గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో రోడ్లు వేసేందుకు, విస్తరించేందుకు ఆస్తులు కోల్పోయినవారికి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది. ప్రజాప్రయోజనాల కోసం భూములు కోల్పోవడం తప్పదు. కానీ, రక్షణ శాఖ మొండివైఖరి వల్ల రోడ్ల విస్తరణకు ఆటంకం ఏర్పడుతున్నది. హైదరాబాద్‌లోని రక్షణ శాఖ భూముల వల్ల కరీంనగర్- నిజామాబాద్‌వైపు వెళ్లే రోడ్ల విస్తరణకు అంతరాయం కలుగుతున్నది. తద్వారా ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రక్షణ శాఖ భూములను మిలటరీ అవసరాల కోసం ఉపయోగించడం మంచిదే. కానీ, ప్రజా అవసరాల రీత్యా రక్షణ శాఖ భూములు కేటాయించడంలోనూ తప్పులేదు. సాధారణ రాకపోకలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం కోసం వెళ్తున్నవారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ నుంచి పన్నులు వసూలు చేస్తూ.. మన నిధులు మనకు ఇచ్చి ఏదో ఘనకార్యం చేసినట్టు బీజేపీ నేతలు గప్పాలు కొడుతుంటారు. తామేదో తెలంగాణకు మేలు చేసినట్టు చెప్పే ఆ పార్టీ నేతలు రోడ్డు విస్తరణకు అవసరమైన భూముల కేటాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. వీరికి తెలంగాణలో అధికార యావ తప్ప మౌలిక వసతుల కల్పనలో శ్రద్ధ లేదనే విషయం దీన్నిబట్టి అర్థం అవుతున్నది.
పార్టీలు, ప్రభుత్వాలు ఏవైనా ప్రజల కోసం ఉపయోగపడాలి. హైదరాబాద్‌లోని రక్షణ శాఖ భూములు ఖాళీగానే ఉన్నాయి. ఉదాహరణకు మిల్ట్రీ డైరీ ఫామ్‌కు చెందిన భూమిలో కొంతభాగాన్ని రోడ్డు విస్తరణకు కేటాయించాలి. ప్రస్తుతం ఈ మార్గం అత్యంత ఇరుకుగా ఉన్నది. ఈ రోడ్డు నిజామాబాద్, కరీంనగర్ వెళ్లే రహదారులకు అనుసంధానంగా ఉన్నది. దీన్ని విస్తరించడం వల్ల నగరం లోపలికి వాహనాలు వెళ్లకుండా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జేబీఎస్ నుంచి శామీర్‌పేట, ప్యారడైజ్ నుంచి కొంపల్లికి వెళ్లే మార్గాలు చాలా ఇరుకుగా ఉన్నాయి. ఈ మార్గాలలో ప్రత్యామ్నాయాలు కూడా లేవు. ఈ రోడ్ల విస్తరణకు తోడ్పడవలసిందిగా నగర ప్రజలతో పాటు కరీంనగర్, నిజామాబాద్ ప్రాంత వాసులు రక్షణ శాఖను కోరుతున్నారు.
-దండంరాజు రాంచందర్ రావు
98495 92958