ఓ మహిళ ఒక రోజు గాంధీజీ వద్దకు వచ్చారట. గాంధీజీతో తన గోడు ఇట్లా వెళ్లబోసుకున్నారట. ‘బాపూజీ.. నా కుమారుడు నిత్యం బెల్లం తింటున్నాడు. ఎంత చెప్పినా వినడం లేదు. మీరు చెప్తే వింటాడని మీ వద్దకు తీసుకొచ్చాను’ అని ఆమె చెప్పారట. అయితే తనకు ఓ వారం రోజుల సమయం కావాలని ఆమెను గాంధీజీ అడిగారట. అంత వ్యవధి ఎందుకని గాంధీజీని తన అనుచరులు అడిగారట. వారం రోజుల తర్వాత ఆ బాలుడిని పిలిపించి బెల్లం తినొద్దని గాంధీజీ చెప్పి పంపించారట. తనకూ బెల్లం తినే అలవాటు ఉన్నది కాబట్టే, తాను మారిన తర్వాత గానీ ఇతరులకు నీతులు చెప్పొద్దనే ఉద్దేశంతోనే తాను మొదట ఆ బాలునికి దీని గురించి చెప్పలేదని గాంధీజీ తన అనుచరులకు చెప్పారట. అంటే తాను పాటించకుండా ఏ విషయం ఇతరులకు చెప్పొద్దని గాంధీజీనే చెప్పారు. ఇదంతా ఇప్పుడెందుకు అంటే… మీడియా గొంతు నొక్కేస్తున్నారని గతంలో చెప్పిన మన ముఖ్యమంత్రి ఇప్పుడు అదే మీడియా విషయంలో, ప్రధానంగా జర్నలిస్టుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు గురించి చెప్పేందుకే ఈ ఉపోద్ఘాతం.
రాష్ట్ర ముఖ్యమంత్రి తాను విపక్షంలో ఉన్నప్పుడు మీడియా హక్కుల గురించి మాట్లాడారు. జర్నలిస్టులకు అండగా ఉంటానన్నారు. నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పిన ఆయన ఇప్పుడు తనను ప్రశ్నిస్తున్నవారిని అసలు జర్నలిస్టులే కాదంటున్నారు. అంతేకాదు, మీడియా మీట్లో ముందు వరుసలో కాలు మీద కాలేసుకొని కూర్చుని తమకు నమస్కారం పెట్టాలనే ధోరణిలో జర్నలిస్టులు ఉంటున్నారని ఎద్దేవా చేస్తూ, అలాంటివారి చెంప చెల్లుమనిపించాలన్నారు. అంతేకాదు, కొందరు సోషల్ మీడియా జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారని కూడా ఫైరయ్యారు. ‘అ ఆ’లు కూడా రానివారు తాము జర్నలిస్టులమ ని చెప్పుకొంటున్నారని సెలవిచ్చారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పాలన గురించి సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని కొందరి చేత పనిగట్టుకుని దుష్ప్రచారం చేయించిన ఆయనకు నాటి మీడియా ఎంతో నచ్చింది. అప్పట్లో ఏ ఆధారాలు లేకుండానే బురదజల్లిన ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రస్తుత ముఖ్యమంత్రి సహా నాడు వాటిని ప్రసారం చేసిన జర్నలిస్టు సమూహాల గురించి ఆహా ఓహో అంటూ కొనియాడారు. కానీ, ప్రస్తుతం అధికారంలోకి రాగానే అవే వేళ్లు తన వైపునకు చూపేసరికి అసెంబ్లీ సాక్షిగా బట్టలూడదీసి జర్నలిస్టులను కొట్టాలంటున్నారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి ఒక వేదికగా నిలిచే ప్రెస్ క్లబ్‌ను కల్లు కాంపౌండ్, పబ్బులతో పోల్చడం ముఖ్యమంత్రికే చెల్లింది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భానికి ముందు కొందరు సోషల్ మీడియా జర్నలిస్టులు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తమ ఇష్టానుసారంగా మాట్లాడారు. అప్పుడు సంతో షపడిన ఇదే సీఎం, ఇప్పుడు కస్సుబుస్సులా డుతున్నారు. తన దాకా వస్తే ఇలా ఉంటుం దా? కొందరు సోషల్ మీడియా జర్నలిస్టులు, మీలాంటి రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం పనిచేస్తే జర్నలిస్టు సమాజమంతా తప్పు చేసినట్టు మాట్లాడటం, చులకనభావంతో చూడ టం సరికాదు. జర్నలిస్టులు అనేవాళ్లను సమాజంలో చెడుగా చూపించే ప్రయత్నాన్ని మీరు పనిగట్టుకుని చేయడాన్ని జర్నలిస్టులు గాని, జర్నలిస్టు సంఘాలు గాని సహించవు.
మన సీఎం మాత్రమే కాదు, ఆయన పాత మిత్రులు, ఆ మిత్రులకు తోడైన కొందరు కొత్త మిత్రులు.. అందరూ మీడియాపై విరుచుకుపడుతున్నవారే. ఎటొచ్చి జర్నలిస్టులే ఎటూ కాకుండాపోతున్నారు. రాహుల్‌గాంధీ నిత్యం ప్రజాస్వామ్యం గురించి, భావప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు. చేతిలో రాజ్యాం గం పుస్తకాన్ని పట్టుకొని తిరిగే ఆయనకు ఆ రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19(1)(ఏ) భావప్రకటనాస్వేచ్ఛ గురించి బాగా తెలుసు కాబట్టి, మీడియాకు స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నారు. తన గురించి ఎవ్వరు , ఏం మాట్లాడినా ఫర్వాలేదంటున్నారు. తనకు నచ్చిన విధంగా ముందుకెళ్తానని చెప్తున్నారు. కానీ, మన సీఎం మాత్రం, వాళ్ల అధినాయకుడి బాట కు భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది.
ఏడాదిన్నరలోనే తమను ప్రశ్నించిన జర్నలిస్టులపై ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో మన కండ్లముందున్నది. ఒక చెం ప కొడితే మరో చెంప చూపించాలనే గాంధీజీ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఏనాడో గాలికి వదిలేసింది. అయితే మన ముఖ్యమంత్రి గాంధేయ మార్గంలో నడుస్తున్నానని బయటకు చెప్తూనే అనేక చోట్ల ఆవేశంతో మాట్లాడే మాట లు యథావిధిగా మీడియా ప్రసారం చేస్తే మాత్రం సదరు ముఖ్యమంత్రికి చిర్రెత్తుకొస్తుంది. పలు సభల్లో ఆయన మాట్లాడుతూ పేగులు మెడలో వేసుకుంటానని, బట్టలూడదీసి కొడతానన్నారు. ఆ మాటలను యథావిధిగా ప్రసారం చేస్తే జర్నలిస్టులపై విరుచుకుపడ్డారు.
ప్రభుత్వ పాలన జనరంజకంగా ఉంటే జర్నలిస్టులు అదే విషయాన్ని రాస్తారు. లేదు, ప్రజా కంఠకంగా పాలన సాగుతుంటే దానిని ప్రశ్నల రూపంలో సంధించి పాలకులకు తెలిసివచ్చేలా చేస్తుంటా రు. పాలకులనేవారు సద్విమర్శలను, సూచన రూపంలో వచ్చే వార్తలను అనుకూల దృక్పథంతో తీసుకోవాలి. అంతేకానీ, మీడియా సం స్థలు తమకు బాకా ఊదాలని, ఇంద్రుడు చం ద్రుడు అని పొగడాలని, తాము ఏం చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా అదే సరైనదన్న రీతిలో వార్తలు కవర్ చేయాలని భావించడం పెద్ద తప్పు.
తమ తప్పులను సరిచేసుకోకుండా మీడియాపైనా, జర్నలిస్టులపైనా విరుచుకుపడటం ఈ మధ్య ప్రతీ ఒక్కరికి ఫ్యాషన్‌గా మారింది. ఏ విభాగంలోనైనా ఒక్కరో, ఇద్దరో తప్పులు చేస్తుంటారు, అంతమాత్రాన మొత్తం ఆ విభాగానికే అంటగట్టడం, తక్కువ చేసి మాట్లాడటం ఏలికలకు తగదు. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా భావించే జర్నలిజం, ఆ వృత్తిని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న జర్నలిస్టులపై చులకనాభావం తగదు. రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛకు రాజకీయులు ప్రతిబంధకాలుగా మారడం మంచిది కాదు.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
అస్కాని మారుతీ సాగర్90107 56666