రాయపోల్, జూన్ 03 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి, వీరనగర్ గ్రామాలకు చెందిన రైతులు బుధవారం గజ్వేల్–చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ధాన్యాన్ని ఇప్పటికి కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికి సుమారు 50 శాతం వరి ధాన్యం కొనుగోలు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు.
అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని, అధికారులు వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరారు. తోగుట సీఐ లతీఫ్ సాయంత్రం లారీలను పంపిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.