భారతదేశ రాజకీయ చరిత్రలో అదొక (ఎమర్జెన్సీ) చీకటి కోణం. రాజ్యాంగమే కల్పించిన ఒకానొక వెసులుబాటుకు పాలకుల స్వార్థచింతన తోడైనప్పుడు జరిగిన విధ్వంసాలకు, దేశ ప్రజలు ఎదుర్కొన్న తీవ్రమైన నిర్బంధకాండకు నేను ప్రత్యక్ష సాక్షిని. ప్రతిపక్షాలు, ప్రజాస్వామికవాదులు, పౌరహక్కుల ప్రేమికులు, ప్రజా ఉద్యమకారులు వేలమంది ఈ నిర్బంధాలను ఎదుర్కొని జైళ్లలో మగ్గిపోయారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ ఎత్తుగడలతో ఎమర్జెన్సీని అమలుచేస్తే, ఆమె చిన్న కుమారుడు సంజయ్ గాంధీ చేసిన ప్రజాస్వామిక వ్యతిరేక పనులు దేశంలో భీతావహపరిస్థితిని కల్పించాయి. ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటే, అప్పుడప్పుడే ఆరంభమైన నా విప్లవోద్యమ తొలి అడుగులు జ్ఞాపకం వస్తాయి. నాపై ప్రయోగించిన చిత్రహింసలు ఆ చీకటి రోజులకు తార్కాణంగా నిలుస్తాయి. ఎమర్జెన్సీ కాలపు దుర్మార్గాలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న నేను, నాటి నా అనుభవాలను పంచుకోవడం చారిత్రక అవసరం.
1970లో మా పక్క గ్రామమైన పర్లపల్లి హైస్కూల్లో నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు ప్రధానోపాధ్యాయులుగా బదిలీపై వచ్చిన ఆకుల లింగయ్య నా జీవితాన్ని గొప్ప మలుపు తిప్పారు. అభ్యుదయ భావాలు కలిగిన లింగయ్య, కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల అవగాహన కూడా ఉన్న వ్యక్తి. నాకు తెలియకుండానే నా లోపల విప్లవ బీజాలు నాటిన మేధావి ఆయన. శ్రీశ్రీ సాహిత్యా న్ని నాకు తొలిసారిగా అందించి, ఆకర్షణకు లోనుచేశాడు. అంతేకాదు, పిలుపు (మాసపత్రిక), మహాప్రస్థానం, రెక్కవిప్పిన రెవల్యూషన్, భవన్స్ జర్న ల్, రీడర్స్ డైజెస్ట్, సృజన లాంటి పుస్తకాలు ఇచ్చి చదువమని చెప్పారు. అవి చదువుతున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యేవాడిని. ప్రపంచాన్ని కొత్తకోణంలో చూస్తున్నానన్న భావన నాకు కలిగేది.
1973లో లింగయ్య కరీంనగర్లో ఉన్న బి.విజయ్‌కుమార్, పెండ్యాల సంతోష్ కుమార్‌లకు నన్ను పరిచయం చేస్తూ ‘ఇతను మీకు పనికివస్తాడు’ అని చెప్పాడు. ఆయన మాటలు నాడు నాకేమీ అర్థం కాలేదు. కానీ, వారితో సాన్నిహిత్యం పెరిగిన కొద్దీ, వాళ్లు అప్పటికే ఒక సిద్ధాంతాన్ని మోసే బాధ్యతలో ఉన్నారన్న విషయం కొద్దికొద్దిగా తెలియవచ్చింది. బి.విజయ్ కుమార్ ద్వారా మల్లోజుల కోటేశ్వరరావు, ముప్పాళ లక్ష్మణ్ రావు, చందుపట్ల కృష్ణారెడ్డిలు పరిచయమయ్యారు. అలా నా విప్లవ జీవిత ప్రస్థానంలో తొలుత కలిసి నడిచింది వీరితోనే.
1973లో కరీంనగర్ ఆర్ట్స్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యాను. అదే సమయంలో మల్లోజుల కోటేశ్వరరావు కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. భారతదేశ విప్లవోద్యమ చుక్కాని అయిన ముప్పాళ లక్ష్మణరావు కరీంనగర్ జిల్లాలోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. నల్ల ఆదిరెడ్డి, శనిగరపు వెంకటేశ్వర్లు (సాహు) జమ్మికుంట ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా, అల్లం నారాయణ మంథనిలో ఇంటర్మీడియట్ చేస్తున్నాడు. మా మొదటి కార్యాచరణ 1973, ఆగస్టు 15 నాడు ఆరంభమైంది. నాడు కరీంనగర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి జాతీయజెండా ఎగురవేసిన పిదప, డెమోక్రటిక్ స్టూడెంట్స్ పేరిట వేసిన ‘బూటకపు స్వాతంత్య్రాన్ని బద్దలు కొట్టండి’.. అన్న కరపత్రాన్ని పంచిపెడుతుండగా పోలీసులు అరెస్టు చేసి, కేసు పెట్టి కోర్టులో హాజరుపరచగా కోర్టు నన్ను బెయిల్‌పై విడుదల చేసింది.
ఆ కరపత్రం కమ్యూనిస్టు దృక్పథంతో ప్రజాస్వామ్యంలో గల లొసుగులను, బూటకపు ప్రజాస్వామ్య విధానాలను ఎండగట్టింది. ఆ తర్వాత తొలుత పౌరహక్కుల సమావేశాలు, జన నాట్యమండలి ప్రదర్శనలు, విరసం సాహిత్య కార్యకలాపాలు, డెమోక్రటిక్ స్టూడెంట్స్ పేరుతో విప్లవ సిద్ధాంతాల ప్రచారం కొనసాగిస్తూ, కరపత్రాలు పంపిణీ చేస్తూ, బహిరంగ కార్యకలాపాలను నిర్వహించేవాళ్లం. 1973లో కరీంనగర్‌కు వచ్చిన శ్రీశ్రీతో మున్సిపల్ గెస్ట్ హౌజ్‌లో జరిపిన సమాలోచనలు, శ్రీశ్రీతో కలిసి పట్టణ వీధుల్లో పౌరహక్కుల ప్రచారంతో ఊరేగింపు తీయడం, శ్రీశ్రీతో కలిసి కరీంనగర్, మందమర్రి, లక్షెట్టిపేట్, బెల్లంపల్లి, మంచిర్యాల మొదలైనచోట్ల నిర్వహించిన పౌరహక్కుల సంఘం సభలు క్రమంగా మ మ్మల్ని ఉద్యమంలో క్రియాశీలక స్థితికి తీసుకువచ్చాయి. 1975, ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగిన ఆర్ఎస్యూ ప్రథమ రాష్ట్ర మహాసభలు, 1975లోనే శ్రీశ్రీతో హుజురాబాద్‌లో జన సాహితి సాహిత్య సభ మొదలైన కార్యకలాపాలన్నీ మమ్మల్ని ఉద్యమానికి మరింత దగ్గర చేశాయి.
ఇట్లా బహిరంగ కార్యకలాపాలు కొనసాగుతున్న కాలంలోనే సుల్తానాబాద్ తాలూకా, సుల్తాన్పూర్ గ్రామంలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న ముప్పాళ లక్ష్మణరావు 1975, జూన్ 25 నాడు రైతుకూలీ సభను ఏర్పాటుచేశాడు. ఆ సభలో మల్లోజుల కోటేశ్వరరావు ప్రధాన వక్తగా పాల్గొన్నాడు. ఇదే సభలో ‘వీధి భాగోతం’ నాటికను ప్రదర్శించాం. ఇందులో భూపాల్ దొరగా, నల్ల ఆదిరెడ్డి దొర జీతగానిగా, నేను రైతు కూలీగా, కోటేశ్వరరావు పట్వారిగా నటించాం.
ఈ సభ రాత్రి 2 గంటల వరకు జరిగింది. సభను ముగించుకొని కరీంనగర్‌లోని షెల్టర్లకు చేరుకొనే సరికి రాత్రి మూడు గంటలైంది. ఈ సభ జరుగుతున్నప్పుడే అర్ధరాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఈ వార్తలు మాకు మరునాటి ఉదయం తెలిశాయి. ఈ ఎమర్జెన్సీ విధింపుతో అప్పటికే నిర్ణయమైన, జూన్ 26 నుంచి కరీంనగర్లో కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో మూడు జిల్లాల (కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్)కు చెందిన ముఖ్యమైన విప్లవకారుల కోసం నిర్వహించతలపెట్టిన రాజకీయ శిక్షణా తరగతులు వాయిదా పడ్డాయి.
కానీ, అప్పటికే మా కార్యకలాపాలపై నిర్బంధ ఛాయలు కమ్ముకుంటున్న తరుణంలో ఎమర్జెన్సీ విధించడంతో, నేను శత్రువు బారినుంచి తప్పించుకోవడానికి, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి, ప్రజల వద్దకు వెళ్లి పనిచేయడానికి అండర్ గ్రౌండ్‌కు వెళ్లాలని కొండపల్లి సీతారామయ్య (కేఎస్) నిర్ణయించారు. ఎప్పటికైనా విప్లవాన్ని విజయవంతం చేయడానికి, ప్రజాసైన్యాన్ని ఏర్పాటుచేసి, సాయుధ పోరాటం నిర్మించడానికి అజ్ఞాతవాసంలోకి వెళ్లవలసిందే. కానీ, శత్రువు ఆ సమయాన్ని ఇంత త్వరగా ఇస్తాడనుకోలేదని ప్రకటించి ముఖ్య నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లి, అప్పటికే ఉద్యమం బలంగా ఉన్న కొన్ని గ్రామాల్లో రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకొని, విప్లవ కార్యక్రమాలు కొనసాగిస్తూ జిల్లాలోని పలుచోట్ల భూస్వాముల ఆగడాలను అరికట్టాం. ఈ రకంగా ఎమర్జెన్సీ నిర్బంధం అమలవుతున్న కాలంలో అండర్ గ్రౌండ్లో కొనసాగుతూ, ప్రజల్లో పనిచేస్తూ ఉండటం జరిగింది.
అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఒక రోజు నేను మానకొండూర్ మండలం ముంజంపల్లిలోని ఒక ఇంట్లో షెల్టర్ తీసుకుంటుండగా 1976, నవంబర్ 11న పోలీసులు నన్ను అరెస్టు చేసి ధర్మపురి పోలీస్‌స్టేషన్‌కు తరలించి, ‘ఇన్నిరోజులు ఎక్కడెక్కడున్నావు, ఏమేం చేశావు, మీ ముఖ్య నాయకుల ఆచూకీ ఎక్కడ’ అంటూ రహస్యాలు చెప్పమని ఆ రోజు రాత్రంతా చిత్రహింసలకు గురిచేశారు. రోకలిబండలెక్కించి దారుణంగా కొట్టారు.గోళ్ళల్లో సూదులు గుచ్చారు. పట్టాతో వీపును పచ్చడిచేశారు. అయినా నేను నోరు విప్పకపోవడంతో, చివరికి వీపుపై పెట్రోల్ పోసి కాల్చారు. ఆ మచ్చ ఇప్పటికీ ఆ చీకటి రోజును గుర్తుచేస్తుంది.
స్పృహ తప్పి పడిపోయిన నేను చనిపోయిన్ననుకొని నన్ను పోలీస్‌స్టేషన్‌లో పాతిపెట్టేందుకు బొందను కూడా తవ్వారు. ఆ తర్వాత బతికే ఉన్నానని తెలుసుకున్న పోలీసులు 2వ రోజు జగిత్యాల పోలీస్‌స్టేషన్ లాకప్‌లో ఉంచారు. అప్పటికే ఆ స్టేషన్ లాకప్‌లో అల్లం నారాయణ, పోరెడ్డి వెంకటరెడ్డి, బి.విజయకుమార్ ఇంకా కొంతమంది ఉన్నారు. తర్వాత కరీంనగర్, ధర్మపురి, చిల్వకోడూర్, కోరుట్ల పోలీసు స్టేషన్లకు తిప్పుతూ దుర్మార్గమైన చిత్రహింసలను కొనసాగించారు. చివరికి కోరుట్ల పోలీసుస్టేషన్లో కాళ్లకు బేడీలు వేసి, గొలుసులతో బంధించి, 6 నెలలు నిర్బంధంలో ఉంచారు. 1977, ఏప్రిల్‌లో కేంద్రం లో జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఎమర్జెన్సీని ఎత్తివేయడంతో కోరుట్ల పీఎస్‌లో ఉన్న నన్ను, అల్లం నారాయణ, పోరెడ్డి వెంకటరెడ్డి, మల్ల రాజిరెడ్డి, తాటికొండ సుధాకర్ రెడ్డి తదితరులను జగిత్యాల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మమ్మల్ని వరంగల్ సెంట్రల్ జైలుకు పంపించింది. ఆ తర్వా త ఆగస్టులో నేను బెయిల్‌పై విడుదలయ్యాను.
ఎమర్జెన్సీ అఘాయిత్యాల మీద వేసిన షా కమిషన్ ముందు హాజరై, అదేవిధంగా రాష్ట్రస్థాయిలో వేసిన భార్గవ కమిషన్ ఎదుట హాజరై అఫిడవిట్లు ఇచ్చాను. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ యథావిధిగా విప్లవ కార్యక్రమాలు కొనసాగించాను.
ఎమర్జెన్సీ కంటే ముందు భూమయ్య, కిష్టాగౌడ్‌లకు పడిన ఉరిశిక్షను రద్దుచేయాలని రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అనేక నిరసనలలో భాగంగా మేము కూడా మిగతా వారితో కలిసి కరీంనగర్ ఊరేగింపుల్లో పాల్గొన్నాం. దేశవ్యాప్తంగా అనేకమంది పౌర హక్కుల సంఘాల వాళ్లు ఈ ఉరిశిక్షను రద్దుచేయాలని పిలుపునిచ్చారు. అయితే ఎమర్జెన్సీ కాలంలో భూమయ్య, కిష్టాగౌడ్‌లను ఉరి తీయడం ఎమర్జె న్సీ చీకటి కోణానికి చిహ్నంగా భావించవచ్చు. ఈ ఎమర్జెన్సీ కాలంలో ఎంతోమంది విప్లవకారులు, సామాజిక ఉద్యమకారులు, పౌరహక్కుల సంఘా ల కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు తీవ్ర నిర్బంధాలను ఎదుర్కొని, జైలు జీవితాన్ని గడిపారు. కాలమేదైనా, పౌర సమాజం మెలకువతో ఉంటేనే ఇలాంటి నిర్బంధ చట్టాలు పునరావృతం కాకుం డా ఉంటాయి. ఇలాంటి చీకటి రోజులు తిరిగి రాకూడదంటే, రేపటి తరం సామాజిక చైతన్యంతో మెలగవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
– (వ్యాసకర్త: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ) నారదాసు లక్ష్మణ్‌రావు