కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నపూర్ణ, రంగానాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, బస్వాపూర్ జలాశయాల నుంచి విడుదలయ్యే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావు..అవి ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు అనేది ఒక దుష్ప్రచారం మాత్రమే. ఈ ప్రశ్న ఇప్పటిది కాదు..పాతదే. కాళేశ్వరం ప్రాజెక్టు అందిస్తున్న ఫలితాలను గుర్తించడం ఇష్టంలేక చేస్తున్న కువిమర్శలు తప్ప వేరు కాదు. ఈ కువిమర్శలకు గతంలోనే అనేకసార్లు వివరణలు ఇచ్చి ఉన్నాను. అయినా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మళ్లీ మళ్లీ అటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రాజెక్టుపై విమర్శకులు మళ్లీ ఈ చర్చను లేవనేత్తినందున వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? మహారాష్ట్రలో ఎగువ గోదావరి సబ్ బేసిన్లో నిర్మించిన జైక్వాడి డ్యామ్ నుంచి వస్తాయి. మరి మనం ఎందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు అంటాం? జైక్వాడి డ్యామ్ నీళ్లు అనొచ్చుకదా! అట్లా ఎందుకు అనం అంటే.. ఆ ప్రాజెక్టు పరిధి దాటి, నదిపై మరో ప్రాజెక్టు కట్టినప్పుడు, ఆ ప్రాజెక్టుకు ఒక పేరు పెట్టుకుంటాం కనుక అక్కడ నుంచి సరఫరా అయ్యే నీటిని ఆ ప్రాజెక్టు పేరుతోనే పిలుస్తాం. ఇదే సూత్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా వర్తిస్తుంది. అన్నపూర్ణ, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినవే. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు జలాశయాలు వేరుగా నిర్మించిన జలాశయాలు అయినప్పటికీ అవి కాళేశ్వరం వ్యవస్థలో విడదీయరాని భాగంగా మారాయి.
ఈ రెండూ కూడా కాళేశ్వరం వ్యవస్థలో కీలకమైన బ్యాలెన్సింగ్ జలాశయాలుగా మారిపోయిన సంగతి ప్రాజెక్టు విమర్శకులు గురించకపోవడం శోచనీయం. కాళేశ్వరం కాకుండా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించినా ఎల్లంపల్లి, మిడ్‌మానేరు జలాశయాలు ఆ ప్రాజెక్టులో భాగం అయ్యేవి కావా? అప్పుడు కూడా ఈ విమర్శకులు ఆ నీళ్లను ఎల్లంపల్లి నీళ్లు అనేవారా? లేక ప్రాణహిత-చేవెళ్ల్ల నీళ్లు అనేవారా?
జలసంఘం కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి లభ్యత 240 టీఎంసీలుగా పేర్కొన్నది. ఇందులో గోదావరి నుంచి ఎత్తిపోసుకొనే నీరు 195 టీఎంసీలు, ఎల్లంపల్లి ప్రాజెక్టులో లభ్యమయ్యే నీరు 20 టీఎంసీలు, ఆన్లైన్ చెరువుల పరీవాహక ప్రాంత నీటి లభ్యత 10 టీఎంసీలు, ఆయకట్టు ప్రాంతంలో లభ్యమయ్యే భూగర్భ జలాలు 25 టీఎంసీలు, మొత్తం 250 టీఎంసీలు. ఆవిరి నష్టాలు 10 టీఎంసీలు తీసివేస్తే నికరంగా లభ్యమయ్యే నీరు 240 టీఎంసీలు. ఇందులో నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతిపాదించిన నీటి వినియోగం ఇలా ఉన్నది.
కొత్త ఆయకట్టుకు (18.25 లక్షల ఎకరాలు) సాగునీరు-134.5 టీఎంసీలు, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, వరద కాలువ, ఆయకట్టు స్థిరీకరణ (18.82 లక్షల ఎకరాల్లో మొత్తంగా 25% నీటి కొరతను పరిగణించి)-34.5 టీఎంసీలు, హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా30 టీఎంసీలు, దారిపొడుగునా గ్రామాలకు తాగునీరు10 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు16 టీఎంసీలు, ఆవిరి నష్టాలు12 టీఎంసీలు, మొత్తం 237 టీఎంసీలు. ఈ వాస్తవాలను గమనిస్తే..ఎల్లంపల్లి వద్ద లభ్యమయ్యే 20 టీఎంసీల నీరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమేనని తెలిసిపోతుంది. కేంద్ర జలసంఘం ఆమోదించిన ఈ గణాంకాలను చూసిన తర్వాత కూడా వీరి కండ్లు తెరుచుకోకపోతే ఇక ఎవరైనా చేసేదేమీ ఉండదు. వారి అజ్ఞానానికి చింతించడం తప్ప.
ఇకపోతే..ముందు వివరించిన విధంగా నదిపై ఒక ప్రాజెక్టు పరిధి దాటి మరో ప్రాజెక్టు కట్టినప్పుడు కచ్చితంగా కొత్తగా కట్టిన ప్రాజెక్టు పేరుతోనే పిలుస్తాం. కనుక కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన రిజర్వాయర్ల నుంచి విడుదలయ్యే నీళ్లను కాళేశ్వరం నీళ్లు అనే అంటాం తప్ప ఎల్లంపల్లి నీళ్లు అనడానికి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి సరఫరా అనేది మూడు విధాలుగా జరుగుతుంది.
ఈ అంశాన్ని కూడా గతంలో అనేకసార్లు వివరించాం. మొదటిది శ్రీరాంసాగర్‌కు వరద వచ్చినప్పుడు వరద కాలువ ద్వారా మిడ్‌మానేరుకు, కాకతీయ కాలువ ద్వారా దిగువ మానేరు చేరతాయి. ఇవి పోగా ఇంకా వరద ఉంటే గేట్ల ద్వారా నదిలోకి వదులుతారు. అవి ఎల్లంపల్లికి వెళ్తాయి. ఎల్లంపల్లి నిండితే సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డకు వెళ్తాయి. ఆ తర్వాత తుపాకులగూడెం ద్వారా పోలవరానికి వెళ్తాయి. శ్రీరాంసాగర్‌కు కనీసం మూడేండ్లకు ఒకసారైనా వరద వచ్చే అవకాశం ఉన్నదని గత 25 ఏండ్ల వరద చరిత్ర చూస్తే తెలుస్తున్నది. శ్రీరాంసాగర్‌కు వరద వచ్చిన స్థితిలో కాళేశ్వరం లింక్-1 పంపులు (మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి), లింక్-2 పంపులు (ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు) తిప్పే అవసరం రాదు.
ఇక రెండో స్థితి..శ్రీరాంసాగర్‌కు వరద రాకున్నా ఎల్లంపల్లికి కడెం నది నుంచి, శ్రీరాంసాగర్-ఎల్లంపల్లి మధ్య ఉన్న పరీవాహక ప్రాంతం నుంచి వరద వచ్చే అవకాశం ఉన్నది. ఈ స్థితిని వర్షాకాలంలో ప్రతీ ఏటా చూస్తాం. ఈ స్థితిలో కాళేశ్వరం లింక్-1 పంపులు తిప్పే అవసరం రాదు. ఎల్లంపల్లి నుంచే లింక్-2 పంపులు తిప్పి నీటిని మిడ్‌మానేరుకు చేరవేయడం, అక్కడి నుంచి ఎగువకు కొండపోచమ్మ సాగర్ దాకా ఎత్తిపోయడం, దిగువ మానేరుకు, అక్కడి నుంచి కాకతీయ కాలువ ద్వారా శ్రీరాంసాగర్ మొదటి దశ, రెండో దశ ఆయకట్టుకు నీటి సరఫరా, పునరుజ్జీవన పథకం ద్వారా శ్రీరాంసాగర్ జలాశయానికి నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది. ఇక మూడోది.. పై రెండుచోట్ల నీటి లభ్యత లేని సందర్భాల్లో మాత్రమే లింక్-1, లింక్-2 పంపులను తిప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. ఎన్నో నెలలు, ఎన్నో వందల గంటలు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆర్ విద్యాసాగర్‌రావు, ఇతర విశ్రాంత ఇంజనీర్లతో మేథోమధనం జరిగిన తర్వాతనే ప్రాజెక్టు ఒక స్వరూపం సంతరించుకొన్నది. అందుకు నేను ప్రత్యక్ష సాక్షిని.
శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, వరద కాలువ ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు స్థిరీకరణ అన్నది కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్‌లో ఒక ముఖ్యమైన అంశం. ఈ ఇరిగేషన్ ప్లానింగ్‌ను కేంద్ర జల సంఘం కూడా ఆమోదించింది. స్థిరీకరణకు నీటి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఈ వాస్తవాలు తెలియనివారే కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలకు పూనుకొంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు, మత్స్య పరిశ్రమ, టూరిజం, పట్టణాభివృద్ధి, పర్యావరణం, దేశీయ జల రవాణా, ఆయకట్టు స్థిరీకరణ..తదితర రంగాలను ప్రభావితం చేసి తెలంగాణ సమగ్ర వికాసానికి దోహదం చేసే ఒక ప్రగతి రథంగా (Growth Engine) మారింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ 2019 నుంచి 2023 మొత్తం 20,33,572 ఎకరాలకు (కొత్త + స్థిరీకరణ కలిపి) విజయవంతంగా నీటిని అందించింది. ఇందులో కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు శ్రీరాంసాగర్ మొదటి దశ, రెండవ దశ ఆయకట్టుకు, నిజాంసాగర్ ఆయకట్టుకు కలిపి 17 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరించడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ఏండ్ల్ల తరబడి ఉన్న చారిత్రక కరవులను, వ్యవసాయ సంక్షోభాన్ని శాశ్వతంగా నిర్మూలించడంలో కాళేశ్వరం దోహదం చేసింది.
కాళేశ్వరం కారణంగా తెలంగాణ వ్యవసాయం చారిత్రాత్మక వృద్ధి సాధించింది. మొత్తం పంట దిగుబడి 1.07 కోట్ల టన్నుల (2013-14) నుంచి 4.65 కోట్ల టన్నుల (2022-23)కు పెరిగింది. అంటే నాలుగు రెట్లు పెరిగింది. వరి ఉత్పత్తి 2014లో 68 లక్షల టన్నుల నుంచి 2023 నాటికి 2.70 కోట్ల టన్నులకు పెరిగింది. సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.20 కోట్ల ఎకరాలకు భారీగా విస్తరించింది. ఇటీవల భారత ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి విడుదల చేసిన జాతీయ ఆర్థిక సర్వేలో ఈ వాస్తవాన్ని గుర్తించి ఈ కింది విధంగా నమోదు చేసింది.
In Telangana the cultivated area, which stood at 1.31 crore acres in 2014, increased to 2.2 core acres by FY 23 due to major flagship projects such as Kaleshwaram Lift Irrigation Project and Mission Kakatiya (tank rejuvenation) undertaken by Telangana.
కాళేశ్వరంలో భారీ జలాశయాలు నిర్మించిన కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టం సగటున 5.36 మీటర్లు పెరిగినట్టు భూగర్భ జల శాఖ వెల్లడించింది. కాళేశ్వరంలో భారీ జలాశయాల నిర్మాణం జరిగినందున మంచినీటి చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. మత్స్య శాఖ గణాంకాల ప్రకారం..2016-17లో 1,93,732 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది. వాటి విలువ రూ.1,356.61 కోట్లు. 2021-22లో చేపల ఉత్పత్తి 3,49,000 మెట్రిక్ టన్నులు. వాటి విలువ రూ.3,141 కోట్లు. నాలుగేండ్లలోనే రాష్ట్రంలో చేపల ఉత్పత్తి దాదాపు రెండు రెట్లు పెరిగింది. ప్రస్తుత ప్రభుత్వ వర్గాలు గాని, ప్రాజెక్టు విమర్శకులు గాని ఈ బృహత్తర విజయాలను ఎట్లాగూ అంగీకరించరు. కానీ ప్రజలకు ఈ వాస్తవాలు అనుభవంలో ఉన్నవే. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల సాగు, తాగునీటి ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన సమీకృత గోదావరి వ్యాలీ అభివృద్ధి పథకంగా (Integrated Godavari Valley Development Plan) నిలబడిన వాస్తవాన్ని ఎవరు కాదన్నా వాస్తవం మాత్రం అదే.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాలి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ 332 మీటర్లు, మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఎఫ్ ఆర్ఎల్ 557 మీటర్లు. అంటే శ్రీరాంసాగర్ కంటే మల్లన్నసాగర్ 225 మీటర్ల ఎక్కువ ఎత్తులో ఉన్నది. ఒకవేళ కాళేశ్వరంప్రాజెక్టు పంపింగ్ వ్యవస్థ లేకుండా 225 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎలా వస్తాయి? అలాగే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ 148 మీటర్లు, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ఎఫ్ఆర్ఎల్ 618 మీటర్లు. అంటే ఎల్లంపల్లి కంటే కొండపోచమ్మసాగర్ 470 మీటర్లు ఎక్కువ ఎత్తున ఉంది.
అలాంటప్పుడు నంది (223 మీ), గాయత్రి పంప్ (మిడ్ మానేరు (318 మీ), అన్నపూర్ణ (397 మీ), రంగనాయకసాగర్ (490 మీ), మల్లన్నసాగర్ (557 మీ), కొండపోచమ్మసాగర్ (618 మీ). వీటికి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు పంపింగ్ వ్యవస్థ లేకుండానే ఆకాశమార్గాన ఏమైనా వస్తున్నాయా? ఈ విషయంలో విమర్శకుల వద్ద సమాధానం ఉందా? కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నవారు పై ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అదే సమయంలో తెలంగాణ ప్రజలు ఈ విమర్శకుల దుష్ట ఆలోచనలపై ఒక కన్నేసి ఉండవలసిన అవసరం ఉన్నది. పాలను, నీళ్లను వేరు చేసి చూడగల చైతన్యాన్ని ప్రోది చేసుకోవాలి. లేనట్టయితే నష్టపోయేది తెలంగాణ రాష్ట్రం, ప్రజలు.
– (వ్యాసకర్త: విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజనీర్, సాగునీటి శాఖ)
శ్రీధర్ రావు దేశ్ పాండే