రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయినా ఎన్నికల ముందు పార్టీ ప్రకటించిన ‘చేయూత’ పథకం ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. పదేపదే కొత్త పెన్షన్ల గురించి ఊరించి, ఉరికించడం తప్ప ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు కాలేదు. కేసీఆర్ ప్రభుత్వం ‘ఆసరా’ పేరుతో అమలు చేసిన ఈ పథకం కింద 37,65,304 మందికి రూ.4,700 కోట్ల పెన్షన్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ పాలకులు చనిపోయిన ఆత్మలు, అనర్హులకు కూడా పెన్షన్లు యథాతథంగా పంచుతూ వచ్చారు. ఇది ప్రభుత్వ, అధికారుల వైఫల్యమేనని చెప్పక తప్పదు?
కొత్త పెన్షన్లపై లబ్ధిదారుల నుంచి, ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ప్రభుత్వం 2 లక్షల మందికి నూతన చేయూత పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. అందుకు రూ.233 కోట్ల ఖర్చును కూడా నిర్ధారించింది. అయినా పెన్షన్ల వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేయూత పథకం మంజూరు కోసం 12 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారులతో బేరీజు వేసుకుంటే ప్రభుత్వం మంజూరు చేస్తామని చెప్తున్న నూతన పెన్షన్లు 2 లక్షలు ఏమూలకూ సరిపోవు. చనిపోయిన వారిని తొలగించడం, కొత్త పెన్షన్లు మంజూరు చేయడం గత కొన్నేండ్లుగా ఆనవాయితీగా వస్తున్నది. అధికారులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు నిర్ధారణ చేసుకొని, విచారణ జరిపి, అర్హులైన తుది జాబితాలు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సిద్ధంగా ఉంచడం ఆనవాయితీ. ఇది రెగ్యులర్‌గా జరిగే తంతు! గత కొంతకాలంగా పెన్షన్లు ఇవ్వకపోయినా దరఖాస్తుల స్వీకరణ, విచారణ, క్రమబద్ధీకరణను అధికారులు యథాతథంగా కొనసాగిస్తూ అర్హుల జాబితాలు కంప్యూటరైజేషన్ చేసి ఉంచారు. కానీ, తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనను అనుసరించి మళ్లీ చేయూత పథకం కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చాక రెండు, మూడుసార్లు దరఖాస్తులు స్వీకరించారు. అంటే ఇప్పుడు మరోమారు దరఖాస్తుల జాతరకు తెరలేపారు. వాటి స్వీకరణ, విచారణ, ఎంపిక బాధ్యతలు 6.47 లక్షల స్వయం సహాయక మహిళలకు అప్పగిస్తామని పలువురు మంత్రులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. చేయూత పెన్షన్‌దారులు ఎక్కడ, ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలో అనే విషయంలో కూడా స్పష్టత లేదు? బాధ్యతతో కూడుకున్న అధికారుల కంటే ఎలాంటి అధికార జవాబుదారీతనం లేని వారితో విచారణ జరిపించడమంటే అవినీతికి, ఆశ్రితపక్షపాతానికి పరోక్షంగా తెరలేపినట్లే అవుతుంది.
చేయూత పెన్షన్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం విధించిన నిబంధనలు కూడా అంత ప్రామాణికంగా లేవు? ఒకవైపు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, తెల్లరేషన్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం, సంబంధిత అర్హత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోమని స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, లబ్ధిదారుల ఎంపికకు మరో పది రకాల నిబంధనలు పెట్టారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే లక్షా 50 వేల వార్షికాదాయం లోపు ఉన్నవారే చేయూత పెన్షన్లకు అర్హులట! అంటే రోజువారీ రూ.400-500 కూలీ, నాలీ చేసుకునే పేదలకు కూడా ఈ పథకం నిబంధన ప్రకారం వర్తించదు. అంతేకాదు, ఉమ్మడి కుటుంబంలో ఎవరికైనా కారు, ట్రాక్టర్ లాంటి ఫోర్ వీలర్ ఉన్నా కుటుంబ సభ్యులు పెన్షన్‌కు అనర్హులట. ఇక పల్లెల్లో మూడెకరాల భూమి ఉన్న కుటుంబంలో సంబంధిత వ్యక్తులకు ధృవపత్రాలన్నీ ఉన్నా అనర్హులేనట.
ఇక కుటుంబంలో ఏ ఒక్కరైనా సర్వీస్ పెన్సన్, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ తీసుకుంటున్నవారు ఉంటే ఆ కుటుంబంలోని సభ్యులు కూడా అనర్హులేనట? దివ్యాంగుల పెన్షన్ల విషయానికొస్తే గతంలో సదరం సర్టిఫికెట్ ఉంటే మానవీయ కోణంలో ఈ క్యాటగిరికి ఆదాయ పరిమితి చూడకుండా పెన్షన్లు మంజూరు చేసేవారు. కానీ ప్రస్తుతం వారికి కూడా ఈ ఎంపిక నిబంధనలు దాటి రావాలనడంలో అర్థం లేదు. దరఖాస్తు చేసిన దివ్యాంగులకు ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవు? కానీ, ‘కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా!’ అన్నట్లు చనిపోయిన దివ్యాంగుల భార్యలకు పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది. ఒంటరి మహిళలు, వృద్ధాప్య, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన హెచ్ఐవీ, బోదకాలు బాధితులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్‌ను అమాంతం పెంచుతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆర్థిక వెసులుబాటును సాకుగా చూపిస్తూ పెన్షన్ల పెంపు కూడా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు.
పెన్షన్లు పెంచడం అటుంచి వృద్ధ్యాప్య పెన్షన్‌కు వయస్సును 57 సంవత్సరాలకు తగ్గించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మద్యం, బెల్టుషాపులు విచ్చలవిడిగా పెరుగడం వలన తక్కువ వయస్సులోనే ఒంటరి మహిళల సంఖ్య విపరీతంగా పెరుగడం, శాశ్వత దివ్యాంగులు కాకుండా తాత్కాలికంగా ఎముకలు విరిగిన, వ్యాధులతో అవయవాలు కోల్పోయిన వారికి సైతం ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం వలన ఈ సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూ వచ్చింది.
చేయూత పెన్షన్ల పెంపు, మంజూరు జోలికి ప్రభుత్వం వెళ్లకపోవడం వలన ప్రస్తుతం అర్హులైన లబ్ధిదారులు, దరఖాస్తుదారుల సంఖ్య పెరిగి ఇప్పుడు 12 లక్షల వరకు చేరుకున్నది. ప్రస్తుతం ప్రభుత్వ పనితీరు చూస్తుంటే ఈ సమస్యను సాగదీస్తుందా? అనే అనుమానం లబ్ధిదారుల్లో గూడుకట్టుకుంటున్నది. మానవీయ దృక్పథంతో స్పందించాల్సిన అంశాల్లో అడ్డంకులు, జాప్యం అంత మంచిది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో పిల్లిమొగ్గలు మాని, ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తయి, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కంప్యూటరైజేషన్ చేసిన అర్హులకు పెన్షన్ మంజూరు చేయడం విచక్షణతో కూడిన నిర్ణయం అవుతుంది. కేవలం పెన్షన్ల్ల పైలాన్ల ఆవిష్కరణతో సరిపుచ్చడం కాకుండా అర్హులందరికీ పెన్షన్లు వెంటనే అందేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలి. నూతన చేయూత పెన్షన్ల మంజూరులో నెలకొన్న సంక్లిష్టతను తొలగించి, భేషజాలకు పోకుండా సమస్యను మానవీయకోణంలో తక్షణమే పరిష్కరించాలి.
– (వ్యాసకర్త: సామాజిక కార్యకర్త, రచయిత) ఎన్.తిర్మల్ 9441864514