KTR – Pawan Kalyan | తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు దేశభక్తి, పోరాటాల గురించి మేం పవన్ కల్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణ ఓజీ కేసీఆర్ అని స్పష్టం చేశారు.
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఉదయం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చని తెలిపారు. జనసేన కొత్తగా తెలంగాణ పోటీ చేసేది ఏముందని అన్నారు. 2023 ఎన్నికల్లో బీజేపీతో కలిసి తెలంగాణలో పవన్ పోటీ చేశారని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్‌ను ఎవరూ అడ్డుకోలేదని.. ప్రజలే అడ్డుకున్నారని ఆయన స్పష్టం చేశారు.
ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమని పవన్ కళ్యాణ్ అంటున్నాడని కేటీఆర్ అన్నారు. మరి పొట్టి శ్రీరాములు మద్రాస్ నుంచి ఆంధ్ర వేరుపడాలని 58 రోజుల పాటు ఆత్మబలిదానం చేసుకున్నారు కదా అది కూడా ప్రాంతీయ వాదం అంటారా అని ప్రశ్నించారు. ప్రాంతీయ వాదం అంటే తెలంగాణకి రావాల్సిన పెట్టుబడులు గుజరాత్లో పెట్టుకున్నారు.. మరి జాతీయ వాదం ముసుగులో చేస్తున్న ఆర్ధిక ప్రాంతీయ వాదం కరెక్టేనా అని నిలదీశారు. ప్రధాని మోదీ కేవలం గుజరాత్‌కు పీఎంగా వ్యవహరించడం కరెక్టేనా అని ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని గతంలో పవన్ కల్యాణ్ అన్నారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం రోజు హైదరాబాద్‌కు వచ్చి సభ పెడతానంటే ఎలా అని ప్రశ్నించారు. దేశభక్తి గురించి పవన్ కల్యాణ్ మాకు నేర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే అని పేర్కొన్నారు. నటుడిగా అభిమానిస్తాం.. సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతాం కానీ.. మా రాజకీయాల్లో పెత్తనం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. మొన్ననే అంత కష్టపడి విడిపోయాం కదా.. మళ్లీ మీ పెత్తనం ఎందుకు అని నిలదీశారు.
తెలంగాణ OG కేసీఆర్
దేశ భక్తి, పోరాటాల గురించి మేము పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు
నటుడిగా అభిమానిస్తాము, సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతాము కానీ మా రాజకీయాల్లో పెత్తనం చేస్తామంటే ఊరుకోము
మొన్ననే అంత కష్టపడి విడిపోయాము కదా మళ్లీ మీ పెత్తనం ఎందుకు?
–… https://t.co/clpkT3CUpf pic.twitter.com/dvQ80briqt
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2026