ప్రజా సంక్షేమ రాజ్యానికి ఆరోగ్యం వెన్నెముక వంటిది. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఉచిత, నాణ్యమైన వైద్యం అందించాలనే గొప్ప ఆశయంతో మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులు ఈ పథకానికి జీవనాడి లాంటివి. కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఆర్ఏహెచ్సీటీ) నుంచి నెలల తరబడి బకాయిలు చెల్లించకపోవడంతో దవాఖానలపై ఆర్థిక భారం విపరీతంగాపెరిగిపోయింది.
తెలంగాణలోని 360కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఏఎన్హెచ్ఏ) ప్రకారం.. ఆసుపత్రులకు రావాల్సిన బకాయిలు రూ.1,3001,400 కోట్లు. ఈ బకాయిలు ఆసుపత్రులను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉండవు. ఒకవేళ ఉన్నా అవి తట్టుకోగలవు. కానీ, జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యస్థాయి ఆసుపత్రులు (100200 పడకల సామర్థ్యం) ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఇలాంటి చిన్నచిన్న దవాఖానలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. సిబ్బందికి సకాలంలో జీతాలు ఇవ్వలేక, మందులు, వైద్య సామాగ్రి సరఫరాదారులకు చెల్లింపులు చేయలేక సతమతమవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే కనీసం అత్యవసర సేవలను కూడా నిర్వహించలేని దుస్థితి నెలకొన్నది.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడం లేదా రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగడం ఖాయం. అదే జరిగితే లక్షలాది మంది పేద రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఈ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ బిల్లుల విషయంలో సమస్య రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో కూడా ప్రైవేట్ ఆసుపత్రులు 10 రోజుల పాటు సమ్మె చేశాయి. నాడు ఆరోగ్యశాఖ ఇచ్చిన హామీలతో సమ్మె విరమణ జరిగింది. అయితే, ఏడు నెలలైనా ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని టీఏఎన్హెచ్ఏ నాయకులు చెప్తున్నారు.
ఆరోగ్యశ్రీ చికిత్సల్లో 75 శాతం అందించేది జిల్లా ఆసుపత్రులే. అయినా వాటికి పెద్ద పెద్ద ఆసుపత్రుల కంటే తక్కువ నిధులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో నిధుల పంపిణీలో న్యాయం జరగాలని, పెరుగుతున్న లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా బడ్జెట్ పెంచాలని, సకాలంలో బకాయిలు చెల్లించాలని ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికైనా సర్కారు తన ప్రాధాన్యాలను గుర్తించాలి. బకాయిలను వెంటనే విడుదల చేయాలి. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా చికిత్స ప్యాకేజీలను సవరించాలి.
పరిపాలనాపరమైన ఆలస్యాలకు లేదా రాజకీయ ప్రాధాన్యతలకు ప్రజల ఆరోగ్యాన్ని బలి చేయకూడదు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే, ప్రైవేట్ ఆసుపత్రులు కుప్పకూలడమే కాదు, లక్షలాది పేద కుటుంబాల ప్రాణాలను రక్షించే వైద్య సేవలను కోల్పోవాల్సిన దుస్థితి తలెత్తుతుంది. ఆరోగ్యశ్రీ పథకం ఆరోగ్య సంరక్షణలో సమానత్వం కోసం పుట్టింది. ఇప్పుడు ఆ కల ఆర్థిక నిర్లక్ష్యమనే భారం కింద నిర్వీర్యమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. ఎందుకంటే ఆలస్యమయ్యే కొద్దీ మరొక రోగికి చికిత్స అందకుండా పోతుంది. మరో కుటుంబం అప్పుల్లో మునిగిపోతుంది.
– (వ్యాసకర్త: మాజీ అధ్యక్షుడు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్- తెలంగాణ)
డాక్టర్ బీఎన్ రావు