ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ సమాజం నాటి పాలకుల అలసత్వంతో అణచివేతకు గురైంది. కరువు- కాటకాలతో భూములు బీళ్లు వారడం, అతివృష్టి-అనావృష్టి, ఆకలి, అప్పులు, దారిద్య్రం వెంటాడింది. మరోవైపు పంటకు కనీస గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వందల మీటర్ల లోతు వరకు బోర్లు వేసినా, బావులు తవ్వినా నీటి చుక్క దొరకని దుస్థితి. తెలంగాణ ఎడారిని మరిపించింది. ఆంధ్రా వలసవాద పాలనలో మన బతుకులేమిటో, మన గమనం ఏమిటో తెలియని అయోమయ పరిస్థితి.
ఈ నేపథ్యంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను చూసి ఆవేదన చెంది ఒక వేగుచుక్కలాగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వచ్చారు. తెలంగాణ భౌగోళిక, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అణచివేతలను వివిధ కోణాల్లో అధ్యయనం చేసి ఉద్యమ వ్యూహాలను రూపొందించుకోవడంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. చివరకు తన పదవులకు రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా టీఆర్ఎస్ను స్థాపించి, ప్రజలను ఉద్యమ పథంలో నడిపారు. చివరకు తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు.
తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ ఎంత నిబద్ధతతో పని చేశారో.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళికతో అంతే నిబద్ధతతో కృషి చేశారు. ఒకనాడు ఆంధ్రా పాలకులు వ్యవసాయం దండగ అన్న చోటే వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. మిషన్ భగీరథ, 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్తు, ఐటీ, పారిశ్రామికరంగాల్లో వృద్ధి, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కల్పన, కులవృత్తులకు చేయూత, ఆసరా పింఛన్లు అందజేశారు. దశాబ్దం పాటు కొనసాగిన కేసీఆర్ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయం గణనీయంగా పెరిగాయి. వినూత్న పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకొచ్చారు. కానీ, గత దశాబ్ద కాలంగా జరిగిన అభివృద్ధి 16 నెలల కాంగ్రెస్ పాలనలో తిరోగమనం చెందడం బాధాకరం.
శాంతియుతంగా సుదీర్ఘ కాలం పోరాటం చేసి, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన స్వరాష్ర్టాన్ని సాధించి, దశాబ్దం పాటు అధికారంలో ఉండి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో నడిపించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరుపుకొంటున్న వేళ దగాపడిన తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఈ రజతోత్సవ సభ మరో పోరాటానికి నాంది పలుకనున్నది.
-ప్రొఫెసర్ తాటికొండ రమేష్
(వ్యాసకర్త: పూర్వ వైస్ చాన్స్‌లర్, కాకతీయ యూనివర్సిటీ)