దేశంలోని ప్రజలకు ప్రభుత్వం ఇండియన్ సిటిజన్ కార్డులు జారీ చేయాలి. ఆ కార్డు ద్వారానే ఓటు హక్కును, పౌరసత్వ గుర్తింపును కలిగించాలి. లేకపోతే ప్రజలు తమ వద్ద ఉన్న వివిధ కార్డులను తాయెత్తుల్లా వేలాడదీసుకొని తిరగాల్సి వస్తుంది. చివరికి ఆ కార్డులన్నీ పౌరసత్వానికి సంబంధంలేని ప్లాస్టిక్ ముక్కలేనని పాలకులు చెప్తారు. డబ్భు తొమ్మిదేండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఇప్పుడు ప్రజలకు ఒక సమస్య వెంటాడుతున్నది. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన పాలకులు జాతిని ఉద్దేశించి ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రసంగాలు ఇస్తుంటారు. ప్రజలందరినీ దేశంతో అనుసంధానించేందుకు గాను, కోట్లాది రూపాయల వ్యయంతో జారీ చేసిన డిజిటల్ గుర్తింపు కార్డుల గురించి చెప్తూ ఉంటారు. కానీ నేడు ఆ గుర్తింపు అంశమే ప్రశ్నార్థకంగా మారింది.
ప్రస్తుతం దేశంలో పౌరుల వద్ద ఉన్న గుర్తింపు కార్డులు, ఆ పత్రాలు వర్షంలో కొట్టుకొనిపోయే చిత్తు కాగితాల వంటివనే భావన నెలకొన్నది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ తీవ్రరూపు దాల్చింది. వివరాల్లోకి వెళ్తే ఏడాది క్రితం బాంబే హైకోర్ట్ ఓ తీర్పు వెలువరించింది. చొరబాటుదారుడైన ఓ నిందితుడి బెయిల్‌ను తిరస్కరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధార్, పాన్, ఓటర్ కార్డులకు, పౌరసత్వానికి సంబంధం లేదని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్ట్ కూడా ఆధార్ విషయంలో ఇలాంటి తీర్పునే వెలువరించింది. అప్పట్నుంచే దేశ ప్రజల్లో పౌరసత్వంపై ఒక ఆందోళన మొదలైంది. భారతీయులు అని గుర్తింపుగా చెప్పుకోవడానికి, ఏది ఆధారం అనే ప్రశ్న ప్రజలను వెంటాడుతున్నది. తాజాగా పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశాంగశాఖ చేసిన ప్రకటన మరింత ఆందోళనకు కారణమైంది. పాస్‌పోర్ట్ కేవలం ప్రయాణపత్రం మాత్రమేనని, దానిని పౌరసత్వ గుర్తింపుగా పరిగణనలోకి తీసుకోలేమని విదేశాంగశాఖ తేల్చిచెప్పింది. ప్రభుత్వ ప్రకటనలో ఆంతర్యం, అంతరార్థం స్పష్టమవుతున్నది.
దేశంలో ప్రజలు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల వద్ద బారులుతీరి, బయోమెట్రిక్ వివరాలు సమర్పించి, పాస్‌పోర్ట్ పొందుతున్నారు. తాము భారతీయులుగా, దేశంలో తమకు ఓ స్థానం ఉందంటూ సగర్వంగా విదేశాలకు వెళ్తున్నారు. కానీ విదేశాంగశాఖ ప్రకటన చూస్తే, ఆ పాస్‌పోర్ట్ పౌరసత్వానికి గుర్తింపుగా పరిగణించలేమని చెప్తున్నారు. మరోవైపు ఆసక్తికరమైన అంశమేంటంటే భారత పౌరులకు పాస్‌పోర్ట్ జారీ చేస్తామని పాస్‌పోర్ట్ చట్టం పీఠికలో స్పష్టంగా పేర్కొని ఉన్నది. చట్టంలోని ప్రారంభ వ్యాఖ్యలు, చట్టం ఉద్దేశాన్ని తేల్చిచెప్పడం, నిర్వివాదాంశం. అయినప్పటికీ పౌరసత్వానికి పాస్‌పోర్ట్‌ను గుర్తింపుగా పరిగణించలేమని భారత పౌరులకు విదేశాంగశాఖ చెప్తున్నది. ఓ వైపు ఆధార్, పాన్ కార్డులు పౌరసత్వానికి గుర్తింపులు కాదని కోర్టులు చెప్పగా, దేశ ప్రజలు అత్యంత గొప్పదిగా భావించే పాస్‌పోర్ట్ కూడా ఆ ప్లాస్టిక్, డిజిటల్ టోకెన్లు, ఆధారాలకు సంబంధించిన డొల్ల పత్రాల కుప్పలా మారిపోయింది.
కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాల రాజధానుల్లో రాయబార కార్యాలయంలో అధికారులను నియమించినప్పుడు, వారికి దౌత్య పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తుంది. ఇందుకోసం వారి పాస్‌పోర్ట్‌లను ప్రాతిపదికగా పరిగణిస్తుంది. విదేశీ ప్రభుత్వాలు కూడా ఈ పాస్‌పోర్ట్‌లను గుర్తింపు కార్డులుగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఇతర పత్రాలను అడగవు. అంటే కేంద్రం ఆచరిస్తున్న విధానాలకు, చేస్తున్న ప్రకటనలకు మధ్య వైరుధ్యం కనిపిస్తున్నది.
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. భారతీయ పౌరులేనని నిరూపించుకోవడానికి ఓటర్ గుర్తింపు కార్డును ఆధారంగా సమర్పిస్తారు. అంతేకానీ ప్రత్యేకంగా పౌరసత్వ గుర్తింపు కార్డులను ఎవరూ అడగరు, వారు కూడా సమర్పించరు. మరి భారత పౌరసత్వానికి ఓటర్ గుర్తింపు కార్డ్, పాస్‌పోర్ట్ గుర్తింపు కార్డులు కావని చెప్తున్నారు. మరి ఎన్నికయిన ప్రజాప్రతినిధులు దేశం తరఫున మాట్లాడటానికి, చట్టాలను రూపొందించడానికి ఎలా అర్హులవుతారు? ప్రభుత్వం పాలకుల విషయంలో మాట్లాడకుండా పౌరుల నుంచి మాత్రం రుజువులు కోరుతున్నది. ప్రభుత్వం పౌరుల పట్ల అనుమానాస్పద దృష్టితో చూడటం సరికాదని విపక్ష నేతలు, విమర్శకులు మండిపడుతున్నారు. దేశ ప్రజలతో కేంద్రం ప్రమాదకరమైన ఆట ఆడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓటరు జాబితా సవరణ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో పౌరసత్వంపైనే ప్రశ్నలు వ్యక్తం చేయడం ద్వారా ప్రజల ప్రతిస్పందనను అడ్డుకొనేందుకు విదేశాంగశాఖ జోక్యం చేసుకొన్నట్టుగా కనిపిస్తున్నదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పౌరసత్వ గుర్తింపునకు సంబంధించిన ప్రకటన విదేశాంగశాఖ నుంచి కాకుండా, హోంశాఖ నుంచి వెలువడితే బాగుండేదని ప్రభుత్వంలోని కొందరు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఏది ఏమైనా పౌరసత్వానికి గుర్తింపు ఏది? ఈ గందరగోళం ఎందుకు? అని ప్రజలు మండిపడుతున్నారు.
దేశంలో కేవలం 2.5 శాతం మంది మాత్రమే పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్నారు. మరోవైపు బయోమెట్రిక్ అనుసంధానంగా కేంద్రం జారీ చేసిన ఆధార్ కార్డుల కోసం రూ.12,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఇప్పుడు బ్యాంకింగ్, పన్నుల చెల్లింపు, ప్రయాణాలకు ఆధార్ తప్పనిసరి. అయినప్పటికీ పౌరసత్వం విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు, ఆధార్ వ్యవస్థ అసంబద్ధమైనదని కొట్టిపారేస్తున్నారు. మరోవైపు పదేండ్లకోసారి ప్రభుత్వం పౌరుల పట్టిక (సిటిజన్ ఆఫ్ రిజిస్టర్) 2011తర్వాత రూపొందించలేదు. ఎవరైనా భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు విదేశాల్లో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే వారి పాస్‌పోర్ట్ ప్రాతిపదికగా భారతీయులు అని నిర్ధారిస్తారు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి ప్రాతిపదికగా చూడలేమని అంటున్నది. ఇలాంటి నేపథ్యంలో విదేశాల్లోని అధికారులు, కంపెనీలు అదనపు పత్రాలను సమర్పించాల్సిందిగా భారతీయులను కోరే పరిస్థితి ఏర్పడవచ్చు.
దేశంలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో అస్పష్టతను కలిగించడం కోసమే పౌరసత్వం అంశాన్ని పాలకులు తెరపైకి తెచ్చినట్టుగా కనిపిస్తున్నది. అయితే, ఈ సమస్యను పరిష్కరించాలి. అమెరికా, జర్మనీ తరహాలో పౌరసత్వ చట్టం కింద జాతీయత, ఓటు హక్కు కోసం ఒకే గుర్తింపు కార్డు జారీ చేయాలి. ఈ సమస్యను చాలా దేశాలు ఎప్పుడో పరిష్కరించుకొన్నాయి. భారత్‌లోనూ పౌరసత్వ గుర్తింపు కార్డు పట్ల పాలకులు దృష్టి పెట్టాలి. లేకపోతే ఇప్పటివరకు ఉన్న కార్డులను తాయెత్తుల్లా వేలాడదీసుకొన్నా ఉపయోగం లేదు. పత్రాలన్నీ చిత్తుకాగితాలతో సమానంగా భావించాల్సి ఉంటుంది. 79 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో ఎవరు పౌరులు? అనే ప్రశ్నకు సమాధానం లేదు. ప్రస్తుతానికి నేను ఓటర్ను, ఇక భవిష్యత్తు సంగతి తెలియదు.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో)
ప్రభు చావ్లా