కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల గుబులు పట్టుకున్నది. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతున్నది. ఈ నేపథ్యంలో ఆ పది స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం, దానికితోడు స్థానికసంస్థల ఎన్నికలకు హైకోర్టు విధించిన గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏం చేయాలో దిక్కతోచక కాంగ్రెస్ సర్కార్ కొట్టుమిట్టాడుతున్నది. ఎన్నికలకు వెళ్తే పరాభవం తప్పని పరిస్థితి. ఎన్నికలకు పోకుండా ఎంతోకాలం సాగదీయలేని దుస్థితి. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ దుస్థితి. అందుకే కుంటిసాకులు చెప్తూ స్థానిక ఎన్నికలను మరికొంత కాలం వాయిదా వేయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నది. అందులో భాగంగానే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో రాజ్యాంగబద్ధంగా, కోర్టు తీర్పుల ప్రకారం ఉన్న రిజర్వేషన్ల సీలింగ్‌ను ఎత్తివేసి చెత్త ఎత్తులు వేస్తున్నది. అది కూడా వర్కవుట్ కాదని తెలిసి, తాజాగా స్థానిక ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తున్నది.
వాస్తవానికి నిరుడు జనవరి 31తో గ్రామ సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. ఆ వెంటనే ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల పదవీకాలం కూడా ముగిసింది. కానీ, కాంగ్రెస్ సర్కారు మాత్రం స్థానిక ఎన్నికలు నిర్వహించలేదు. స్థానిక ఎన్నికల్లో ఎలాగూ ఓటమి తప్పదని గ్రహించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, పార్లమెంట్ ఎన్నికలకు ముందు రిస్క్ చేయడం ఎందుకని వెనుకడుగు వేయడమే అందుకు కారణం. అయితే, అప్పటి తాజా మాజీ సర్పంచ్‌లను అయినా ఆ పదవుల్లో కొనసాగించలేదు. గత సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 90 శాతానికి పైగా స్థానాల్లో గులాబీ జెండా ఎగురడమే అందుకు ప్రధాన కారణం. గులాబీ నేతలు సర్పంచ్‌లుగా ఉంటే, అప్పటికే బాగా ఆకలి మీదున్న కాంగ్రెస్ కార్యకర్తలు నిధులను బొక్కేందుకు కుదరదని రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ జెండాపై గెలిచిన సర్పంచ్‌లను కొనసాగించలేదు.
ఈ నేపథ్యంలోనే హస్తం కార్యకర్తలకు అనధికారిక హక్కులు కట్టబెట్టి, గ్రామ కార్యదర్శులకు పాలనా బాధ్యతలు అప్పగించారు. ఖజానా ఖాళీ అయ్యిందని, అప్పు పుట్టట్లేదని, లంకె బిందెలు లేవని చెప్తూ, చేతులెత్తేసిన రేవంత్‌రెడ్డి అప్పటి నుంచి గ్రామాలను గాలికివదిలేశారు. చిల్లిగవ్వ కూడా విదిల్చడం లేదు. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే, ఊర్లల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా పైసల్లేని దుస్థితి దాపురించింది. ప్రభుత్వం పైసా ఇవ్వకపోయినా కార్యదర్శులకు తప్పుతుందా? అందుకే, వారే అప్పులు చేసి మరీ గ్రామాల్లో చిన్నాచితకా పనుల కోసం సొంతంగా ఖర్చుచేయాల్సి వస్తున్నది. కొంతమంది కార్యదర్శులు సుమారు 5-7 లక్షల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీల్లో ఇలా కార్యదర్శులు ఖర్చుచేసిన మొత్తం సుమారు రూ.383 కోట్లు బకాయిలు ఉన్నట్టు ఒక లెక్క. ఈ బకాయిలను రేవంత్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వడ్డీల మీద వడ్డీలు పెరుగుతున్నాయి. మంచికి పోయిన కార్యదర్శులు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది.
మరోవైపు తాజా మాజీ సర్పంచులదీ ఇంకో వ్యథ. గతంలో గ్రామ ప్రథమ పౌరులైన వారు తమను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను సొంత డబ్బులు వెచ్చించి మరీ చేశారు. పల్లెప్రగతి, వైకుంఠధామాలు సహా వివిధ పనుల కోసం వారు వెచ్చించిన బిల్లులు సుమారు రూ.600-700 కోట్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అప్పుల భారం ఎక్కువై కొందరు తనువు చాలిస్తున్నా, రేవంత్ ప్రభుత్వానికి మనసు కరగడం లేదు.
1992లో చేసిన 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతి ఐదేండ్లకు కచ్చితంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఓటమి భయంతో ఎన్నికలకు వెళ్లేందుకు జంకుతున్నది. గత 19 నెలలుగా స్థానికం ఎన్నికలను చూసి పారిపోతున్నది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెలు ఓ వెలుగు వెలిగాయి. గ్రామజ్యోతి పథకంలో భాగం గా కేసీఆర్ సర్కార్ గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటుచేసి మౌలిక వసతులు కూడా కల్పించిం ది. ప్రతి నెల రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు రూ.180 కోట్లను ప్రత్యేకంగా, నేరుగా కేసీఆర్ సర్కారు విడుదల చేసేది. ఆ నిధులకు తోడు ఇతర ఫండ్స్ కూడా మంజూరు చేసేది. అన్నీ కలిపి గత తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. కానీ, ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోవడం లేదు. నిధులు లేక పల్లెలు కునారిల్లుతున్నాయి.
గ్రామాలకు పాలకమండళ్లు లేకపోవడంతో నెలనెలా రావాల్సిన రూ.180 కోట్ల నిధులు నిలిచిపోయాయి. 15వ ఆర్థికసంఘం నిధులు గత 19 నెలలుగా సుమారు రూ.2,700 కోట్లు మురిగిపోయాయి. అలాగే రాష్ట్ర ఆర్థికసంఘం నుంచి రావాల్సిన రూ.1,560 కోట్లు కూడా నిలిచిపోయాయి. అదే సకాలంలో ఎన్నికలు నిర్వహించి ఉంటే, ఈ నిధులు గ్రామాలకు దక్కేవి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్వాకం వల్ల మన పల్లెలు వేల కోట్లు నష్టపోయాయి.
సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి గతంలో హైకోర్టు మొట్టికాయలు వేసింది. అయినా కాంగ్రెస్ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఓటర్ల జాబితా ఫైనలైజ్ చేయడం, వార్డుల వారీగా, మహిళా రిజర్వేషన్ల ఖరారు అంటూ ఎన్నికల సంఘం ఓ వైపు ఏర్పా ట్లు చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికలను ఎలా వాయిదా వేయాలా? అని ఆపసోపాలు పడుతున్నది. అం దుకు వారికి దొరికిన సాకు బీసీ రిజర్వేషన్లు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశం లేకపోవడంతో మొన్నటివరకు నాటకాలాడి, ఇప్పుడు ఏకంగా రిజర్వేషన్ల సీలింగ్‌ను ఎత్తివేసింది. ఇది చట్టవ్యతిరేకమని, న్యాయ సమీక్షకు నిలబడదని కూడా కాంగ్రెస్‌కు తెలుసు. అయినా జిత్తుల ఎత్తు లు వేస్తున్నది. ఇది కూడా పనిచేయకపోతే, కష్టమని గ్రహించి ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం కావాలని హైకోర్టును అభ్యర్థిస్తూ, గ్రామపంచాయతీలను మభ్యపెడుతున్నది కాంగ్రెస్.
ఇప్పటికే హామీలు ఎగ్గొట్టిన కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా యూరియా దొరక్క రైతులు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై పీకల వరకు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదని తెలిసే కాంగ్రెస్ డ్రామాలు చేస్తున్నది. ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్నికల వాయిదా కోసం పాట్లు పడినా, పల్లె సాక్షిగా హస్తం విరగడం ఖాయం.
– (వ్యాసకర్త : బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు)
చాడా సృజన్ రెడ్డి