వినాశనం, విస్పోటనం మధ్య చిక్కుకున్నది మానవ జీవితం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చిక్కుకున్నామని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే.. మనుషులకు మధ్య దూరం ఎలా పెరిగిందో సులభంగా అర్థమవుతుంది. మనిషి మూర్ఖత్వ ఆలోచనలే ఇందుకు కారణం. దీనివల్ల ఈ ఆధునిక కాలంలో కూడా కొన్ని సమూహాలు ఇంకా నలిగిపోతూనే ఉన్నాయి. అలాంటి వారి గాయాలకు పసునూరి కథలు మందు రాస్తాయనడంలో సందేహం లేదు. పసునూరి రచనల్లో శ్రమైక జీవన సౌందర్యం ఉన్నది. కథల్లో జీవం ఉన్నది కాబట్టే అతని రచనలు అంత చిక్కగ ఉంటాయి. శ్రమజీవుల నుంచి పుట్టిన ప్రతీ వాక్యం సజీవంగా ఉంటుంది. కొన్నేండ్ల పాటు కాదు, కొన్ని తరాలనే శాసిస్తుంది. అట్లా పసునూరి రచించిన ‘కండీషన్స్ అప్లయ్’ పుస్తకంలోని కథలు ఆధునిక దళితుల గోసలను కండ్ల ముందుంచుతాయి.
2జీ నుంచి 5జీకి వచ్చినా మారిందేమీ లేదు. జనరేషన్ మారిందే తప్పా.. మనిషిలో ఇసుమంత కూడా మార్పు రాలేదు. ఇక్కడ కులోన్మాదం అనే మాయరోగం కరోనా కంటే వేగంగా విస్తరిస్తోందనే చేదునిజాన్ని చాటుతున్నాయి ‘కండీషన్స్ అప్లయ్’ పుస్తకంలోని కథలు. పాదం కింద ఒక నినాదం మొలుస్తుందనేది అక్షర సత్యం. ఊరు కాని ఊరు. దేశం కాని దేశం దాటి మనుషులను ముక్కలుగా చేస్తుంది.
మనిషికి మనిషికి మధ్య దూరాన్ని పెంచుతోంది. ప్రయోగశాలలు, వైద్యాలయాల్లో కూడా అంటరానితనం ఇంకా అలానే ఉందనడంలో సందేహం లేదు. అద్దె గర్భం ద్వారా పుట్టే బిడ్డను కూడా కులమతాలతో వేరు చేస్తున్నారు ఈ కులోన్మాదులు. అమ్మతనాన్ని సైతం మైక్రోస్కోప్‌తో పరీక్షించే తరహాలో ఉంది నేటి సమాజం. తన కులానికి చెందినవారి ద్వారానే దాన్ని కొనేందుకు ప్రయత్నిస్తుంది కులోన్మాదం. కడుపుకే కనులుంటే కడుపు కోత అనుభవించేదా? అని ప్రశ్నించేదే ఇందులోని ‘కండీషన్స్ అప్లయ్’ కథ.
ఊరిలో అంబేద్కర్ విగ్రహం పెట్టనివ్వకుండా దొర కుట్ర చేస్తే బహుజనులు తిప్పికొట్టిన ఒక ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది ‘ధమ్కీ’ కథ. ఆకలిని తట్టుకోలేక ఆకులు తిన్న లింగడిని ఆదుకోవాల్సింది పోయి, అతని ఆకలిని దైవత్వంతో పోల్చడం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఇలాంటి సంఘటనను చూపించిందే ‘లీఫ్ మ్యాన్’ కథ. పల్లె నుంచి పట్నం దాకా, పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు కులోన్మాద విషం ఎంతలా విస్తరించిందో ‘ప్యూర్లీ నాన్ వెజిటేరియన్’ కథ వివరిస్తుంది. కట్టుకథలు, అసత్య ప్రచారాలతో మతకల్లోలాలు జరుగుతాయని చెప్పేదే ‘వాట్సప్ స్ట్రీట్స్’ కథ. ఇట్లా ‘కండీషన్స్ అప్లయ్’ పుస్తకంలో మొత్తం 19 కథలున్నాయి. మొదటి కథ ‘లీఫ్ మ్యాన్’ కాగా, ఆఖరిది ‘వెంటాడే పాట’. నిన్ను నువ్వు నిరూపించడానికి సాహసిస్తే, నువ్విక ఒంటరిగా మిగలవంటూ ధైర్యాన్నిస్తాయని చెప్తుందీ పుస్తకం.
– దుర్గం అశోక్ సామ్రాట్81436 77008