బండి సాయి భగీరథ్.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు చేశాడన్న ఆరోపణలతో నమోదైన పోక్సో కేసు కొన్నిరోజులుగా సంచలనం కలిగిస్తున్నది. కేంద్ర మంత్రి కుమారుడి మీద పోక్సో ఆరోపణలు వచ్చాయి. రాష్ర్టానికి చెందిన ఒక ప్రభుత్వాధినేత ఎలా స్పందించాలి? వెంటనే కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి, విచారణ జరపాలని, బాలికకు వెంటనే భద్రత కల్పించాలని ఆదేశాలు ఇవ్వాలి. కానీ మూడు రోజుల తర్వాత తీరిగ్గా స్పందించిన రేవంత్‌రెడ్డి బాధితుల గురించి మాట్లాడకుండా, ఎవరో కోరుకున్నట్టు దర్యాప్తు జరగదని, బాధితురాలి మీద బండి సంజయ్ కుమారుడు కూడా కేసు పెట్టాడని మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడడంలో ఉద్దేశం అర్థం చేసుకోవచ్చు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు బిజీగా ఉన్నట్టు డీజీపీ వివరణ ఇచ్చారని, కేసు దర్యాప్తు కోసం సిట్ వేయడం ఈ కేసును నీరుగార్చడానికి తీసుకున్న చర్యలుగా అందరికీ అర్థమయ్యాయి. నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిందితుడు మాత్రం తన మీద తప్పుడు కేసులు నమోదు చేశారని, అందులో బెయిలబుల్ సెక్షన్లు మాత్రమే ఉన్నాయని, తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. మరోవైపు బాధితురాలిని, బాధిత కుటుంబాన్ని విచారించిన సిట్ అధికారి కేసులో నమోదు చేసిన బెయిలబుల్ సెక్షన్లను నాన్ బెయిలబుల్ సెక్షన్లుగా మార్చి, నిందితుడి ఆచూకీ లభించడం లేదని తెలిపారు.
బుధవారం మధ్యాహ్నం పోలీసుల విచారణకు హాజరుకావాల్సిన సాయి భగీరథ్ తాను హాజరుకాలేనని, ఆధారాలతో విచారణకు హాజరుకావడానికి మరింత సమయం కావాలని తీరిగ్గా ఒక మెయిల్ పంపి ఊరుకున్నాడు. పోక్సో వంటి తీవ్ర నేరారోపణ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కాంగ్రెస్, బీజేపీల నిష్క్రియాపరత్వాన్ని ప్రశ్నిస్తూ బాధితులకు అండగా బీఆర్ఎస్ నిలబడింది. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటివరకు చలనం లేదు. ఇదే అంశంలో ప్రధాన తెలుగు మీడియా పత్రికలు, టీవీ ఛానళ్లతో పాటు, నిత్యం వార్తల్లో ఉండే యూట్యూబ్ ఛానళ్లు, మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, స్వయం ప్రకటిత మేధావుల బండారం కూడా తేటతెల్లమైంది.
బండి సంజయ్ కుమారుడి మీద నమోదయిన పోక్సో కేసులో ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నా కొందరు కనీసం ఒక్క ప్రశ్న కూడా వేయడం లేదు. ఒక్క వార్త కూడా ప్రసారం చేయడం లేదు. డబ్బు సంచులకు అమ్ముడుపోయిన కొన్ని ఛానళ్ల పెద్దలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బాధితురాలి మీద బురదజల్లుతుండడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసిందని, బీఆర్ఎస్ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అనడం కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల అంతర్గత మిలాఖత్కు పరాకాష్ఠ. ఇఫ్పుడు 17 ఏండ్ల బాలిక విషయంలో ఆమె పక్షాన నిలబడకుండా నిందితుడికి రక్షణ గోడలా నిలిచిన వ్యవస్థలు, పార్టీలు, మేధావులను చూసి ఒక్క కేసుతో వంద సమాధానాలు లభించినట్లయింది. బండి సంజయ్ కుమారుడి కేసు రాజకీయాల్లో నైతిక పతనాన్ని సూచిస్తున్నది. కపటనీతి, ద్వంద్వరీతి సమాజాన్ని పతనం వైపు నడిపిస్తాయి. అందుకే సమాజం మేల్కొనాలి. రాజకీయాలు, మీడియా మారాలి.
– (వ్యాసకర్త: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్) డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్