‘ముందు దగా వెనుక దగా కుడి ఎడమల దగా దగా’.. మహా కవి శ్రీశ్రీ చెప్పిన మాటలు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు సాయం, కౌలు రైతులకు సాయం, ప్రతి పంటకు బోనస్ లాంటి ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది.
ఏడాది కాలంగా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉన్నది. రూ. 2 లక్షల రుణమాఫీని డిసెంబర్ 9న మొదటి సంతకంతో ప్రారంభిస్తానని చెప్పి మాట తప్పి రేవంత్ సర్కారు మోసం చేసింది. రుణమాఫీపై నాన్చివేత వైఖరిని బీఆర్ఎస్ గట్టిగా ఎండగట్టడంతో దిగొచ్చిన ప్రభుత్వం ఆగస్ట్ 15 లోగా పూర్తి చేస్తామని రాష్ట్రంలోని అందరి దేవుళ్లపైనా ఒట్టు వేసి ప్రజల సెంటిమెంట్‌ను వాడుకొని పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కింది. హరీశ్‌రావు సవాలు తర్వాత రుణమాఫీకి సవా లక్ష కండిషన్లు పెట్టడంతోపాటు రూ. 31 వేల కోట్లకు కుదించి, బడ్జెట్లో రూ. 26 వేల కోట్లు ప్రతిపాదించి కేవలం రూ. 20.16 వేల కోట్లను 25.35 లక్షల రైతులకు మాత్రమే మాఫీచేసి రుణమాఫీ అయిపోయిందని కాంగ్రెస్ దబాయిస్తున్నది.
ఇక, రెండో మోసం బోనస్. వరి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరకు, జొన్నలు వంటి 10 పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. ఆ హామీ బోగస్‌గా మారింది. తొలుత అన్ని వడ్లకు ఇస్తామని చెప్పి, ఇప్పుడు సన్నాలకేనని కోతలు పెట్టింది. వానకాలంలో 156 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే, ప్రభుత్వం కొనుగోలు చేసింది 50 లక్షల టన్నులే. పండిన ధాన్యంలో 30 శాతం కొనుగోలు చేసి బోనస్ అమలు చేశామని గొప్పలు చెప్పుకున్నది.
రైతు భరోసా రైతులకు తీరని వ్యథగా మారింది. ఎకరానికి రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ. 15 వేల చొప్పున పెట్టుబడి సాయంగా ఇస్తామని హామీ ఇచ్చి 2024 మొత్తం ఇవ్వకుండానే ఎగ్గొట్టింది. 2023లో యాసంగి అక్టోబర్‌లో అప్పటి కేటీఆర్ ప్రభుత్వం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసి ఇవ్వకుండా అడ్డుకున్నది. ఏడాదిగా రెండు పంటలకు రైతుభరోసా ఇవ్వలేదు. ఇప్పుడేమో ఎకరానికి రూ. 12 వేలు మాత్రమే, అదికూడా సాగు యోగ్యత కలిగిన భూమికి మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నది.
కేసీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల రాష్ట్రంలో వానకాలంలో సాగునీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో 136 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేశారు. అయితే, యాసంగిలో నీటి కొరతతో సాగు 60 లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితమై పోయిం ది. మిగిలిన 76 లక్షల ఎకరాలు సాగు యోగ్యమైనా నీళ్ల కొరతతో సాగు కాలేదు. కాబట్టి ప్రభు త్వం 136 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇస్తుం దా? లేదంటే 60 లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చి 76 లక్షలకు ఎగ్గొడుతుందా? అన్నది చూడాలి. 2024లో ఎకరానికి రూ.17,500 చొప్పున రైతులకు బాకీపడిన సొమ్మును ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించిన కేటీఆర్ నోరు మూయించడానికి, నిర్బంధించడానికి కుట్రలకు తెరలేపారు.
వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని కాంగ్రెస్ మరో హామీనిచ్చినా ఇప్పటి వరకు భూమి లేని రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయలేదు. ఇచ్చిన హామీని అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ఆరు గ్యారెంటీల్లో ముఖ్యమైన అంశం పట్ల కూడా కనీసం ఆలోచన లేకపోవడం నిరుపేదలపై కాంగ్రెస్‌కు ఉన్న కపట ప్రేమకు నిదర్శనం. కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని డిసెంబర్ 28న ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క హడావుడిగా ప్రకటించారు. దీంతో సీఎంకు కోపం వచ్చినట్టుగా ఉంది. అందుకే రైతు కూలీ పథకాన్ని జనవరి 26 తర్వాత అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి ఎలాంటి విధివిధానాలు ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ఏడాది దాటినా ఒక్క దానినీ సంపూర్ణంగా అమలు చేయలేదు. ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యమకారులకు ఇంటి స్థలం, మహిళలకు రూ. 2,500 భృతి, రూ. 4 వేల పెన్షన్ వంటి హామీలు మొదలే కాలేదు. కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం జాడే లేదు. 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్, ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ, రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రయోజనాలు, అంగన్వాడీ, ఆశ, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల జీతాల పెంపు, కామారెడ్డి, వరంగల్ డిక్లరేషన్ మొదలగునవి కనుచూపు మేరలో లేవు కూడా.
కేసీఆర్ ప్రభుత్వం దరఖాస్తు, దస్కత్ లేకుండా సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా కృషి చేసింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉద్యమ సమయంలో గుర్తించిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ప్రజల ఆకాంక్షలనే ప్రభుత్వ అజెండాగా మార్చి పదేండ్లు వికాసంపైనే దృష్టిసారించి రాష్ర్టాన్ని పరుగులు పెట్టించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలోనే వికాసాన్ని విధ్వంసంగా మార్చింది. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేస్తామని చెప్తూ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నది. చివరికి తెలంగాణ అస్తిత్వంపై చేసిన వికృత రాజకీయం వికటించి తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురైంది. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, బతుకమ్మ మాయం, కాకతీయ, చార్మినార్ చిహ్నాల మార్పు వంటి వాటిని బీఆర్ఎస్ వ్యతిరేకులు సైతం జీర్ణించుకోలేకపోయారు.
ఇటీవల కేటీఆర్ చెప్పినట్టు ప్రతిరోజూ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాల్సిన స్థితిని రేవంత్‌రెడ్డి స్వయంగా కల్పిస్తున్నారు. ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించి ప్రజల పక్షా నిలిచి రాజీలేని పోరాటాలు చేసి విజయం సాధించడం బీఆర్ఎస్ ముందున్న కర్తవ్యం. నిర్బంధాలు, అరెస్టులు, జైళ్లు, ఉద్యమాలు బీఆర్ఎస్కు కొత్త కాదు. 14 ఏండ్లు కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సుదీర్ఘ లక్ష్యాన్ని ఛేదించి జాతీయ పార్టీల మనుగడకే ప్రమాద ఘంటికలు మోగించిన బీఆర్ఎస్ అన్ని అడ్డంకులను ఎదుర్కొని అజేయంగా విజయం వైపు అడుగులు వేస్తున్నది.
– (వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్)
జి.దేవీప్రసాద్ రావు