు వేయడంతో మొదలు భోజనాలు వడ్డించడం, పాత్రలను కడగడం వరకు వీఆర్ఏలు మాత్రమే చేసేవారు. సమగ్ర సర్వే, భూ ప్రక్షాళనలు విజయవంతం కావడంలో వీఆర్ఏలు కీలక పాత్ర పోషించారు. ఇక నా విషయానికి వస్తే నిండు గర్భిణీగా ఉండి వేళాపాళా లేకుండా పనిచేశాను. పని ఒత్తిడితో సమయానికి దవాఖానకు వెళ్లలేకపోవడంతో డెలివరీ సమస్య ఎదురై నేను కడుపులో పాపను కోల్పోయాను. దీంతోపాటు మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురైంది. దవాఖాన ఖర్చులు కట్టేందుకు మా ఆస్తులను అమ్ముకొని రోడ్డుపాలయ్యాం. వీఆర్ఏలకు సమయపాలనతో పాటు, ప్రసూతి సెలవులు, హెల్త్‌కార్డులు ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వందల ఏండ్ల నుంచి బానిసత్వంతో కూడిన వ్యవస్థలో పనిచేస్తున్న వీఆర్ఏలకు మేలు జరుగుతుంటే కొందరు అడ్డుపడటం భావ్యం కాదు.
న్యాయవ్యవస్థకు మా ఆవేదన ఎలా తెలియజేయాలో అర్థంగాక ఈ వ్యాసం రూపంలో విన్నవిస్తున్నాను. వందల సంవత్సరాల నుంచి వివిధ పేర్లతో వెట్టిచాకిరి చేస్తున్న మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాను.
(వ్యాసకర్త: జూనియర్ అసిస్టెంట్)
రాధ
85199 91515