రాష్ట్రంలోని గురుకులాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. నిర్వహణ, పర్యవేక్షణలోపం వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయనడంలో సందేహం లేదు. ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం అందజేసే ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా ఆహారం కలుషితమైన సంఘటనలు చోటుచేసుకుంటుండటం, విద్యార్థులు మరణిస్తుండటం బాధాకరం. నారాయణపేట జిల్లా, మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ జరగడం వల్ల వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రతి గురుకుల విద్యాలయం లేదా హస్టళ్లలో విద్యార్థుల రక్షణ వ్యవస్థను ప్రభుత్యం ప్రాథమిక స్థాయిలోనే పటిష్ఠంగా ఏర్పాటు చేయగలిగితే ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉంటాయి.
గురుకులాల నిర్వహణలో ప్రభుత్వం ఒంటెత్తు పోకడ అనుసరిస్తూ తమ పంథాలోనే వెళ్తున్నది. ఉపాధ్యాయుల, విద్యావేత్తలు, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. గురుకులాల్లోని ఉపాధ్యాయులు స్థానికంగా ఉండటం లేదు. ఉపాధ్యాయుల జీతాలు, మామూలు డే స్కూల్ ఉపాధ్యాయుల జీతాల కన్నా తక్కువగా ఉంటున్నాయి. గురుకుల విద్యాలయాలను పర్యవేక్షించడానికి విద్యాశాఖకు సంబంధించి పర్యవేక్షణాధికారులు అందుబాటులో లేకపోవడం శోచనీయం. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడిగా వచ్చి మీడియా ముందు కనపడుతున్నారు.
ఇలాంటి ఘటనలు జరగకుండా, నివారించడానికి ముందస్తుగా ఏ మాత్రం ప్రయత్నాలు జరగడం లేదు. వీటన్నింటి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకుల విద్యాలయాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లతో కలిపి ఈ ఏడాది విద్యార్థుల మరణాలు 48కి చేరాయి. ఇందులో 23 బలవన్మరణాలు, 8 అనుమానాస్పద ఘటనలు కాగా ఫుడ్ పాయిజన్తో నలుగురు మృతి చెందారు. అనారోగ్యంతో 13 మంది విద్యార్థులు చనిపోయారు. ఎస్సీ గురుకులాల్లో, ఇతర హాస్టళ్లతో కలిపి దాదాపు 886 మంది అస్వస్థతకు గురయ్యారు.
ప్రభుత్వం ఇకనైనా పై విషయాలను పరిగణనలోకి తీసుకొని, విద్యార్థుల సంరక్షణకు పాటుపడాలి. సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు అనుబంధంగా ప్రధానాచార్యుల పర్యవేక్షణలో వార్డెన్లను అందుబాటులో ఉంచాలి. వంటవాళ్లను ఇప్పటికీ కాంట్రాక్టర్లు నియమిస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వమే వాళ్లను నియమిస్తే, వారు భయం, బాధ్యతతో వ్యవహరిస్తారు. వంట సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యతను పర్యవేక్షణాధికారులు తీసుకోవాలి. సంబంధిత శాఖలలో ఉన్న సీనియర్ అధికారులనే ప్రభుత్వం పర్యవేక్షణాధికారులుగా నియమించాలి. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి డైట్చార్జీలు సకాలంలో రావడం లేదు, ప్రతి నెల విద్యార్థికి రావల్సిన కాస్మొటిక్ చార్జీలు సకాలంలో రావడం లేదు. వీటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాలి.
ప్రభుత్వంలో అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎందరో ఉన్నా, ఈ ఆధునిక సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులన్నా, ప్రభుత్వ ఉపాధ్యాయులన్నా చిన్నచూపు ఉన్నది. కొంతమంది ఉద్యోగులు నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడమే అందుకు కారణం. కాబట్టి గురుకులాల్లో పనిచేసే ఉద్యోగులు విధి నిర్వహణల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ప్రభుత్వం అధిక నిధులు కేటాయించకపోవడం, కాంట్రాక్టర్లకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం కూడా గురుకులాల సమస్యలకు ప్రధాన కారణాలు. గురుకుల పాఠశాలల నిర్వహణలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలి. అప్పుడే ఆహారంలో నాణ్యత పెరుగుతుంది.
ప్రైవేటు యాజమాన్యాలు భారీ మొత్తంలో స్కూల్ ఫీజులు వసూలు చేస్తుండటం కారణంగానే పేద విద్యార్థులు ప్రభుత్వ గురుకులాలను ఆశ్రయిస్తారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. అందుకే ప్రభుత్వం ఉచిత విద్య, హాస్టల్ సదుపాయాలను ప్రతి పేద విద్యార్థికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలోని సమస్యలు సత్వరమే పరిష్కారమై, వాటిలో విద్య, ఆహార నాణ్యత పెరుగుతుందని ఆశిద్దాం.
– సీవీవీ ప్రసాద్ 8019608475
(వ్యాసకర్త: విశ్రాంత ప్రధానాచార్యులు)