ఏడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా, అధికారంలో ఉన్న వివిధ రాష్ర్టాల్లో బీసీలపై కనబరిచిన కపట ప్రేమ ఫలితంగానే బలహీన వర్గాల సమాజం అవకాశాల కోసం పెనుగులాడుతూనే ఉన్నది. రెండున్నరేండ్లుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా బీసీలకు అదే కపట ప్రేమను చూపి సరిపెడుతున్నది. ఆ పార్టీ పాత ఫ్యూడల్ పాలన నమూనానే రేవంత్ ప్రభుత్వం కూడా పాటిస్తున్నారులే అని పెదవి విరిచి సరిపెట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వ వార్షిక బడ్జెట్లో బడుగులపై కపట ప్రేమ కూడా కానరాకపోగా కొత్త తరహా వంచన విధానం కండ్లకు కట్టినట్టు కనబడుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన ఆదాయ, వ్యయాల అంచనాల్లో కేటాయింపుల తీరును లోతుగా విశ్లేషించి, ఇతరేతర కేటాయింపులతో పోల్చితే యాభై శాతం పైబడిన జనాభా పట్ల కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి దృష్టి కోణం కలిగి ఉన్నదో స్పష్టంగా అర్థమైపోతుంది. ఇప్పటికే రెండున్నరేండ్లుగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు పేరుతో డ్రామా నడిపి, బీసీలను నడి వీధుల్లో నవ్వుల పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. క్యాబినెట్లో, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించకుండా నోటితో చెప్పి నొసటితో వెక్కిరించింది. కామారెడ్డి డిక్లరేషన్ అమలుకు గడిచిన రెండు బడ్జెట్లలో కొసరంత కూడా కేటాయించలేదు.
తాజాగా రూ.3,24,234 కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో కేవలం 3.85% (రూ.12,511 కోట్లు ) మాత్రమే విదిల్చి బీసీలను తీరని వేదనకు గురిచేసింది. కేటాయింపులు చేసినా ఆ లెక్కలు ఖర్చుకు నోచుకోవని రెండేండ్లుగా కాంగ్రెస్ పాలకులు పెడుతున్న బడ్జెట్ చూసి మోసపోయిన తెలంగాణ సమాజానికి అనుభవమే!.
అయినా సీఎం సొంత జిల్లా అయిన నాగర్‌కర్నూల్‌లో బలహీన వర్గాలకు చెందిన పసికందును ఓ దుర్మార్గుడు కాలితో తన్ని చంపినా పెదవి విప్పని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి బీసీల భవితవ్యాన్ని ఆశించడం నిస్సందేహంగా మూర్ఖత్వమే అవుతుంది. కానీ ఇటీవల శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టివిమ్రార్క ప్రతి పౌరుడికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే లక్ష్యం అనే అంబేద్కర్ వ్యాఖ్యలను ఊటంకిస్తూ 81 పేజీల అసత్యాల రాబడి, వ్యయాల రాగాలాపన అందుకున్నారు. వినేవాళ్లుంటే చెప్పేవారికి లోకువే కదా?సామాజిక న్యాయానికి సమాధి నిర్మిస్తున్న రేవంత్‌రెడ్డి సర్కార్ అనారోగ్యకర ఆర్థిక నమూనాకు ఎర్ర తివాచీ పరిచే డొల్ల బడ్జెట్‌కు డోలు వాయించేందుకు త్యాగధనుల నినాదాలను అరువు తెచ్చుకోవడం ఆత్మవంచనకు పరాకాష్ట కాదా? కేసీఆర్ ప్రభుత్వం బడుగుల బిడ్డలు ప్రపంచ ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో అధ్యయనం చేసి అంబేద్కర్‌లా ఆణిముత్యాలు కావాలనే పూలే విదేశీ విద్యానిధి అనే చారిత్రక పథకాన్ని అమలులోకి తెచ్చింది.
సుమారు ఏడువేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇరవై ఐదు లక్షల ఫెలోషిప్ మంజూరు చేసి అమెరికా, లండన్, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నత చదువులు చదివించింది. ఆకాశమే హద్దుగా బడుగుల బిడ్డలు ఎదగాలని కేసీఆర్ ప్రారంభించిన పూలే విదేశీ విద్యానిధికి రేవంత్ ప్రభుత్వం కేవలం రూ.80 కోట్లు మాత్రమే కేటాయించడం అంబేద్కర్ ఆశయానికి తూట్లు పొడవడమో కాదో భట్టితో పాటు రేవంత్‌రెడ్డి మంత్రివర్గం ఆత్మ విమర్శ చేసుకోవాలి.
విదేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు రెండేండ్లుగా విదేశీ విద్యానిధి స్కాలర్షిప్ నిధులు సరిగ్గా మంజూరు కాక, సెమిస్టర్ల ఫీజులు, భోజన ఖర్చుల కోసం ఆపసోపాలు పడుతూ, మనోవేదనకు గురవుతున్నారు. రేవంత్ సర్కార్ పదివేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర విద్యా సంస్థల యాజమాన్యాలు బంద్ చేపట్టడంతో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంత మానసిక వేదనను అనుభవించారో ఎవరైనా మరిచిపోగలరా?
భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లతో పోల్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎన్ని గ్యారెంటీలిచ్చారు? కాంగ్రెస్ అగ్రనేతలు, కురువృద్ధులతో చెప్పించి మరీ బీసీలకు ఎన్నెన్ని మాటలు నమ్మ బలికారో భట్ట్టికే కాదు కాంగ్రెస్ నేతలకు ఎవ్వరికీ కనీసం గుర్తుకు కూడా ఉండకపోవచ్చు. రూ:3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. వేలాది బడుగు వర్గాల యువకులు ఫీజు రీయింబర్స్మెంట్ రాక, స్కాలర్ షిప్ నిధులు అందక చదువుల కోసం ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా పని చేస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో బీసీ కన్వెన్షన్ హాల్, లైబ్రరీ, స్టడీ సర్కిల్, బీసీ ఐక్యత భవనాలు నిర్మిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
కానీ అవేవీ పునాది రాయికి కూడా నోచుకోకపోగా ఉన్న బీసీ సంక్షేమ హాస్టళ్లు శిధిలావస్థకు చేరుతున్నాయి. ఇదీ చాలదన్నట్టు ప్రతి మండల కేంద్రంలో వృత్తి బజార్లు నిర్మించి, బీసీల్లోని ఉత్పత్తి కులాలకు 50 దుకాణాలు ఉచితంగా ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ, గద్దెనెక్కిన తర్వాత కుల వృత్తుల ఊపిరినే తీసేస్తున్నది. వివిధ కులాలు, ఉప కులాల్లోని అన్ని వర్గాలకు ఇచ్చిన గ్యారెంటీల్లో పావు వంతు నెరవేర్చడానికి కూడా సరిపోని కేటాయింపులు విదిల్చి, బీసీ వర్గాల గుండెలను కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ గాయపరిచింది. మూసీ, మెట్రో, ఫోర్త్ సిటీ, హిల్ట్ పేరిట లూటీకి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు అత్యుత్సాహం చూపుతున్న సర్కార్‌కు బీసీ సబ్ ప్లాన్ కోసం మాత్రం ఐదేండ్లకు లక్ష కోట్లు ఖర్చు చేస్తామన్న హామీనే గుర్తుకు రావడం లేదెందుకు?
‘బలహీన వర్గాల పట్ల చెవిటి, మూగగా నటించే ప్రభుత్వాలను భరించవచ్చునేమో కానీ వేటగాళ్లలా వ్యవహరించే ప్రభుత్వాలను తరమకుంటే నేరం’ అని సామాజిక ఉద్యమకారుడు రామ్మనోహార్ లోహియా అన్నట్టుగా నేడు బీసీ నవతరం కాంగ్రెస్ మోసాలపై ఊరూరా ఎదురుతిరగాలి.
తెలంగాణ సామాజిక అవసరాలు, ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ లాంటి మానవీయ పథకాలకు నిధులు కేటాయించడం లేదంటే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏ వర్గాల బలి కోరుతున్నదో అర్థం చేసుకోవాలి. రాబడి, వ్యయాలను రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కాకుండా ఢిల్లీ పెద్దల కోసమో, పదవీ లాలస కోసమో రూపొందించుకోవడం క్షమించరాని రాజకీయ నేరం.
బడుగులను, రాష్ట్ర భవిష్యత్తును బలికోరుతున్న ఈ బడ్జెట్ ప్రతిపాదనలను ఎండగట్టకపోతే అమానవీయ ఆర్థిక కార్యాచరణకు తెలంగాణ కొలమానంగా మారిపోతుంది. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వం గురుకులాల ఏర్పాటు నుంచి గొర్రెల పంపిణీ వరకు అమలు చేసిన 450 సంక్షేమ పథకాలకు తెలంగాణ ఆర్థిక అవసరాలు మాత్రమే కాదు, సకల జనుల ఆత్మ గౌరవానికి కూడా ప్రధాన పునాది సూత్రం. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆర్థిక వ్యవస్థనే కాదు వ్యవస్థలు, వ్యక్తుల ఆత్మ గౌరవంతో కూడా చెలగాటమాడుతున్నది.
– ( వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
డాక్టర్ ఆంజనేయగౌడ్