వేగంగా అభివృద్ధి సాధించాలన్న లక్ష్యాలు, ప్రపంచీకరణ, పారిశ్రామికాభివృద్ధి కారణంగా ఇంధన వనరుల వినియోగం విపరీతంగా పెరిగి భూతాపం సమస్య తీవ్రమవుతున్నది. జీవవైవిధ్యం దెబ్బతింటున్నది. దీనిని అరికట్టటానికి ఇంధన వినియోగంలో పొదుపును పాటించాలి. ఇది మన వ్యక్తిగత జీవితంపైనే కాదు పర్యావరణంపైనా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
ఆధునిక మానవుడి జీవితం పూర్తిగా పెట్రోల్, డీజిల్, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలతో ముడిపడిపోయింది. వీటి వినియోగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం వైపు మళ్లాల్సిన అవసరం ఉంది. మనవంతుగా మెరుగైన మైలేజీని ఇచ్చే చిన్న వాహనాన్ని నడపడం, హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ వాహనాన్ని వాడటం, ప్రజా రవాణాను ఉపయోగించుకోవడం, సైకిల్ తొక్కడం, దగ్గరి ప్రాంతాలకు నడిచి వెళ్ళటం వంటివి అలవాటు చేసుకుంటే మంచిది. అలాగే, లైట్లను అవసరం ఉన్నంత వరకే వాడడం, విద్యుత్ ఉపకరణాలు, ఛార్జర్లు ఉపయోగంలో లేని సమయంలో అన్‌ప్లగ్ చేయడం, ఎల్ఈడీ బల్బ్‌లు వాడడం ద్వారా ఇంధనాన్ని పొదుపు చేయవచ్చు.
‘ఇంధన పరిరక్షణ సవరణ బిల్లు-2022’కు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. నిర్దేశింపబడిన విద్యుత్ వినియోగదారులు తమ ఇంధన అవసరాల కోసం కొంతభాగాన్ని శిలాజ రహిత వనరుల నుంచి అంటే పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను కచ్చితంగా వాడాలని ఈ బిల్లు నిర్దేశిస్తున్నది. 100 కిలోవాట్లను మించి విద్యుత్‌ను వాడే భవనాలకు కూడా ఇది వర్తిస్తుంది. మన దేశంలో తప్పనిసరి ‘ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్’ (ఈసీబీసీ)ని అమలు చేస్తున్న రాష్ర్టాలలో తెలంగాణ ఒకటి. ఆన్లైన్ బిల్లింగ్ అప్రూవల్ సిస్టమ్ ద్వారా తప్పనిసరి సమ్మతిని పొందుపరచడంలో, ఆచరణాత్మకంగా దానిని విజయవంతంగా అమలు చేయడంలో దేశంలోనే మొదటిది. తెలంగాణలో వెయ్యి చదరపు మీటర్ల కంటే ఎక్కువ ప్లాట్ ఏరియా లేదా 2000 చదరపు మీటర్ల బిల్ట్ అప్ ఏరియా ఉన్న వాణిజ్య భవనాలు, ఇతర నివాసేతర భవనాలకు ఈసీబీసీ వర్తిస్తుంది.
సమర్థవంతమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగించటం వల్ల 2050 నాటికి ఏటా 550 మిలియన్ మెట్రిక్ టన్నుల కర్బన కాలుష్యాన్ని తగ్గించవచ్చునని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇంధన ఖర్చులను, గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించడానికి ఇంధన పరిరక్షణ అనేది ఒక గొప్ప మార్గం. ఎలక్ట్రిక్ గ్రిడ్‌లో మరింత గ్రీన్ఎనర్జీని ఉపయోగించడం వైపు మన సమాజం నెమ్మదిగా పురోగమిస్తున్నది.
దేశంలోనే మున్సిపాలిటీల ఇంధన సామర్థ్యంలో తెలంగాణ 1వ స్థానంలో, క్రాస్ సెక్టార్లలో 2వ స్థానంలో, రవాణాలో 3వ స్థానం, పరిశ్రమల్లో 4వ స్థానం, వ్యవసాయంలో 7వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా వీధిదీపాల నిర్వహణ కార్యక్రమం ఆడిట్లో తెలంగాణ మంచి గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ‘ఇంధన వనరుల పరిరక్షణ’లో తెలంగాణ అగ్రగామిగా నిలబడింది. రాష్ట్ర ప్రజలు కూడా తమ వంతు కృషి చేయాలి. 24 గంటల ఉచిత విద్యుత్‌ను పొందుతున్న రైతులు విద్యుత్‌ను పొదుపుగా వాడాలి. నీరు, విద్యుత్ ముఖ్యమైన ఇంధన వనరులు, ఈ రెండింటిని పొదుపుగా వాడాలి. రాష్ట్ర ప్రభుత్వం రైతులు వినియోగిస్తున్న విద్యుత్‌కు గాను, రైతుల పంటలకు ఎత్తిపోతల ద్వారా అందిస్తున్న నీటి కోసం సంవత్సరానికి10 ,000 కోట్లు డిస్కములకు ఏటా చెల్లిస్తుంది. ఉచితంగా వస్తున్నాయని ఆ వనరులను వృధా చేయకుండా పొదుపుగా వాడితే పర్యావరణాన్ని రక్షించిన వారమవుతాము.
ఈ నెల 14 నుంచి 20 వరకు జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలు జరుపుకొంటున్న సందర్భంలో రాష్ట్రంలో ఉన్న అన్ని కేటగిరీల విద్యుత్ వినియోగ దారులు ఇంధన పొదుపు పాటించాలి. 2070 నాటికి సున్నా శాతానికి కర్బన ఉద్గారాలు తగ్గించాలనే లక్ష్యాన్ని చేరే విధంగా ప్రతిఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలి. పునరుత్పాదక విద్యుత్ రంగంలో చేస్తున్న కృషికిగాను టీఎస్ రెడ్కోకు జాతీయస్థాయి అవార్డు లభించడం అభినందనీయం. ఇది మన అందరికీ స్ఫూర్తిదాయకం.
(వ్యాసకర్త: తన్నీరు శ్రీరంగారావు చైర్మన్, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్)