దావోస్‌లో ఏటా ఆర్థిక సదస్సు జరుగుతుంది. గతవారం ముగిసిన 2026 సదస్సుకు భారత్ నుండి ఇదివరకు ఎన్నడూ లేనంత పెద్ద ప్రతినిధివర్గం వెళ్లింది. విస్తరిస్తున్న భారత ఆర్థికరంగ ఆకాంక్షల దృష్ట్యా ఇది ఆహ్వానించదగ్గ విషయమే. కానీ ఈసారి మనవాళ్ల దావోస్ పర్యటనలు తీవ్ర విమర్శలపాలు కావడం గమనార్హం. ప్రపంచ దేశాల అధినేతలు తమ ప్రసంగాలతో వేడిపుట్టించడం మాట అటుంచితే మనదేశానికి ఒరిగిన వాణిజ్య ప్రయోజనాలపై పెద్దఎత్తున సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అది ప్రపంచ సదస్సా, ఇండియా సదస్సా? అనే విమర్శలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎందుకంటే భారతీయ కంపెనీలు, ఇక్కడి సీఎంలే అక్కడ కలుసుకుని మంతనాలు జరుపుతున్నారు. ఎంవోయూలు, పెట్టుబడులు ప్రకటిస్తున్నారు. ఈసారి ఏడుగురు సీఎంలు వెళ్లారు. భారీగా ప్రజాధనం ఖర్చు చేసి తమ వెంట పెద్దపెద్ద ప్రతినిధి వర్గాలను తీసుకువెళ్లారు. విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వెళ్తే ఓ అర్థముంది. కానీ భారతీయ కంపెనీలతో అక్కడ మంతనాలేమిటి? ఒప్పందాలు ఏమిటి?
ఒప్పందాల పేరిట వల్లించే భారీ సంఖ్యలు నమ్మదగినవిగా లేకపోవడం మరో సమస్య. ఒక్కో సమావేశం ముగిసిన వెంటనే చర్చలు ఫలవంతంగా జరిగాయి, చాలా ముందుకు పోయాయి వంటి కార్పొరేట్ రొడ్డకొట్టుడు ప్రకటనలు వెలువడ్డాయి. తీరా చూస్తే ఒప్పందాల్లో అత్యధికం భారతీయ కంపెనీలతోనే అని తేలింది. ఇదంతా చూస్తుంటే ఆ మాత్రం దానికి ఆరువేల కిలోమీటర్ల దూరం వెళ్లాలా అనిపించక మానదు. స్విస్ మంచుకొండల్లోని విడిది కేంద్రమైన దావోస్ పర్యటన ఓ విహారయాత్రలా, స్టేటస్ సింబల్‌లా మారిపోయిందని కొందరు చురకలు వేస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దావోస్‌కు వెళ్లీవెళ్లగానే జరిపిన మొదటి సమావేశం తర్వాత రూ.14.5 లక్షల కోట్ల ఒప్పందాలు కుదిరినట్టు ప్రకటించారు. అందులో సింహభాగం ఐదు కంపెనీలకు చెందినవే ఉన్నాయి.
అయితే ఆ అయిదూ ముంబైలో ఉన్న కంపెనీలే. పైగా అతిపెద్ద పెట్టుబడి అని టాం టాం వేసిన లోధా కంపెనీ మహారాష్ట్ర మంత్రి మంగళ్ ప్రభాత్ లోధాకు చెందినది కావడం మరీ విడ్డూరం. ఇలాంటి అవకతవకలతో సీఎంల దావోస్ పర్యటనలు హాస్యాస్పదంగా తయారయ్యాయి. నిజానికి దావోస్ వంటి అంతర్జాతీయ సమావేశాలను తమాషాలుగా, మీడియా మేనేజ్మెంట్ ఈవెంట్లుగా మార్చిన ఘనత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుంది. ఆయన శిష్యరత్నమైన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఈ కళలో రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. రేవంత్‌తో కలిసి దావోస్‌కు వెళ్లిన మంత్రులు అక్కడ గ్రీన్కో అనే కంపెనీతో సమావేశమై చర్చలు జరిపారు. హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన సాగించే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడే ఓ కంపెనీతో మంతనాలు జరపడానికి వేల కిలోమీటర్లు వెళ్లడం అర్థం లేని విషయం. పైగా మంత్రుల తనయులు, వివాదాస్పద వ్యాపారవేత్తలు అధికారిక సమావేశాల్లో పాల్గొనడం మరో సమస్య. ఫార్ములా ఈ-కార్ రేస్‌పై విమర్శలు చేసి ఆ రేస్‌ను నిర్వహించిన కంపెనీపై దాడులు కూడా జరిపిన రేవంత్ సర్కార్ అదే కంపెనీతో దావోస్‌లో మంతనాలు జరిపింది.
ఎంవోయూలు, వాటిల్లోని పెట్టుబడుల అంకెలు పతాక శీర్షికలకు బాగుంటాయి. కానీ వాటిలో వాస్తవరూపం దాల్చేంత వరకు అవి కాగితాలకే పరిమితమన్న సంగతి మరువరాదు. లోకల్ కంపెనీలతో గ్లోబల్ స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా గత ఏడాది కుదుర్చుకున్న ఒప్పందాల తీరుతెన్నులపై రేవంత్ సర్కార్ నోరువిప్పడం లేదు. 2025 దావోస్ సదస్సులో రూ.1,78,950 కోట్ల మేర ఒప్పందాలు కుదిరాయని, వాటి ద్వారా 47,500 ఉద్యోగాలు వస్తాయని సీఎం ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఆ పెట్టుబడుల జాడ లేదు. క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు జరుగుతున్న ఆనవాళ్లు కనిపించడం లేదు. పైగా అదివరకే బీఆర్ఎస్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలనే మరోమారు రాసుకున్న సంగతి కూడా బయటకు వచ్చింది.
సొంత ఆఫీస్ కూడా లేని ఓ కంపెనీతో రూ.5 వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకోవడంపై దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు రూ.30వేల కోట్ల పైచిలుకు పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు వెల్లడవుతున్నది. వీటిలోనూ రష్మీ అనే కంపెనీతో చేసుకున్న ఎంవోయూ రూ.12,500 కోట్లుగా తెలుస్తున్నది. ఇది భారత్‌కే చెందిన కంపెనీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దావోస్ తతంగంలో ప్రజాధనం నేరపూరితంగా వృథా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ చేసిన తీవ్ర విమర్శలు ఆయన సొంత పార్టీ ప్రభుత్వానికే ఎక్కువగా వర్తిస్తాయని చెప్పక తప్పదు.