విశ్వాస పునరుద్ధరణ అనేది దావోస్‌లో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక 54వ వార్షిక సమావేశాల ప్రధానాంశం. జనవరి 15 నుంచి 19 వరకు జరుగుతున్న ఈ సమావేశాలు విశ్వాస కృషికి సంబంధించిన పారదర్శకత, సుస్థిరత, జవాబుదారీ వంటి మౌలిక సూత్రాలపై దృష్టి సారించేందుకు అవకాశం కల్పిస్తాయి. గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2024 ఈ సంప్రదింపులకు ముఖ్యమైన ప్రాతిపదికగా ఉంటుంది. మంచు కప్పబడిన అందమైన కొండలతో అలరారే దావోస్ పట్టణంలో విశ్వనేతలకు పలు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి.
2023 ఘటనల వైపు ఓసారి తిరిగి చూసుకుంటే సూడాన్ మొదలుకొని గాజా, ఇజ్రాయెల్ వరకు తీవ్రస్థాయి ఘర్షణల మధ్య చిక్కుకున్న నిస్సహాయ జనాలు, రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు, కరువులు, వరదలు, అడవిమంటల వంటి సమస్యలు ప్రముఖంగా కనిపిస్తా యి. అనేక దేశాల్లో సామాజిక అసమ్మతి రాజుకుంటున్నది. సమాజంలో చీలికలు (తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం), హింసాత్మక నిరసనలు, అల్లర్లు, సమ్మెల రూపంలో అవి పదే పదే వార్తలకెక్కడం మనం చూస్తున్నాం. 2024 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే (జీఆర్పీఎస్) 2023-24 మన ముందుకువచ్చింది. ఆర్థిక, పర్యావరణ, భౌగోళిక-రాజకీయ సామాజిక, సాంకేతికరంగాలు రాబోయే రోజుల్లో ఎదుర్కోబోయే పలురకాల ముప్పులపై అంచనాల ను అది వెల్లడించింది.
వచ్చే రెండేండ్లలో ప్రపంచ పరిస్థితి ప్రతికూలంగానే ఉంటుందని, పదేండ్లలో అది మరింతగా దిగజారుతుందని హెచ్చరించింది. ప్రపంచ నాయకులు, విస్తృతస్థాయిలో పౌర సమాజానికి ఈ నివేదిక ప్రమాద ఘంటికలను మోగించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. విశ్వవ్యాప్త అభిప్రాయ సేకరణ ఆధారంగా రూపొందిన ఈ రిస్క్ నివేదిక వాతావరణ మార్పు, జనా భా మార్పులు, సాంకేతికత, భౌగోళిక రాజకీయాలను ప్రపంచాన్ని ‘అస్థిరపరిచే నిర్మాణపరమైన శక్తులు’గా పేర్కొన్నది. నిజానికి ఈ సరికే వీటి ప్రభావం వందల కోట్ల మంది జీవితాలపై పడుతున్నది. అత్యంత ప్రతికూల వాతావరణం, కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా తయారవుతున్న తప్పుడు, దుష్ప్రచారాలు, జీవన వ్యయ సంక్షోభం, సైబర్ దాడులు, సామాజిక-రాజకీయ విభజనలను మనం ఎదుర్కొంటూనే ఉన్నాం.
దీర్ఘకాలిక ముప్పుల్లో పర్యావరణ ప్రమాదాలు తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నా యి. జీఆర్పీఎస్ అభిప్రాయ సేకరణలో పాల్గొన్నవారిలో మూడింట రెండొంతుల మంది విషమ వాతావరణ పరిస్థితులను ప్రధాన ముప్పుగా పేర్కొనడం గమనార్హం. 2024లో ఈ సమస్య విశ్వస్థాయిలో సరుకుల సంక్షోభాన్ని తెచ్చిపెట్టవచ్చని అంటున్నారు. ఎల్‌నినో వల్ల భూ తాపం మరింత పెచ్చరిల్లి ఈ ఏడాది మే వరకు కొనసాగుతుందంటున్నారు. వచ్చే రెండేండ్ల వరకు ఇదే తీవ్రమైన ముప్పుగా ఉంటుంది. గతేడాది ర్యాంకింగ్స్ లాగే అన్నిరకాల పర్యావరణ సమస్యలు దీర్ఘకాలిక ముప్పుగా కొనసాగే పరిస్థితులూ కనిపిస్తున్నాయి.
పెరుగుతున్న సామాజిక విభజనలు, అదుపులోకి రాని సాంకేతిక ముప్పులు సత్యంపై ఒత్తిడి తెస్తున్నాయి. వర్తమానంలో, అలాగే రెండేండ్ల వ్యవధిలోనూ, దీర్ఘకాలికంగానూ ప్రపంచం ఎదుర్కోబోయే మూడు అగ్రస్థాయి ముప్పుల్లో ఇది కూడా ఉంది. దీంతోపాటే సామాజిక విభజన, ఆర్థిక పతనం అనేవి పరస్పర ఆధారితంగానూ, తద్వారా ప్రభావశాలి ముప్పులుగానూ గుర్తింపబడుతున్నాయి. అనే క ఇతర ముప్పులకు ఇవి చోదకశక్తులుగా పనిచేస్తాయి. అదే సమయంలో పర్యవసానాలుగానూ ఉండొచ్చు. ప్రజా ప్రయోజనాలు కాకుండా వాణిజ్యపరమైన ప్రోత్సాహకాలు, భౌగోళిక రాజకీయ అవసరాలు కృత్రిమ మేధ, ఇతర అధునాతన సాంకేతికత అభివృద్ధిలో ప్రాథమిక అంశాలుగా కొనసాగితే అధిక ఆదాయ, అల్పాదాయ దేశాల మధ్య డిజిటల్ అగాథం తీవ్రమైపోతుంది. దీనివల్ల సంబంధిత ప్రయోజనాల పంపిణీలో తీవ్ర వ్యత్యాసాలు ఏర్పడి ఆర్థిక ఉత్పాదకత, రుణాలు, వాతావరణం, విద్య, ఆరోగ్య సంరక్షణపై ప్రభావం పడుతుంది.
తప్పుడు సమాచారం, దుష్ప్రచారం వచ్చే రెండేండ్లలో తీవ్రమైన ముప్పుగా ముందుకువచ్చింది. స్వదేశీ, విదేశీ శక్తులు సామాజిక, రాజకీయ చీలికలను మరింతగా పెంచేందుకు దీన్ని ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. ఇండి యా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్థాన్, బ్రిటన్‌తో సహా పలు దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్నాయని రిస్క్ నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. వీటిలో 300 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. తప్పుడు ప్రచారాలు వాటి పంపిణీకి ఉపయోగించే సాధనాల వల్ల ఎన్నికైన ప్రభుత్వాల చట్టబద్ధత ప్రశ్నార్థకమవుతుందని ఆ నివేదిక హెచ్చరించింది. దీనివల్ల తలెత్తే అసమ్మతి హింసాత్మక ఆందోళనలు, విద్వేష నేరాలు మొదలుకొని పౌర సంఘర్షణ, ఉగ్రవాదం దాకా రకరకాల రూపాల్లో వ్యక్తం కావచ్చు.
ఎన్నికల పరిధికి వెలుపల వాస్తవ సంబంధ భావనల్లో కూడా మరింతగా చీలికలు ఏర్పడవచ్చు. ప్రజారోగ్యం మొదలుకొని సామాజిక న్యాయం వరకు వివిధ అంశాలపై జరిగే ప్రజాచర్చలోనికీ ఈ చీలిక దూరిపోయే అవకాశం ఉంటుంది. సత్యాన్ని వెనుకతట్టు పట్టించడం జరిగితే స్వదేశీయంగా జనాభిప్రాయాన్ని నియంత్రించే ప్రచారం, సెన్సార్ ముప్పులు కూడా పెరుగుతాయని నివేదిక తెలిపింది. దుష్ప్రచార సమస్యకు ప్రతిస్పందనగా ప్రభుత్వాలు తాము నిర్ధారించుకున్న సత్యం ఆధారంగా సమాచార నియంత్రణకు మరింతగా అధికారాలను సంతరించుకునే ప్రమాదమూ ఉంటుందని గుర్తుచేసింది.
2024 అంచనాల్లో జీవన వ్యయ సంక్షోభం ప్రధానమైన ఆందోళనల్లో ఒకటిగా కొనసాగుతున్నది. ముఖ్యంగా అల్పాదాయ, మధ్యాదాయ వర్గాల ప్రజలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బలహీనమైన ఆర్థిక వ్యవస్థలపై ఇది తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి కలిగిస్తుంది. ధరల పెరుగుదల, ఆర్థిక కుంగుబాటు రెండేండ్ల కాలంలో పది రిస్క్ ర్యాంకింగ్‌లలో స్థానం సంపాదించుకున్నాయి. సమీప భవిష్యత్తులో ఈ పరిస్థితి మారే సూచనలూ కనిపించడం లేదు. సరఫరా సంబంధం ధరల పరిస్థితిపై రాబోయే రెండేండ్ల పాటు ఎల్‌నినో మొదలుకొని యుద్ధాల దాకా పలు ఒత్తిడులు కొనసాగుతాయి. వడ్డీ రేట్లు సాపేక్షంగా పైస్థాయిలోనే కొనసాగితే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, రుణవలయంలో చిక్కుకున్న దేశాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. దీనివల్ల ఆర్థిక అస్థిరతలు ఏర్పడుతాయని నివేదిక అంచనా వేసింది.
భవిష్యత్తులో ఏర్పడే పరిపాలనాపరమైన సవాళ్లు అంతర్జాతీయ రం గంలో వివిధ అధికార కేంద్రాల మధ్య, అలాగే ఉత్తరార్ధ, దక్షిణార్ధ దేశాల మధ్య దూరాన్ని మరింతగా పెంచే అవకాశం ఉంటుంది. దీనివల్ల అంతర్జాతీయ యంత్రాంగాలు స్తంభించిపోయి ప్రధాన శక్తుల ఏకాగ్రత, వనరులను తక్షణ ప్రపంచ సమస్యల నుంచి మళ్లించాల్సి రావచ్చు. రాజ్య దుర్భలత చోదకంగా, ఉత్పాదకంగా యుద్ధం ఓ అగ్రస్థాయి ముప్పుగా ముందుకువచ్చింది. ఇది రెండేండ్లు కొనసాగే సూచనలున్నాయి.
అంతిమంగా, చీలికలైపోయిన, కల్లోలిత ప్రపంచంలో దేశల మధ్య సహకారం అనేది తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. రాబోయే దశాబ్ద కాలం గణనీయమైన మార్పులకు వేదిక కాబోతున్నది. మన సర్దుబాట్ల సామర్థ్యం గరిష్ఠ స్థాయిలో పరీక్షకు గురవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రపంచ ముప్పులపై అవసరమైన చర్యలు తీసుకొని, విశ్వాస పునరుద్ధరణ దిశగా అడుగులు వేయడం అనేది ప్రపం చ దేశాధినేతలకు, పౌర సమాజానికీ తీవ్రమైన సవాలుగా ఉంటుందని చెప్పవచ్చు.
(వ్యాసకర్త: మాజీ ఎమ్మెల్యే)
డాక్టర్ చెన్నమనేని రమేశ్